Raghu Rama Krishna Raju: ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు రూటే సపరేట్. పంచులతో కామెంట్స్ చేయడం, గోదావరి యాస లో విమర్శలు గుప్పించడంలో ఈయనకు ఈయనే సాటి. ఈయన కామెంట్స్ చేశారంటే సోషల్ మీడియాలో వైరల్ కావాల్సిందే. తాజాగా పులివెందుల ఇంచార్జ్ నేనే అంటూ త్రిబుల్ ఆర్ గా పిలుచుకొనే ఈయన చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. జగన్ కు పోటీగా త్రిబుల్ ఆర్ పోటీ అంటే ఆ కిక్కే వేరప్పా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం జగన్ పై ధికారస్వరం వినిపించిన త్రిబుల్ ఆర్, రోజూ రచ్చబండ పేరిట జగన్ పై విమర్శలు గుప్పించేవారు. వైసీపీ పాలనలో నరసాపురం ఎంపీగా స్వంత జిల్లాలోకి అడుగుపెట్టలేని పరిస్థితి ఈయనది. కూటమి ప్రభుత్వం అధికారం చేజిక్కించుకోవడంలో త్రిబుల్ ఆర్ పాత్ర కూడా ఉందని చెప్పవచ్చు. ప్రతిరోజూ గంటపాటు జగన్ గురించి ఏదొక అంశం మీద మాట్లాడడం, సోషల్ మీడియాలో వైరల్ చేయడం.. ఇదే తంతుగా సాగించారు. ఆ తర్వాత ఎన్నికల సమయం వచ్చింది.. టీడీపీలో చేరారు త్రిబుల్ ఆర్. ఉండి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత ఏకంగా డిప్యూటీ స్పీకర్ పదవిని దక్కించుకున్నారు.
వైసీపీ అధికారాన్ని కోల్పోయినా త్రిబుల్ ఆర్ మాత్రం ఇంకా ఆ పార్టీని, జగన్ ను వెంటాడుతున్నారని చెప్పవచ్చు. త్రిబుల్ ఆర్ ను వైసీపీ ప్రభుత్వ హాయాంలో అరెస్ట్ చేసి, కస్టోడియల్ టార్చర్ చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ప్రస్తుతం విచారణ సాగుతోంది. వదల బొమ్మాళీ.. వదల అనే రేంజ్ లో ఆ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న త్రిబుల్ ఆర్.. ఇప్పటికే పలువురిని జైలు దారి పట్టించారు. ఇలాంటి సమయంలో కుంభమేళాకు త్రిబుల్ ఆర్ వెళ్లారు. అక్కడికి పులివెందుల టీడీపీ ఇంచార్జ్ బీటెక్ రవితో కలిసి వెళ్ళిన త్రిబుల్ ఆర్ పూజలు నిర్వహించారు. ఆ తర్వాత త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు.
కుంభమేళాకు వెళ్లిన త్రిబుల్ ఆర్.. అక్కడ కూడా జగన్ పేరును ఉచ్చరించారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరిస్తున్న సమయంలో బీటెక్ రవి దీపాలను నదిలోకి వదిలారు. అప్పుడే త్రిబుల్ ఆర్ గట్టిగా.. పులివెందులకు ఉప ఎన్నికలు రావాలి అంటూ అరిచారు. ఈ కామెంట్స్ పై స్పందించిన బీటెక్ రవి.. పులివెందులకు ఉప ఎన్నికలు వస్తే మీరే, ఇంచార్జ్ గా రావాలని కోరారు. అప్పుడు ఔను నేనే వస్తాను. పులివెందులకు ఉపఎన్నికలు వస్తాయి అంటూ జోస్యం చెప్పారు. ఇటీవల త్రిబుల్ ఆర్ పలుమార్లు.. జగన్ అసెంబ్లీకి రాకుంటే పులివెందులకు బై ఎలక్షన్స్ ఖాయం అంటూ ప్రకటించారు. ఆ కామెంట్స్ వైరల్ గా మారిన విషయం తెలిసిందే. తాజాగా కుంభమేళాకు వెళ్లిన త్రిబుల్ ఆర్.. త్రివేణి సంగమంలో నిలబడి పులివెందులకు ఉపఎన్నికలు రావాలంటూ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది.
Also Read: తునిలో హైటెన్షన్.. మరోసారి మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా
కుంభమేళాకు వెళ్లినా జగన్ ను వీడని నీడను నేనే అనే రేంజ్ లో త్రిబుల్ ఆర్ మాత్రం ఒక పట్టాన వదిలేలా లేరని నెటిజన్స్ ఆ వీడియోకు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తం మీద పులివెందుల ఇంచార్జ్ గా త్రిబుల్ ఆర్ వెళ్లారంటే, ఆ కిక్కే వేరప్పా అంటూ, మరికొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. జగన్ అసెంబ్లీకి రాకుంటే అదే ఖాయమని పలువురు అభిప్రాయ పడుతున్నారు.