వైఎస్ జగన్ సత్తెనపల్లి పర్యటన, అక్కడ జరిగిన గొడవలు, కార్యకర్తల అత్యుత్సాహం గురించి తెలిసిందే. దీనిపై పోలీసులు కూడా కేసులు నమోదు చేస్తున్నారు. అక్కడ కార్యకర్తలు పట్టుకున్న ప్లకార్డుల విషయంలో ఈరోజు కూడా రచ్చ కంటిన్యూ అయింది. ఆ ప్లకార్డులలో ఉన్న పదాలను పదే పదే చదివి వినిపిస్తూ ఈరోజు జగన్ ప్రెస్ మీట్ లో హడావిడి చేశారు. రప్పా రప్పా అంటూ పదే పదే అవే మాటలన్నారు, అంతే కాదు అక్కడ ఉన్నవారితో కూడా ఆ డైలాగులు ఏంటి ఏంటి అంటూ ఉద్దేశపూర్వకంగానే అడిగి చెప్పించుకున్నారు. ఫైనల్ గా అవి పుష్ప సినిమాలో డైలాగులని, సినిమా డైలాగుల్ని రిపీట్ చేయడం కూడా ప్రజా స్వామ్యంలో తప్పేనా అని ప్రశ్నించారు జగన్.
ఇక్కడి వరకు బాగానే ఉంది. పోనీ అవి సినిమా డైలాగులే అనుకుందాం. కానీ సినిమాలో ఉన్నట్టే వాటిని ప్లకార్డుల్లో రాశారా, లేక టీడీపీని టార్గెట్ చేస్తూ మార్చారా అనేది జగన్ కే తెలియాలి. టీడీపీని ఉద్దేశిస్తూ సినిమా డైలాగుల్ని పోలిన వ్యాఖ్యలతో భయభ్రాంతులకు గురిచేసేలా ప్రవర్తించారు కార్యకర్తలు. ఈ డైలాగుల్ని జగన్ సమర్థిస్తూ మాట్లాడటాన్ని టీడీపీ పూర్తిగా తప్పుబడుతోంది. పోనీ అవి సినిమా డైలాగులే అనుకుందాం, వాటితోపాటు మరిన్ని ప్లకార్డులపై ఉన్న డైలాగుల గురించి జగన్ ఏమంటారని ప్రశ్నిస్తోంది టీడీపీ. అవి సినిమాల్లో ఎక్కడా లేవు కదా, మరి వాటిని కూడా జగన్ సమర్థిస్తారా అని ట్విట్టర్లో నిలదీశారు టీడీపీ నేతలు. జగన్ ఉన్మాదుల్ని సమర్థిస్తున్నారంటూ మండిపడ్డారు.
"కు.. చెక్కేస్తాం"..
"తొక్కుకుంటూ పోతాం"..
"అంతు చూస్తాం.."
"నరుకుతాం నా కొడకల్లారా…"
అంటోన్న ఉన్మాదులని నిస్సిగ్గుగా సమర్ధించుకుంటున్న జగన్ రెడ్డి, వీటి గురించి ఏమి చెప్తావ్ ? ఇవి కూడా సినిమా డైలాగులు అంటావా ? లేదా మేము ఇలాగే మాట్లాడుకుంటాం తప్పేముంది అంటావా ?… pic.twitter.com/Xh9i0xcGzO
— Telugu Desam Party (@JaiTDP) June 19, 2025
వాస్తవానికి పరామర్శల యాత్ర తర్వాత జగన్ నేరుగా బెంగళూరు వెళ్లిపోతారు. కానీ నిన్న సత్తెనపల్లి టూర్ తర్వాత ఈరోజు ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. ఈ ప్రెస్ మీట్ లో మరింత ఉత్సాహంగా మాట్లాడారు జగన్. ఏడాదిలోనే కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. అందుకే జనం తన కోసం వస్తున్నారని, తనని చూడటానికి వచ్చేవారిపై కూడా టీడీపీ ఏడుపేంటని ప్రశ్నించారాయన. కూటమి ప్రభుత్వంతో విసుగు చెంది, టీడీపీ కార్యకర్తలు కూడా ప్లకార్డులు పట్టుకుని తన పర్యటనలో పాల్గొనడం మంచిదేకదా అంటున్నారు జగన్. రప్ప రప్పా డైలాగ్ ని పదే పదే వినిపించి వైసీపీ శిబిరంలో ఉత్సాహం నింపారు. అయితే దీన్ని టీడీపీ తీవ్రంగా ఖండిస్తోంది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి డైలాగులు మంచివేనా అని నిలదీస్తున్నారు టీడీపీ నేతలు. కార్యకర్తలతు ఇలాంటి సందేశాన్నిస్తున్న జగన్, వారిని సైకోలుగా మార్చేస్తున్నారని అంటున్నారు. అయితే వైసీపీ నుంచి కూడా కౌంటర్లు పడుతున్నాయి. గతంలో టీడీపీ, జనసేన మీటింగ్ లలో దొర్లిన కొన్ని పదాలు, ఆవేశపూరితమైన డైలాగుల్ని రిపీట్ చేస్తూ, గతంలో మీరు కూడా ఇలాగే చేశారు కదా అని ప్రశ్నిస్తున్నారు.
మొత్తమ్మీద జగన్ సత్తెనపల్లి పర్యటన ఏపీలో రాజకీయ సంచలనంగా మారింది. పోలీసులు అడ్డుకున్నా తమ పర్యటన విజయవంతం అయిందని వైసీపీ అంటోంది. ఒక వ్యక్తి చనిపోయిన ఏడాదికి పరామర్శకు వచ్చిన జగన్, తాజాగా ఇద్దరు చనిపోవడానికి కారణం అయ్యారంటూ టీడీపీ విమర్శిస్తోంది. సైకో బ్యాచ్ ని సమర్థిస్తూ జగన్ మాట్లాడటం మరింత దారుణం అని అంటున్నారు టీడీపీ నేతలు.