Vice President Candidate: ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎవరనేదానిపై ఉహాగానాలకు ఇండియా కూటమి తెర దించింది. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరును ఖరారు చేసింది. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మన తెలుగోడు కావడంతో అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సుదర్శన్ ఎప్పుడు ఎక్కడ జన్మించారో తెలుసా..
బి. సుదర్శన్ రెడ్డి జూలై 8, 1946 జన్మించారు. భారత సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, గోవా రాష్ట్రపు తొలి లోకాయుక్త చైర్మన్‌గా పేరుపొందిన ప్రముఖ న్యాయవేత్త. రంగారెడ్డి జిల్లా అకుల మైలారం గ్రామంలోని వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఆయన, ఒస్మానియా విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేసి 1971లో న్యాయవాదిగా నమోదు అయ్యారు. కె. ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో వృత్తి ప్రారంభించి, రాజ్యాంగ, సివిల్, రెవెన్యూ చట్టాలపై నైపుణ్యం సాధించారు. గవర్నమెంట్ ప్లీడర్, అడిషనల్ స్టాండింగ్ కౌన్సెల్, అడ్వకేట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వంటి పదవుల్లో సేవలందించారు.
1995లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిగా, 2005లో గౌహతి హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా, 2007లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులై 2011లో పదవీ విరమణ చేశారు. తన పదవీకాలంలో రాజ్యాంగం, మానవహక్కులు, బ్లాక్ మనీ కేసులపై కీలక తీర్పులు ఇచ్చారు. పదవీ విరమణ తర్వాత గోవా లోకాయుక్తగా, అలాగే కర్ణాటక మైనింగ్ పర్యావరణ పర్యవేక్షణ కమిటీ చైర్మన్‌గా పనిచేసి న్యాయవ్యవస్థలో విశిష్ట ముద్ర వేశారు.