TDP on Liquor Scam : వైసీపీ హయాంలోని అక్రమాలపై అన్ని విషయాలు నిగ్గు తెలుస్తామంటూ మొదటి నుంచి చెబుతున్న కూటమి ప్రభుత్వం.. తాజాగా సంచలన ఆరోపణ చేసింది. వైసీపీ హయంలోని లిక్కర్ పాలసీలోని అక్రమాలకు అడ్డు అదుపు లేదని, ఈ కుంభకోణం దేశంలోనే అతిపెద్ద కుంభకోణాల్లో ఒకటి అంటూ సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం మొదలు పెట్టింది. ఇందులో వైసీపీ బడా నేతలు సైతం ఉన్నారని, వారికి చిప్పకూడు తప్పదంటూ హింట్స్ ఇస్తోంది. మరి.. లిక్కర్ కేసు ద్వారా టీడీపీ ఎవరిని టార్గెట్ గా చేసుకుంది. ఎవరిని జైలుకు పంపేందుకు సిద్ధమవుతుందో తెలుసా.?
తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో మద్యం వినియోగాన్ని పూర్తిగా రద్దు చేస్తామని ప్రకటించిన వైసీపీ అధినేత జగన్.. ఆ తర్వాత మాట మార్చేశారు. రాష్ట్ర ఆదాయానికి మద్యం ముఖ్యమని ఎక్కడ లేని సరికొత్త బ్రాండ్లు తీసుకొచ్చి ఎక్సైజ్ పోలీసులతోనే అమ్మకాలు సాగించారు. ఇటీవల ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమికి నాసిరకం లిక్కర్ కూడా ఓ కారణం అన్నది నిజం.
వైసీపీ హయాంలోని మద్యంపై రాష్ట్రలోనే కాదు, ఇతర రాష్ట్రాల్లోనూ భారీగానే వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది. అది మందా రంగు నీళ్ళా అంటూ మీమ్స్ పేలాయి. ఇంకొదరు అయితే.. అది మద్యం కాదని వినియోగదారుల ప్రాణాలు తీసే రసాయనాలు అంటూ లబోదిబోమన్నారు. అలాగే.. లాటరీల ద్వారా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే విధానాన్ని వదులి.. ఏకంగా ప్రభుత్వమే మద్యం అమ్మే సంప్రదాయానికి జగన్ తెరలేపారు. ఇందుకోసం.. ఎక్సైజ్ పోలీసులు కష్టపడాల్సి వచ్చింది. పైగా.. ఏ ఒక్క షాపులోనూ ఆన్ లైన్ చెల్లింపుల్ని అనుమతించలేదు.
ప్రతీ మారుమూల మద్యం దుకాణంలోనూ నగదు రూపంలోనే అమ్మకాలు సాగించారు. దాంతో.. ఈ వ్యవహారంలో భారీ ఎత్తున కుంభకోణాలు జరిగాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. కానీ.. అధికారం చేపట్టిన తర్వాత తొలిసారి ఈ అంశంపై అధికార కూటమి ప్రభుత్వంలోని ప్రధాన పార్టీ అయిన టీడీపీ తన అధికారిక సోషల్ మీడియా పేజీలో ఓ సంచలన పోస్ట్ విడుదల చేసింది. ఈ పోస్టులో తన టార్గెట్ ఎవరు అనేది స్పష్టంగా తెలియజేసింది
ఈ పోస్టులో ఏముంది
టీడీపీ అధికారిక ఫేస్ బుక్ పేజీలోని పోస్ట్ లో రూ.2,500 కోట్ల దిల్లీ నిక్కర్ స్కామ్ తో పోలిస్తే.. అంతకు పదిరెట్లు పెద్దలైన నిక్కర్ స్కాం ఆంధ్రప్రదేశ్లో జరిగిందంటూ టీడీపీ ఆరోపించింది. ఇదే విషయంపై ఇటీవల పార్లమెంట్లో కూడా చర్చ జరిగిన విషయం తెలిసిందే అంటూ పేర్కొంది. వైసీపీ హయాంలో ఏపీలో జరిగిన లిక్కర్ కుంభకోణాలపై సీఐడీ దర్యాప్తు కొనసాగుతుందన్న టీడీపీ సోషల్ మీడియా.. ఈ దర్యాప్తులో సంచలన విషయాలు వెళ్లడయ్యాయని తెలిపింది.
ప్రాథమిక దర్యాప్తులోనే కొత్తకొత్త కంపెనీలు పెట్టి, భారీ ఎత్తున కమిషన్లు వెనుకేసుకున్నారని వైసీపీ నేతల్ని విమర్శించింది. ముఖ్యంగా.. వైసీపీ ఎంపీ, ముఖ్య నేత మిథున్ రెడ్డి భారీ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించింది. ప్రస్తుతానికి తెలిసిన సమాచారం మేరకు.. రూ. 3,013 కోట్లు సొమ్ముల్ని అక్రమంగా కొల్లగొట్టినట్లు ప్రాథమికంగా తేలిందని వెల్లడించింది. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. ప్రాథమిక దర్యాప్తులోనే స్కాం విలువ రూ. మూడు వేల కోట్లు ఉంటే.. ఇక పూర్తిస్థాయి విచారణ జరిపిన తర్వాత ఎన్ని వేల కోట్ల స్కామ్ బయడపడుతుందో అని ఆశ్చర్యపోతున్నారు.
Also Read : Kodela Sivaprasad : కోడెల మరణం వెనుక వారు! వాళ్లకు చిప్పకూడు తప్పేలా లేదుగా
ఈ కేసు ద్వారా రాజంపేట పార్లమెంట్ స్థానానికి ప్రాతినిథ్యం వహిస్తున్న పెద్దిరెడ్డి వెంకట మిధున్ రెడ్డిని నిందితుడుగా పేర్కొంటూ టీడీపీ ప్రచారం ప్రారంభించింది. వైసీపీ కీలక నేతగా ఉన్న ఇతనిపై చేసిన ఈ సంచలన కుంభకోణ ఆరోపణలు నిజమని తేలితే వైసీపీకి అతిపెద్ద ఎదురు తప్పే కావచ్చు. అలాగే వైసీపీ నేతలను ఒక్కొక్కరుగా బుక్ చేస్తూ వస్తున్న కూటమి ప్రభుత్వం ఈ లిక్కర్ కుంభకోణం కేసుతో అటు కీలక నేతను, ఇటు భారీ స్కామ్ ను బయటపెట్టినట్లు ఉంటుందని భావిస్తుంది. అయితే ఈ కేసు దర్యాప్తు ఎంత వరకు సాగుతుంది, ఎంత ప్రభావంతంగా చేపడతారో చూడాలంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు