Raghurama Krishna :
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవికి.. ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ పదవికి మరెవరూ పోటీకి రాకపోవడంతో.. రఘురామను డిప్యూటీ స్పీకర్ గా ప్రకటిస్తూ, స్పీకర అయ్యన్న పాత్రుడు ప్రకటించారు. దాంతో.. సభానాయకుడు చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, స్పీకర్ అయ్యన్నపాత్రుడు.. దగ్గరుండి రఘురామను స్పీకర్ కుర్చీపై కూర్చోబెట్టారు. ఈ సందర్భంగా రఘురామ గురించి మాట్లాడిన సీఎం చంద్రబాబు.. అనేక ఆసక్తికర విషయాల్ని పంచుకున్నారు.
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రఘురామను రాష్ట్రానికి రానివ్వకుండా హింసించారని.. ఆ కారణంగానే ఇప్పుడు రఘురామ ముందు సభలోకి రాలేని, కూర్చోలేని పరిస్థితి వచ్చింది. ఇది దేవుడు రాసిన స్కిప్ట్ కాదా అని ప్రశ్నించారు. విశేష రాజకీయ అనుభవ ఉన్న అయ్యన్నపాత్రుని పై హత్యాచార యత్నం కేసు పెట్టారని గుర్తుచేసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. జగన్ హింసించిన ఇద్దరు ఇప్పుడు సభను నడిపించనున్నారని అన్నారు.
సభలో నవ్వులు, పువ్వులు..
జగన్ దుర్మార్గాలపై చంద్రబాబు మాట్లాడూ అనేక అంశాలను లేవనెత్తారు. చరిత్రలో జగన్ వంటి వ్యక్తి పాబ్లో ఎస్కోబార్ అనే కొలంబియాకు చెందిన నేరస్థుడి ప్రస్తావన తీసుకువచ్చారు. అప్పటికే.. తనను హింసించిన ఘటనల్ని గుర్తు తెచ్చుకున్న రఘురామ.. చంద్రబాబు మాటలతో మాట కలిపారు. పాబ్లో గురించిన విషయాన్ని మాట్లాడారు. దాంతో.. మీరు ఇప్పుడు స్పీకర్ ఛైర్ పై కూర్చున్నారు. మీరు మాట్లాడకూడదు అంటూ.. సభలోని వారు అనడంతో.. సభ అంతా ఒక్కసారిగా నవ్వులు విరిసాయి. రఘురామలో ఇంకా బాధ అలాగే ఉందన్న చంద్రబాబు, కుర్చీలో కూర్చుంది ఇప్పుడేగా.. కాస్తా సమయం పడుతుంది అంటూ.. నవ్వారు. దాంతో.. కాసేపు సభలో ఆహ్లాదకరంగా కనిపించింది.
రఘురామకు పదేపదే గుర్తుచేసిన సీఎం
స్వతహాగానే రఘురామ కృష్ణరాజు సరదాగా, గోదావరి వెటకారంతో మాట్లాడుతుంటారు. ముఖ్యంగా జగన్ అనగానే.. రఘురామ కు ఎక్కడ లేని ఆవేశం వస్తుంటుంది. కానీ.. ఆ విషయాన్నీ వ్యంగ్యంగా చెబుతుంటారు. ఈ విషయాన్నే పరోక్షంగా ప్రస్తావించిన సీఎం చంద్రబాబు నాయుడు.. మీరు ఇకపై గతంలోలా మాట్లాడేందుకు వీలవదని గుర్తుంచుకోవాలి అంటూ సూచించారు. మీరు మాట్లాడే మాటలు.. మీ కుర్చీకి వర్తిస్తాయని, అందుకే.. స్పీకర్ కుర్చీకి వన్నె తెచ్చేలా వ్యవహరించాలని అన్నారు. అంతకు మందు మాట్లాడిన పవన్ కళ్యాణ్ సైతం.. రఘురామ గతంలోలా మాట్లాడేందుకు వీలవదని, హుందాగా వ్యవహరించాల్సి ఉంటుందని గుర్తు చేశారు.
నన్న జైలులో పెట్టాక.. నువ్వు చెప్పిన విషయాన్ని నమ్మా..
రఘురామ కృష్ణరాజు చాలా ధైర్యవంతుడంటూ కొనియాడిన చంద్రబాబు.. జగన్ సీఎంగా ఉన్నప్పుడు రఘురామ అరెస్ట్ ఘటనను గుర్తు చేసుకున్నారు. అరెస్ట్ చేసిన అంశమే తప్పు అయితే.. ఏకంగా ఐదుగులు ముసుగులు వేసుకుని వచ్చి.. అరికాళ్లపై కొట్టడాన్ని సమర్థించకూడని అంశమన్నారు. గుండె ఆపరేషన్ అయిన మనిషి గుండెలపై కొట్టడం దారుణమన్నారు. పైగా.. రఘురామను కొడుతున్నప్పుడు.. జగన్ వీడయో కాల్ లో ఉన్నారని చెప్పినప్పుడు.. నమ్మశక్యం కాలేదని, కానీ.. స్వయంగా తానే ఆ విషయాన్ని ఎదుర్కొన్నాక నమ్మాల్సి వచ్చిందని అన్నారు. తాను జైలులో ఉన్నప్పుడు.. ఎలా ఉన్నానో చూసి ఆనందించేందుకు.. జైలులో సీసీ కెమెరాలు పెట్టించాలని ప్రయత్నించారు. దాని ద్వారా నేరుగా సీఎం చూడలని అనుకున్నారని ఆరోపించారు. అప్పుడు.. రఘురామ చెప్పిన విషయాలు గుర్తుకు వచ్చి, నమ్మకం మరింత బలపడిందని అన్నారు.