
Viveka Murder Case Updates: ఏప్రిల్ 25 వరకు అవినాష్‌రెడ్డిని అరెస్ట్ చేయవద్దంటూ తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. హైకోర్టు తీర్పుపై వివేకా కూతురు సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంలో అవినాష్‌రెడ్డికి షాక్ తగిలింది. ఈ నెల 25 వరకు అవినాష్‌రెడ్డిని అరెస్ట్ చేయవద్దంటూ ఇచ్చిన హైకోర్టు ఉత్తర్వులను రద్దు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది సుప్రీంకోర్టు.
మరోవైపు, అవినాష్ రెడ్డికి విచారణ సమయంలో సీబీఐ అడిగే ప్రశ్నలు లిఖితపూర్వకంగా ఇవ్వాలని హైకోర్టు ఆదేశించడాన్ని కూడా సుప్రీం తప్పుబట్టింది. హైకోర్టు ఇలాంటి ఉత్తర్వులు జారీ చేయకూడదని అభిప్రాయపడింది. ఈ ఆదేశాల వల్ల సీబీఐ దర్యాప్తుపై ప్రభావం పడుతుందని తెలిపింది.
విచారణ సందర్భంగా అవినాష్‌కు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ సుప్రీంలోనూ ఆయన తరఫు న్యాయవాదులు వాదించారు. ముందస్తు బెయిల్‌ను తెలంగాణ హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీం చెప్పింది. అప్పటి వరకైనా అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరగా.. అందుకు సుప్రీం తిరస్కరించింది. సీబీఐ అరెస్ట్ చేస్తుందని మీరు భావిస్తున్నారా? అని ప్రశ్నించింది. సీబీఐ అరెస్ట్ చేయాలనుకుంటే ఎప్పుడో అరెస్ట్ చేసేదని వ్యాఖ్యానించింది.
మరోవైపు, వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు గడువును జూన్ 30 వరకు వరకు పొడిగించింది సుప్రీంకోర్టు. గత తీర్పు ప్రకారం ఏప్రిల్ 30తో విచారణ ముగించాల్సి ఉండగా.. వైఎస్ సునీత కోరిన మేరకు గడువును మరో రెండు నెలల పాటు పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.