Talliki Vandanam 2025: ఏపీలో తల్లికి వందనం స్కీమ్ అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనితో విద్యార్థుల తల్లుల ఖాతాలో నగదు జమ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ స్కీమ్ అమలులో భాగంగా నగదు జమ కావడంతో, పాఠశాలల పునః ప్రారంభం సంధర్భంగా ఖర్చులకు నగదు సమకూరిందని సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అలాగే ఈ స్కీమ్ అమలులో భాగంగా తల్లి ఖాతాలో నగదు జమ కాకుంటే ఏమి చేయాలన్నదే ఇప్పుడు ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానమే ఈ కథనం.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025 – 26 విద్యా సంవత్సరం నుండి అమలు చేయనున్న తల్లికి వందనం పథకం అనేక తల్లుల ఆశాజ్యోతి లాంటిది. ఈ పథకం ద్వారా పిల్లల చదువు కోసం ప్రతి అర్హ తల్లికి ఒక్కొక్క పిల్లవాడికి ఏడాదికి రూ.15,000 నగదు నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ చేయనున్నారు. అయితే ఈ మొత్తం చేతికి రాదు. ఇందులో నుండి రూ. 2,000ను నేరుగా మినహాయించి, రాష్ట్రంలోని పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, వాటి శుభ్రత, మరమ్మతులు, మౌలిక సదుపాయాల కోసం వినియోగిస్తారు. మిగిలిన రూ. 13,000 మాత్రం తల్లి లేదా గుర్తింపు పొందిన గార్డియన్ ఖాతాలోకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా జమ అవుతుంది.
ఈ మొత్తాన్ని పొందడానికి కొన్ని అర్హతలుండాలి. మీ పిల్లలు ప్రభుత్వ, ప్రైవేట్ ఎయిడెడ్, ప్రైవేట్ అన్ఎయిడెడ్ లేదా రెసిడెన్షియల్ పాఠశాలలలో 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు చదువుతున్నవారై ఉండాలి. పిల్లల హాజరు గడచిన విద్యా సంవత్సరంలో కనీసం 75% ఉండాలి. కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ. 10,000 లోపు, పట్టణాల్లో రూ.12,000 లోపు ఉండాలి. రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. కుటుంబంలో ఎవరు ఇన్‌కమ్ టాక్స్ చెల్లిస్తూ ఉంటే, లేదా నాలుగు చక్రాల వాహనం కలిగి ఉంటే (ట్రాక్టర్, ఆటో మినహాయింపు), వారు ఈ పథకానికి అర్హులు కావు. ముఖ్యంగా, తల్లి బ్యాంక్ ఖాతా ఆధార్‌తో NPCI ద్వారా లింక్ అయి ఉండాలి.
Also Read: Amaravati Tourism: అమరావతి సమీపంలో డేంజర్ రూట్.. ఆ ఒక్కటి దాటితే అన్నీ వింతలే!
జమ కాకుంటే ఇలా చేయండి
మీరు ఈ అర్హతలన్నీ కలిగి ఉన్నప్పటికీ డబ్బు జమ కాలేదంటే, ముందుగా మీ బ్యాంక్ ఖాతా NPCI ఆధార్ లింకింగ్ స్థితిని చెక్ చేయండి. మీ పిల్లల హాజరు శాతం సరిచూడండి. మీ బ్యాంక్ ఖాతా యాక్టివ్‌లో ఉందా, వివరాలు సరిగ్గా UDISE ద్వారా నమోదు అయాయా అనే విషయాలపై ధ్రువీకరణ చేయండి. ఇవన్నీ సరిగా ఉన్నా డబ్బు రాకపోతే వెంటనే ఫిర్యాదు చేయండి.
గ్రీవెన్స్ వ్యవస్థ మీకోసమే..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పథకానికి ప్రత్యేకంగా ఆన్‌లైన్ ఫిర్యాదు వ్యవస్థ ఏర్పాటు చేస్తోంది. మీ దగ్గర స్మార్ట్‌ఫోన్ లేకపోతే, మీ గ్రామ, వార్డు సచివాలయానికి వెళ్లి, అవసరమైన ఆధార్, రేషన్ కార్డు, పిల్లల హాజరు వివరాలు, బ్యాంక్ ఖాతా వివరాలు సమర్పించి ఫిర్యాదు నమోదు చేయించండి. మీరు చేసిన ఫిర్యాదును తరువాత ట్రాక్ కూడా చేసుకోవచ్చు.
ఇది తల్లుల గౌరవాన్ని పెంపొందించే గొప్ప కార్యక్రమం. విద్యలో పిల్లల హాజరును పెంచేలా చేస్తుంది. కానీ కొన్ని సాంకేతిక లోపాలు, ఆధార్ లింకింగ్ సమస్యలు వల్ల డబ్బు జమ కాకపోవచ్చు. అలాంటి సమస్యలు ఎదురైతే నిశ్శబ్దంగా ఉండకండి. మీ హక్కును వినియోగించుకోండి. ఫిర్యాదు చేయండి అంటోంది ప్రభుత్వం. మరెందుకు ఆలస్యం.. డబ్బు జమ కాకుంటే, ఇలా చేయండి!