First Indian Hydrogen Train: ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే వ్యవస్థల్లో ఒకటైన భారతీయ రైల్వే సంస్థ లేటెస్ట్ టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ అప్ డేట్ అవుతున్నది. ఎప్పటికప్పుడు సరికొత్త రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నది. ఇప్పటికే అత్యాధునిక సెమీ హైస్పీడ్ వందేభారత్ రైళ్లు దేశ రైల్వే వ్యవస్థను కీలక మలుపు తిప్పాయి. అత్యధునిక సదుపాయాలు, అత్యంత వేగం ప్రయాణీకులకు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారతీయ రైల్వే సంస్థ మరో విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టింది. నీటితో నడిచే రైలును ప్రారంభించేందుకు సిద్ధం అవుతోంది. ఇప్పటి వరకు సంప్రదాయ డీజిల్, విద్యుత్ తో రైళ్లు నడుస్తుంగా ఇప్పుడు, హైడ్రోజన్ తో నడిచే రైళ్లు అందుబాటులోకి రాబోతున్నాయి. ఇంతకీ ఈ రైలు ఎక్కడ అందుబాటులోకి రాబోతుంది? దీని వేగం ఎంత? ఫీచర్లు ఏంటి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
నీటితో నడిచే రైలు వచ్చేస్తోంది!
ఒకప్పుడు ఆవిరి ఇంజిన్ తో రైళ్లు నడవగా, ఆ తర్వాత బొగ్గుతో నడిచే రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. నెమ్మదిగా డీజిల్ రైళ్లు తమ సేవలను ప్రారంభించాయి. ఆ తర్వాత విద్యుత్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటి వరకు ఉన్న రైళ్లకు పూర్తి భిన్నంగా హైడ్రోజన్ తో నడిచే రైళ్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ రైలుకు ఇంధనంగా నీటిని వాడటం విశేషం. తక్కువ ఖర్చు, కాలుష్య రహితంగా ఉండే ఈ రైళ్లను వీలైనంత త్వరగా ప్రయాణీకుల ముందుకు తీసుకురావాలని రైల్వే సంస్థ ప్రయత్నాలు మొదలు పెట్టింది. పర్యావరణ అనుకూల రైలు ప్రయాణంలో భారత్ లో కొత్త మైల్ స్టోన్ గా నిలువబోతోంది.
గంటకు 40 వేల లీటర్ల వినియోగం
అధునాతన హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీని కలిగి ఉన్న ఈ రైలు నీటితో నడుస్తుంది. ఈ రైలు గంటకు 40,000 లీటర్లను ఉపయోగించుకోనుంది. త్వరలో ఈ రైలుకు సంబంధించిన పైలెట్ ప్రాజెక్టు ప్రారంభం కాబోతోంది. వచ్చే నెల నుంచే ఈ రైలు పరీక్షలు జరపనున్నారు.
దేశం అంతటా 35 హైడ్రోజన్ రైళ్లు
భారతీయ రైల్వే సంస్థ దేశ వ్యాప్తంగా 35 హైడ్రోజన్‌తో నడిచే రైళ్లను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్, సపోర్టింగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ల ఇన్ స్టాలేషన్ ఇప్పటికే జరుగుతోంది. హైడ్రోజన్ ఉత్పత్తి ప్లాంట్ల డిజైన్లు ఇప్పటికే ఆమోదించబడ్డాయి. ఒక్కో హైడ్రోజన్ రైలు అంచనా వ్యయం సుమారు రూ. 80 కోట్లుగా ఉంటుందని రైల్వే సంస్థ వెల్లడించింది.
హైడ్రోజన్ రైలు ఫీచర్లు, వేగం
ఈ రైలు హైడ్రోజన్, ఆక్సిజన్ ను కలపడం ద్వారా విద్యుత్ ను ఉత్పత్తి చేస్తుంది. సాంప్రదాయ డీజిల్ ఇంజిన్ లా పొల్యూషన్ ను కాకుండా, కేవలం ఆవిరి, నీటిని మాత్రమే విడుదల చేస్తుంది. ఇది డీజిల్ రైళ్ల కంటే 60% నిశ్శబ్దంగా వెళ్తుంది. ఈ రైలు గంటకు 140 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. ఒక ఫుల్ ట్యాంక్ వాటర్ మీద 1,000 కిలో మీటర్ల వరకు ప్రయాణించే అవకాశం ఉంది.
తొలి హైడ్రోజన్ రైలు కోసం ప్రతిపాదిత మార్గాలు
భారత్ లో అందుబాటులోకి వచ్చే తొలి హైడ్రోజన్ రైలు హర్యానాలో తన సేవలను ప్రారంభించనుంది. జింద్-సోనిపట్ పరిధిలోని 90-కిలోమీటర్ల పరిధిలో ఈ రైలు నడవనుంది. డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే, నీలగిరి మౌంటైన్ రైల్వే, కల్కా-సిమ్లా రైల్వే, మాథేరన్ రైల్వే, కాంగ్రా వ్యాలీ రైల్వే, బిలిమోరా-వాఘై రైల్వే, మార్వార్-దియోగర్ మదరియా మార్గాల్లోనూ ఈ రైళ్లను ప్రవేశపెట్టాలని అధికారులు నిర్ణయించారు.
Read Also:ప్రయాణీకులకు గుడ్ న్యూస్, వందే భారత్ రైళ్ల కోచ్ లు పెరుగుతున్నాయ్!