Amaravathi : విశాఖ కేంద్రంగా పాలన ప్రారంభించేందుకు ఏపీ సీఎం జగన్ కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. వీలైతే ఉగాది నుంచి వైజాగ్ కు షిప్టింగ్ మొదలుపెట్టాలని చూస్తున్నారు. మరోవైపు విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ కు విశాఖ ఆతిథ్యం ఇస్తోంది. ఈ కార్యక్రమం కోసం ప్రచారం చేపట్టిన సమయంలోనే ఏపీ రాజధాని విశాఖ అని ప్రభుత్వం ప్రకటన చేయడం దుమారం రేపింది. విశాఖ నుంచి పాలన ప్రారంభమవుతుందని సీఎం జగన్ ఢిల్లీ వేదికగా ప్రకటన చేశారు. సీఎంవోను త్వరలోనే అమరావతి నుంచి తరలిస్తామని స్పష్టం చేశారు. సీఎం ప్రకటనపై ఏపీలో ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. అమరావతి నుంచి రాజధానిని తరలించడానికి వీల్లేదని స్పష్టం చేశాయి.
ఆ తర్వాత బెంగళూరు వేదికగా ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మరో బాంబు పేల్చారు. ఏపీకి ఒక్కటే రాజధాని ఉంటుందని అది విశాఖపట్నం మాత్రమేనని తేల్చిచెప్పారు. అసలు అమరావతి పేరునే ఆయన ప్రస్తావించకుండా ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ పై బెంగళూరులో ప్రచారం నిర్వహించారు. కర్నాటక మాదిరిగానే గుంటూరులో ఒక సెషన్ అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. దీంతో ఏపీలో ప్రతిపక్షాలు మరోసారి గగ్గోలు పెట్టాయి. రాజధాని విషయంలో ప్రభుత్వం తీరును తప్పుపట్టాయి. ఆ తర్వాత ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి రంగంలోకి దిగి ఏపీకి మూడు రాజధానులు ఉంటాయని వివరణ ఇచ్చారు. ఆ తర్వాత కూడా విశాఖ కేంద్రంగానే పాలన చేస్తామని వైసీపీ నేతలు ప్రకటిస్తూనే ఉన్నారు. తాజాగా టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఇదే విషయాన్ని చెప్పారు. మరోవైపు విశాఖలో ప్రభుత్వ కార్యాలయాల కోసం భవనాలు వెతికే పనిలో అధికారులు ఉన్నారు.
వైసీపీ ప్రభుత్వం విశాఖ కేంద్రంగా పాలనా చేపట్టాలని తొందరపడుతున్నా..రాజధానిపై సుప్రీంకోర్టు తీర్పు ఇంకా రాకపోవడం ప్రధాన అడ్డంకిగా మారింది. అందుకే విచారణ త్వరగా పూర్తి చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదులు మరోసారి సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు.అయితే ఈ వినతిని జస్టిస్ కేఎం జోసెఫ్ ధర్మాసనం తోసిపుచ్చింది. అమరావతిపై దాఖలైన పిటిషన్లను మార్చి 28నే విచారణ చేపడతామని తేల్చిచెప్పింది. కానీ మార్చి 29, 30న కూడా విచారించాలని ఏపీ ప్రభుత్వ న్యాయవాదులు కోరారు. దీనిలో రాజ్యాంగపరమైన అంశాలు చాలా ఇమిడి ఉన్నాయని జస్టిస్ కేఎం జోసెఫ్ వ్యాఖ్యానించారు. తమ విజ్ఞప్తిని సీజేఐ ముందు ప్రత్యేకంగా ప్రస్తావించేందుకు అనుమతివ్వాలని ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కోరగా ధర్మాసనం నిరాకరించింది.
అమరావతి కేసులను విచారణ జాబితాలో త్వరగా చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్‌రెడ్డి సోమవారం జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బి.వి.నాగరత్నతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట ప్రస్తావించారు. అప్పుడు కూడా మార్చి 28నే విచారణ చేపడతామని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. 3 రోజుల్లో మరోసారి కేసులు త్వరగా విచారించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టును కోరారు. అయితే మరోసారి సుప్రీంకోర్టు అదే నిర్ణయాన్ని ప్రకటించింది. మార్చి 22న ఉగాది . ఈ లోపు రాజధానిపై తీర్పు వస్తే ఉగాది రోజు విశాఖలో పాలన ప్రారంభించాలని ఏపీ ప్రభుత్వం భావించింది. కానీ ఉగాది తర్వాత సుప్రీంకోర్టు తీర్పు వెలువడనుంది. అందుకే ఏప్రిల్ లో విశాఖ నుంచి పాలన చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.