Vijay Sai Reddy: మాజీ సీఎం జగన్ కు భారీ షాక్ తగిలింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా వ్యవహరించిన విజయ సాయి రెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించేశారు. ఈ మేరకు తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ట్వీట్ చేసి, ఇక మున్ముందు వ్యవసాయం చేస్తానంటూ ప్రకటించారు. గత కొన్ని నెలలుగా సైలెంట్ గా ఉన్న విజయ సాయి రెడ్డి ఉన్నట్లుండి ఒక్కసారిగా రాజకీయాలకు గుడ్ బై చెప్పడంతో వైసీపీ క్యాడర్ నివ్వెరపోయింది. అలాగే వైసీపీ సెకండరీ గ్రేడ్ నాయకులు పార్టీలో ఏం జరుగుతుందంటూ తీవ్ర చర్చలు సాగిస్తున్నారు. అసలు విజయసాయిరెడ్డి రాజీనామా వెనుక ఉన్న మతలబు ఇదేనా అంటూ మరో చర్చ కూడా దారి తీస్తోంది.
మాజీ సీఎం జగన్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన సమయం నుండి నెంబర్ 2 స్థానంలో విజయ సాయి రెడ్డి కొనసాగారు. జగన్ పాదయాత్ర సక్సెస్ వెనుక సాయి రెడ్డి హస్తం ఉందన్నది కాదనలేని వాస్తవం అంటారు రాజకీయ విశ్లేషకులు. పార్టీ జోలికి వచ్చినా, వైయస్సార్ కుటుంబం పై ఎవరైనా విమర్శలు చేసినా గరం గరం కామెంట్స్ చేసేవారు విజయసాయిరెడ్డి. అయితే విజయసాయి రెడ్డికి జగన్ కూడా అంతే ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు.
రాజ్యసభ సీటు ఎప్పుడు విజయసాయిరెడ్డికి ఖరారు చేస్తూ రాగా, ఢిల్లీ పెద్దలతో విజయ సాయి రెడ్డి దౌత్యం నడిపే వారన్న వార్తలు ఉన్నాయి. జగన్ బెయిల్ విషయంపై ఎప్పుడు చర్చ వచ్చినా, విజయ సాయి రెడ్డి అక్కడే మకాం వేసేవారు. అయితే 2024 ఎన్నికల్లో నెల్లూరు పార్లమెంటు నుండి విజయసాయిరెడ్డి పోటీ చేశారు. అక్కడ ఘోర ఓటమి చవిచూడాల్సి వచ్చింది.
ఎన్నికల ఫలితాలు వచ్చిన సమయం నుండి సైలెంట్ అయ్యారు విజయసాయిరెడ్డి. ఒకానొక దశలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విజయసాయిరెడ్డికి జగన్ కు పొసగడం లేదన్న వదంతులు కూడా వ్యాపించాయి. వాటన్నిటికీ పుల్ స్టాప్ పెడుతూ నెల్లూరు ఎంపీ బరిలో విజయసాయిరెడ్డిని ఉంచారు జగన్. ఇక ఎన్నికల ఫలితాల అనంతరం పలు సమావేశాల్లో సైతం విజయసాయిరెడ్డి కనిపించారు. వైయస్ షర్మిళ నేరుగా జగన్ ను లక్ష్యంగా చేసుకొని చేసిన విమర్శలను విజయసాయిరెడ్డి తిప్పి కొట్టారు. దీంతో షర్మిళ సైతం విజయసాయిరెడ్డి పై గుర్రుమంటూ రివర్స్ అటాక్ ఇచ్చారు. ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు విజయసాయిరెడ్డి.
తన ట్విట్టర్ అకౌంట్ హ్యాండిల్ ద్వారా నిరంతరం తెలుగుదేశం పార్టీ, జనసేనలపై విమర్శలు కురిపించే విజయసాయిరెడ్డి గత కొన్ని నెలలుగా సైలెంట్ అయ్యారు. అయితే ప్రస్తుతం పరిస్థితులు చక్కబడే వరకు సైలెంట్ గా ఉంటారని అందరు భావించారు. కానీ విజయసాయిరెడ్డి పొలిటికల్ బాంబు విసిరారు. అది కూడా నేరుగా వైసీపీపైనే. తాను రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్లు, ఈనెల 25వ తేదీ రాజ్యసభ సభ్యత్వానికి సైతం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు చంద్రబాబుతో తనకు వైరం లేదని, పవన్ కళ్యాణ్ తో తన స్నేహం ఎప్పటికీ కొనసాగుతుందని విజయసాయిరెడ్డి చెప్పడం విశేషం.అంతేకాదు జగన్ విదేశాలలో ఉన్నప్పుడే రాజీనామా ప్రకటించడం కొసమెరుపు.
ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుందని ప్రచారం సాగుతున్న క్రమంలో నేరుగా నెంబర్ 2 స్థానంలో ఉన్న విజయసాయిరెడ్డి పార్టీకి రాజీనామా చేయడంపై పార్టీ క్యాడర్ సైతం నివ్వెర పోయింది. ఏదో బలమైన కారణం తోనే విజయ్ సాయి రెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పారని, మాజీ సీఎం జగన్ కు విజయసాయి రెడ్డికి విభేదాలు తారాస్థాయికి చేరాయని కూడ ప్రస్తుతం పొలిటికల్ టాక్ నడుస్తోంది.
Also Read: జగన్ కు భారీ షాక్.. రాజకీయాలకు విజయసాయి రెడ్డి గుడ్ బై!
మొత్తం మీద ఏ కారణంతో విజయసాయిరెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పారో కానీ.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఊహించని దెబ్బ కొట్టారని చెప్పవచ్చు. ఇంతకు విజయసాయిరెడ్డి మున్ముందు రైతన్న అవతారంలో మనకు కనిపిస్తారా? లేక తన రాజకీయ చక్రవ్యూహం ప్రదర్శించి మళ్లీ రాజకీయాల్లో జెండా పాతేస్తారా అన్నది మున్ముందు తెలియాల్సి ఉంది.