YS Viveka Murder Case: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సుప్రీంకోర్టు నేడు సంచలన నిర్ణయాలు తీసుకుంది. ఈ కేసులో ఇప్పటికే బెయిల్‌పై ఉన్న నిందితుల విషయంలో ఏం చేయాలో స్పష్టత ఇవ్వాలని సీబీఐకి ఆదేశించింది. ముఖ్యంగా, ఎంతమంది నిందితుల బెయిల్స్ రద్దు చేయాలన్నది, ఇంకా ముందుకు దర్యాప్తు కొనసాగించాల్సిన అవసరం ఉందా లేదా అన్న విషయాలపై నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వివేకా కుమార్తె సునీతతో పాటు సీబీఐ కూడా దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిగింది. సాక్షులను నిందితులు బెదిరిస్తున్నారని, దర్యాప్తుపై ప్రభావం చూపేందుకు ప్రయత్నిస్తున్నారని పిటిషన్లలో ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు సీబీఐని నేరుగా ప్రశ్నిస్తూ, పూర్తి వివరాలు ఇవ్వాలని చెప్పింది.
Also Read: BRS Politics: ఉపరాష్ట్రపతి ఎన్నిక.. ఇండియా కూటమి అభ్యర్థిగా సుదర్శన్‌రెడ్డి, కేసీఆర్ మద్దతు ఇస్తారా?
అదే సమయంలో ధర్మాసనం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఐ అధికారి, సునీత, రాజశేఖర్ రెడ్డిపై పెట్టిన కేసులు ఎలాంటి బలం లేనివి, నిజమైనవికావని సుప్రీంకోర్టు తేల్చి, ఆ కేసులను కొట్టివేసింది. వీరి మీద కేసులు పెట్టడం వెనుక అసలు ఉద్దేశం దర్యాప్తును దెబ్బతీయడం, అధికార దుర్వినియోగం చేయడమేనని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అంతేకాకుండా, ఈ కేసులో సుప్రీంకోర్టు ఎదుట వాదించడానికి వచ్చిన ఆ లాయర్ ప్రవర్తన, వాదన తీరు న్యాయస్థానానికి నచ్చలేదు. ఆయన వ్యవహారం పట్ల ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. అయితే కోర్టు ఆ లాయర్‌పై వ్యక్తిగత గౌరవం వల్ల జరిమానా లేదా శిక్ష విధించకుండా మన్నించింది.
Also Read:Spy Pigeon: వామ్మో గూఢచారి పావురం.. కాలికి కోడ్ రింగ్, రెక్కలపై కోడ్ లెటర్స్.. ఎక్కడంటే..
ఇక సీబీఐ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది చేసిన వ్యాఖ్యలు కూడా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. నిందితులపై ఉరి శిక్ష విధించే స్థాయిలో ఆధారాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఒకటి, రెండేళ్లు జైల్లో ఉండటం పెద్ద విషయం కాదని, కానీ సాక్ష్యాలను నాశనం చేయడం, సాక్షులను బెదిరించడం మాత్రం తీవ్రమైన నేరమని వివరించారు. ఈ అంశాలపై స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని కూడా ఆయన ధర్మాసనానికి తెలియజేశారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు, సీబీఐకి స్పష్టమైన గడువుతో ఆదేశాలు ఇచ్చింది.
నిందితుల కస్టడీ అవసరమా? ఇంకా దర్యాప్తు చేయాలా? ఎవరి బెయిల్స్ రద్దు చేయాలన్నదాని గురించి తదుపరి విచారణలో సమాధానం ఇవ్వాలని సూచించింది. ఈ కేసు తదుపరి విచారణను వచ్చే నెల (సెప్టెంబర్) 9కి వాయిదా వేసింది. ఈ పరిణామాలతో కేసులో కొత్త మలుపు తిరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా, నాటి ప్రభుత్వం చేసిన అధికార దుర్వినియోగాన్ని సుప్రీంకోర్టు గుర్తించినట్లుగా తీర్పులోని వ్యాఖ్యలు సూచిస్తున్నాయి. ఇకపై దర్యాప్తు దిశ ఏ విధంగా మారుతుందో, నిందితుల భవితవ్యం ఏవిధంగా ఉండబోతుందో అన్నది వచ్చే విచారణలోనే తేలనుంది.