Bollywood: ఆమె వయసు 52 ఏళ్ళు.. అయినప్పటికీ అందం విషయంలో ఏమాత్రం తీసిపోదు. తన నటనతో అప్పట్లో బాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగింది. కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టించింది. ఆమె సినిమాలో నటిస్తోందంటే ఆమె కోసమే థియేటర్లకు బారులు తీరిన ఆడియన్స్ కూడా ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే, ఆమె తన అందంతో, నటనతో యువతను ఎలా ఆకట్టుకుందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి ఈమె సడన్గా సన్యాసం తీసుకుని, అందరిని ఆశ్చర్యపరుస్తోంది. తమ అందమైన హీరోయిన్ సన్యాసం తీసుకోవడంతో అభిమానులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఇంత కఠిన నిర్ణయం తీసుకోవడం వెనుక అసలు కారణం ఏంటి? అంటూ ప్రశ్నిస్తున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం
కుర్రకారు ఆరాధ్య దేవతగా నిలిచిన మమతా కులకర్ణి..
ఆమె ఎవరో కాదు ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ మమతా కులకర్ణి(Mamatha Kulkarni). తన అందంతో బాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన ఈమె తెలుగులో ప్రేమశిఖరం, దొంగా పోలీస్ వంటి సినిమాలలో కూడా నటించి ఆకట్టుకుంది. ఇక దీంతో తెలుగు సినిమా అభిమానులకు కూడా దగ్గరైన ఈమె. మళ్లీ తెలుగు ఇండస్ట్రీలో కనిపించలేదు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తూ అందరిని ఆకట్టుకునేది. ఇక ఇప్పుడు సడన్గా సన్యాసం పుచ్చుకొని కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రస్తుతం మహాకుంభమేళా ఘనంగా జరుగుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే అలహాబాద్ లో జరుగుతున్న కుంభమేళాలో సన్యాసం తీసుకుని, మిగతా శేష జీవితాన్ని దేవుడికే అర్పిస్తోంది మమతా కులకర్ణి. 52 ఏళ్ల వయసులో ఉత్తరప్రదేశ్ ప్రయోగరాజ్ అలహాబాద్ లో జరుగుతున్న మహా కుంభమేళా సాక్షిగా సన్యాసం స్వీకరించి సాధ్విగా మారిపోయింది.
మహా కుంభమేళా సాక్షిగా సన్యాసం స్వీకరించిన బాలీవుడ్ బ్యూటీ..
2025 జనవరి 24వ తేదీన ఉదయం మహాకుంభమేళాలోని కిన్నార్ అఖారాల్లో ఆచార్య మహామండలేశ్వర్ డాక్టర్ లక్ష్మీనారాయణ త్రిపాఠి సమక్షంలో ఈమె సన్యాస దీక్ష తీసుకున్నారు. పూర్తిగా కాషాయ దుస్తులు ధరించి, మెడలో రుద్రాక్ష మాల భుజానికి వేలాడుతున్న కుంకుమపువ్వుతో నిజమైన సాధ్విగా మారిపోయారు. ముఖ్యంగా సన్యాసం పుచ్చుకున్న తర్వాత మమతా కులకర్ణి తన పేరును కూడా మార్చుకోవడం జరిగింది. ఆమె కొత్త పేరు “మై మమతానంద్ గిరి సాధ్వి”. మమతా కులకర్ణి సన్యాసం తీసుకున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నారు. ముఖ్యంగా ఆమె పూర్తిగా సాధ్విగా మారిన దృశ్యాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇక ఇదే విషయంపై ఆమె మాట్లాడుతూ..” మహా కుంభమేళాకు రావడం, దాని గొప్పతనాన్ని చూడడం, నాకు మరుపురాని క్షణంగా మారిపోయింది. మహా కుంభమేళా సాక్షిగా సన్యాసం స్వీకరించడం అనేది నా అదృష్టం” అంటూ మమత కులకర్ణి తెలిపింది. మమతా కులకర్ణి విషయానికి వస్తే.. 90లలో బాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగిన ఈమె, ఆ తర్వాత ఎన్నో కాంట్రవర్సీలో ఇరుక్కుని తరచూ వార్తల్లో నిలిచేది. ఇక ఇప్పుడు మళ్లీ సన్యాసం స్వీకరించి, ఇప్పుడు కూడా వార్తల్లో నిలిచింది మమతా కులకర్ణి. ఇక ఇప్పటినుంచి తన శేష జీవితాన్ని దేవుడికి అంకితం చేసింది ఈ ముద్దుగుమ్మ.