
AP skill development scam updates(AP news today telugu):
స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టైన తర్వాత రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ పీవీ రమేశ్ పై వివాదం రాజుకుంది. ప్రస్తుతం ఆయన మేఘా ఇంజినీరింగ్ సంస్థలో పనిచేస్తున్నారు. అయితే తాజాగా పరిణామాల నేపథ్యంలో ఆయన ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. తన రిజైన్ లెటర్ ను ఆ సంస్థ ఎండీ కృష్ణారెడ్డికి పంపించారు. వ్యక్తిగత కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నానని రాజీనామా లేఖలో పేర్కొన్నారు.
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో సీఐడీ తీరుపై పీవీ రమేశ్ అనేక సందేహాలు, అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఆయన మేఘా ఇంజినీరింగ్ సంస్థకు గుడ్ బై చెప్పడం ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఏపీ ప్రభుత్వం పోలవరం సహా అనేక కీలక ప్రాజెక్టులను ఈ సంస్థకే ఇచ్చింది. సీఎం జగన్ కు మేఘా ఇంజినీరింగ్ సంస్థ ఎండీ కృష్ణారెడ్డి అత్యంత సన్నిహతులను టాక్. ఈ క్రమంలో పీవీ రమేశ్ రిజైన్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.
రాజీనామా చేయాలని పీవీ రమేశ్ పై మేఘా సంస్థ ఒత్తిడి చేసినట్లు సోషల్ మీడియా ప్రచారం జరిగింది. అయితే ఆ వార్తలను ఆయన ఖండించారు. తనను రాజీనామా చేయాలని ఎవరూ కోరలేదని వివరణ ఇచ్చారు. తాను నిరంతరం ప్రజాసేవ కోసమే పనిచేశానన్నారు. జీవితంలో ఎప్పుడూ కూడా ఒత్తిళ్లకూ తలొగ్గనన్నారు. రాజకీయ, సామాజిక, ఆర్థిక, వ్యాపార ఒత్తిళ్లకు అతీతంగా పనిచేశానని వివరించారు. ప్రజాప్రయోజనాల కోసమే పని చేయాలన్నదే తన ధ్యేయమని చెప్పారు. అందుకు విరుద్ధంగా దేవుడు కూడా తనను ప్రభావితం చేయలేడని పీవీ రమేశ్ పేర్కొన్నారు.
చంద్రబాబు హయాంలో ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శిగా పీవీ రమేశ్ పనిచేశారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో గతంలో ఆయనను సీఐడీకి విచారించింది. ఆ సమయంలో లిఖితపూర్వక సమాధానాలు ఇచ్చారు. ఆ స్టేట్‌మెంట్ ఆధారంగానే చంద్రబాబును సీఐడీ అరెస్ట్ చేసిందనే వార్తలు వచ్చాయి.
ఈ న్యూస్ వచ్చిన వెంటనే పీవీ రమేశ్ స్పందించారు. తన వాంగ్మూలంతోనే చంద్రబాబును అరెస్ట్ చేశారనడం హ్యాస్యాస్పదంగా పేర్కొన్నారు. తాను అప్రూవర్‌గా మారారనే ప్రచారం అవాస్తవమని స్పష్టం చేశారు. అసలు ఫైలే లేకుండా కేసులు ఎలా పెడతారు? ప్రశ్నించారు. స్కిల్ డెవలప్‌మెంట్‌లో ఆర్థికశాఖ ఏ తప్పూ చేయలేదని వివరణ ఇచ్చారు. సీఐడీ తీరుపై అనుమానాలు వ్యక్తం చేశారు. తాను చెప్పిన విషయాలను సీఐడీ తనకు అనుకూలంగా మార్చుకుందని సందేహం వ్యక్తం చేశారు. ఈ కేసులో స్కిల్ డెవలప్‌మెంట్ ఎండీ, కార్యదర్శి పాత్రే ప్రధానమన్నారు. కానీ వారి పేర్లు ఎందుకు లేవు? అని నిలదీశారు. స్కిల్ డెవలప్‌మెంట్‌పై రాసిన నోట్ ఫైల్స్ ఏమయ్యాయి? అని ప్రశ్నించారు. తప్పు చేసిన అధికారులను కాకుండా మాజీ సీఎంను అరెస్ట్ చేయడమేంటి? అని అన్నారు. నైపుణ్యాభివృద్ధి ప్రాజెక్టును ఆమోదించడం, బడ్జెట్ కేటాయించడంలో అజేయ కల్లం, ప్రేమ్ చంద్రారెడ్డిదే కీలక పాత్రని పీవీ రమేష్ తెలిపారు.
పీవీ రమేశ్ కామెంట్స్ పై ఏపీ సీఐడీ కూడా స్పందించింది. ఆయన ఇచ్చిన స్టేట్‌మెంట్‌తోనే కేసు మొత్తం నడవడం లేదని సీఐడీ వర్గాలు వివరణ ఇచ్చాయి.
కేసు కోర్టు పరిధిలో ఉండగా పీవీ రమేశ్ వ్యాఖ్యలు చేయడాన్ని తప్పుపట్టాయి. ఇది దర్యాప్తును, విచారణను ప్రభావితం చేయడమే అవుతుందని సీఐడీ పేర్కొంది.