AP MLC Elections: ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో అప్పుడే సందడి మొదలైంది. ఎమ్మెల్సీ సీటు కోసం ఆశావహులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కేవలం ఐదు సీట్లు కావడంతో కూటమి పార్టీల మధ్య బలమైన పోటీ నెలకొంది. ఇందులో జనసేనకు ఒకటి ఖాయమైంది. కాకపోతే బీజేపీ కూడా మాకు ఇవ్వాలని పట్టుబడినట్టు వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే టీడీపీకి కేవలం మూడు మాత్రమే మిగలనున్నాయి.
ఏపీలో ఎమ్మల్సీ ఎన్నికల సందడి
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 3న ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఎమ్మెల్యే కోటాలో జరుగుతుండడంతో అవన్నీ ఏకగ్రీవంగా ఎన్నిక జరగనుంది. ముఖ్యంగా కూటమి పార్టీల నుంచి అభ్యర్థులంతా ఎన్నిక కానున్నారు. ఏపీలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు కూటమి నేతల మధ్య పోటీ నెలకొంది.
పదవీకాలం ముగిసిన వారిలో జంగా కృష్ణమూర్తి , దువ్వారపు రామారావు, యనమల, అశోక్‌బాబు, తిరుమలనాయుడులకు మార్చి 29న ముగియనుంది. ఇందులో జంగా కృష్ణమూర్తి మినహా అంతా టీడీపీకి చెందినవారు. ఎన్నికలకు ముందు జంగా కృష్ణమూర్తి టీడీపీలో చేరారు. ఎమ్మెల్సీ స్థానాలకు టీడీపీ, జనసేన, బీజేపీ నుంచి బలమైన పోటీ ఉంది.
ఎమ్మెల్సీల రేసులో
జనసేన నుంచి నాగబాబు సీటు ఖాయం. ఆ తర్వాత ఆయన్ని కేబినెట్‌లోకి తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇదివరకే చెప్పారు. ఇకపోతే బీజేపీ వంతైంది. మిత్ర ధర్మ ప్రకారం ఒక సీటు కేటాయిస్తారని ఆ పార్టీ నేతలు అంచనాలు పెట్టుకున్నారు. ఒక్కసీటు కోసం గోదావరి జిల్లాల నుంచి సోము వీర్రాజు, ఉత్తరాంధ్ర నుంచి మాధవ్, రాయలసీమ నుంచి ఒకరు రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు. ఆ సీటును బీజేపీకి కేటాయిస్తే టీడీపీకి నాలుగు ఎమ్మెల్సీ సీట్లు దక్కే అవకాశముంది.
ALSO READ: ఏపీ మిర్చి రైతులకు మోదీ గుడ్ న్యూస్
టీడీపీలో చాలామంది
ఇక టీడీపీ విషయానికి వద్దాం. ఒకవేళ బీజేపీకి గనుక ఒక్కసీటు కేటాయిస్తే టీడీపీకి మూడు మాత్రమే మిగలనున్నాయి. పిఠాపురం నుంచి వర్మ, బెడవాడ నుంచి వంగవీటి రాధ, దేవినేని ఉమామహేశ్వరరావు రేసులో ఉన్నారు. బీసీ కోటాలో మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, మైనారిటీ కోటాలో విశాఖకు చెందిన ఎండీ నజీర్ పోటీపడుతున్నారు.
వసంత కృష్ణ ప్రసాద్ కోసం మైలవరం సీటును దేవినేని త్యాగం చేశారు. దీంతో ఆయనకు సీటు ఇస్తారన్నది కొందరు నేతల మాట. ఇక వంగవీటి రాధ ఎప్పటినుంచో పార్టీలో కొనసాగుతున్నారు. ఈసారి రేసులో ఆయన ఉన్నట్లు బలంగా సంకేతాలు వస్తున్నాయి. గతంలో చాలా సార్లు ఎమ్మెల్సీ రేసులో ఆయన పేరు వినిపించింది.
అధినేత మనసులో ఏముంది?
దీనికితోడు పదవీకాలం ముగియనున్న నేతల్లో జంగా కృష్ణమూర్తి , దువ్వారపు రామారావు, యనమల సైతం రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఎలా ముందుకు వెళ్లాలని అనేదానిపై కొందరు నేతలతో అధినేత మంతనాలు జరిపినట్టు సమాచారం. వీరిలో కొందరికి నామినేటెడ్ పోస్టులు ఇచ్చి పార్టీకి నమ్మినబంటుగా ఉన్నవారికి ఎమ్మెల్సీ సీట్లు ఇస్తారని అంటున్నారు. ఏదిఏమైనా బడ్జెట్ సమావేశాలు పూర్తి అయ్యేసరికి సీట్లపై ఓ కొలిక్కి రావచ్చని అంటున్నారు.