తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలైను ఏపీ నుంచి కూటమి కోటాలో రాజ్యసభకు పంపించబోతున్నట్టు తెలుస్తోంది. సాక్షి మీడియాలో కూడా ఈ వార్తను హైలైట్ చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్రహోమంతి అమిత్‌షా భేటీలో రాజ్యసభ సీటు విషయమై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఆ సీటును అన్నామలైకు ఇచ్చేందుకు చంద్రబాబు సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఇటీవల, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై తన పదవికి రాజీనామా చేశారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో అన్నామలై రాజీనామా సంచలనంగా మారింది. అక్కడ అన్నాడీఎంకేతో బీజేపీ పొత్తు పెట్టుకుంది. రాష్ట్ర శాఖకు నైనార్ నాగేంద్రన్ ని అధ్యక్షుడిగా చేసి, అన్నాడీఎంకేతో కూటమి కట్టి.. తమిళనాడు రాజకీయాలను శాసించాలని చూస్తోంది బీజేపీ. ఈ క్రమంలో రెబల్ నాయకుడిగా పేరున్న అన్నామలైని రాజ్యసభకు పంపించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. 2023 ఎన్నికల సమయంలో అన్నాడీఎంకే నేతలను అన్నామలై ఘాటుగా విమర్శించారు. తాజా పొత్తు నేపథ్యంలో అన్నామలైని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తొలగించాలని అన్నాడీఎంకే నేతలు డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. ఆ షరతుతోనే వారు పొత్తుకి ఒప్పుకున్నట్టు చెబుతున్నారు. దీంతో అన్నామలైను బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పించి, ఆయన్ను శాంతింపజేసేందుకు ఇప్పుడు రాజ్యసభకు పంపిస్తున్నారు. ప్రస్తుతం ఏపీనుంచి రాజ్యసభకు ఒక ఖాళీ ఏర్పడింది. ఆ ఖాళీని అన్నామలైతో భర్తీ చేయబోతున్నారు. ఇప్పటి వరకు ఈ రేస్ లో అన్నామలై పేరు వినిపించలేదు కానీ, చంద్రబాబు ఢిల్లీ పర్యటన నేపథ్యంలో సడన్ గా ఆ పేరు తెరపైకి వచ్చింది, అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది.
విజయసాయి పరిస్థితి ఏంటి..?
వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా చేయడంతో ఆ ఖాళీ ఏర్పడింది. రాజీనామా తర్వాత తాను వ్యవసాయం చేసుకుంటానని విజయసాయి చెప్పారు. అయితే లిక్కర్ కేసులో ఆయన ఇటీవల పలుమార్లు పోలీస్ విచారణకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో తన వ్యవసాయం గురించి కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. తనకు ఇష్టమైతే వ్యవసాయం చేస్తానని, తన రాజకీయ జీవితాన్ని ఎవరూ నిర్ణయించలేదని చెప్పారు. దీంతో ఆయన రాజ్యసభ రీఎంట్రీ, అది కూడా బీజేపీ నుంచి ఖాయమైందని వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు అన్నామలై సడన్ ఎంట్రీతో అది సాధ్యం కాదని తేలిపోయింది.
ఇటీవల ఏపీనుంచి ముగ్గురు రాజ్యసభ సభ్యులు ఒకేసారి వైసీపీకి, తమ సభ్యత్వానికి రాజీనామా చేశారు. వారిలో బీదా మస్తాన్ రావు టీడీపీలో చేరి తిరిగి రాజ్యసభకు వెళ్లారు. మోపిదేవి వెంకట రమణ ఎంపీగా రాజీనామా చేసి టీడీపీలో చేరారు. అయితే టీడీపీ ఆ స్థానాన్ని సానా సతీష్ బాబుకి ఇచ్చింది. ఇక వైసీపీకి రాజీనామా చేసిన ఆర్.కృష్ణయ్య బీజేపీలో చేరి తిరిగి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. వీరి తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు. ఈ స్థానం విషయంలో ఇప్పటి వరకు సందిగ్ధం నెలకొంది. విజయసాయిరెడ్డి బీజేపీలో చేరి తిరిగి ఎంపీగా ఎన్నికవుతారనే ప్రచారం నడిచింది. అయితే ఈ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెడుతూ ఇప్పుడు అన్నామలై పేరు తెరపైకి వచ్చింది. అంటే విజయసాయిరెడ్డి పొలిటికల్ రీఎంట్రీ మరింత ఆలస్యం అవుతుందనమాట.