పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో జగన్ ప్రెస్ మీట్ లో చెప్పకనే చెప్పారు. కౌంటింగ్ కి ముందే ఆయన ఓటమిని ఒప్పుకున్నట్టయింది. ఎన్నికల్లో గొడవలు జరిగాయి, ఇరుపక్షాలు దాడులు చేసుకున్నాయి. అయితే ఇక్కడ దాడి చేసింది టీడీపీ వాళ్లేనని, వైసీపీ వాళ్లంతా బాధితులేననేది జగన్ వాదన. ఈ వాదన ఎలా ఉన్నా.. ఆయన ఓ వితండ వాదాన్ని తెరపైకి తెచ్చారని అంటున్నారు టీడీపీ నేతలు. అంతే కాదు, జగన్ కి ఆయన పార్టీ నేత, మాజీ మంత్రి కొడాలి నానీతో ఓ కౌంటర్ ఇప్పించారు. ఇంతకీ జగన్ ఇప్పుడేమన్నారు..? అంతకు ముందే కొడాలి నాని కౌటంర్ ఎలా ఇచ్చారు?
కేంద్ర బలగాలు..
పులివెందుల, ఒంటిమిట్టలో జరిగినవి ఎన్నికలు కాదని, అధికార పార్టీ దొంగఓట్లతో రిగ్గింగ్ కి పాల్పడిందని ఆరోపించారు జగన్. దమ్ముంటే కేంద్ర బలగాల పహారాలో ఎన్నికలు నిర్వహించాలని అన్నారు. ఏపీ పోలీసుల్ని సీఎం చంద్రబాబు మేనేజ్ చేశారని, వారంతా పచ్చ చొక్కాలు ధరించి విధుల్లో పాల్గొన్నారని సెటైర్లు పేల్చారు. ఇక్కడ కేంద్ర బలగాలు అనే పాయింట్ బాగా హైలైట్ అయింది. అయితే ఈ పాయింట్ కి టీడీపీ వెంటనే కౌంటర్ రెడీ చేసింది. అది కూడా వైసీపీ నేత గతంలో విసిరిన కౌంటరే కావడం విశేషం.
పులివెందులలో కేంద్ర బలగాలతో మళ్ళీ ఎన్నికలు జరిపించాలి అంటూ జగన్ చేసిన డిమాండ్ పై, వైసీపీ సీనియర్ నాయకులు, మృదు స్వభావి, సౌమ్యుడు, విద్యా వంతుడు అయిన శ్రీమాన్ కొడాలి నాని గారు ఎంతో సంస్కారవంతమైన భాషతో సమాధానం చెప్పారు.. #PsychoFekuJagan#EndOfYCP#AndhraPradesh pic.twitter.com/OBVx3XfqJf
— Telugu Desam Party (@JaiTDP) August 13, 2025
అప్పుడలా, ఇప్పుడిలా..
స్థానిక సంస్థలకు జరిగే ఎన్నికల్లో అధికార పార్టీ హవా కనపడటం సహజం. అదే సమయంలో ప్రతిపక్షం గగ్గోలు పెట్టడం కూడా అంతే సాధారణం. గతంలో స్థానిక ఎన్నికల విషయంలో ఇలాగే రచ్చ జరిగింది. వైసీపీ ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ టీడీపీ ఆ ఎన్నికలను బాయ్ కాట్ చేసింది. కేంద్ర బలగాల సమక్షంలో ఎన్నికలు నిర్వహించాలని, ఏపీలోని రెవెన్యూ ఉద్యోగుల్ని పక్కనపెట్టి, పక్క రాష్ట్రం నుంచి ఉద్యోగుల్ని పిలిపించి ఎన్నికలు నిర్వహించాలని కోరారు టీడీపీ నేతలు. ఆ డిమాండ్ కి వైసీపీ నుంచి ఎక్కడలేని వెటకారం సమాధానం రూపంలో వచ్చింది. ఇప్పుడు జగన్ ప్రెస్ మీట్ కి కూడా అదే వెటకారంతో సమాధానం ఇచ్చారు టీడీపీ నేతలు. కొడాలి నానీ వీడియోతో జగన్ పరువు మొత్తం తీసేశారు.
జడ్పీటీసీ ఎన్నికల్లో సింపతీ ఓటు వర్కవుట్ అవుతుందని వైసీపీ ఆశించింది. ఆ పార్టీ తరపున కూడా బడా నేతలు రంగంలోకి దిగారు, కానీ ఫలితం లేదని తెలుస్తోంది. వైసీపీ నేతల మాటతీరు, సాక్షాత్తూ జగన్ మాటలు వింటే ఆ పార్టీ అభ్యర్థుల ఓటమి ఖాయమని అనిపిస్తోంది. ఈ దశలో జగన్ మేకపోతు గాంభీర్యం చూపించడం ఇక్కడ విశేషం. కేంద్ర బలగాలు తెప్పించండి, నీతి, నిజాయితీతో ఎన్నికలు జరిపించండి అంటూ డిమాంట్ చేస్తున్నారు జగన్. ఇదే నీతి, ఇదే నిజాయితీ.. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడకు పోయాయని నిలదీస్తున్నారు నెటిజన్లు. గతంలో వైసీపీ హయాంలో కనీసం టీడీపీ అభ్యర్థులకు నామినేషన్ వేసేందుకు కూడా అవకాశం ఇవ్వలేదని మండిపడుతున్నారు. ఇప్పుడు పులివెందులలో జగన్ లక్కీ నెంబర్ 11మంది నామినేషన్లు వేశారంటూ ఎద్దేవా చేస్తున్నారు. 30ఏళ్లుగా పులివెందుల జడ్పీటీసీ స్థానాన్ని ఏకగ్రీవం చేసుకుంటున్న వైఎస్ఆర్ ఫ్యామిలీకి ఇది తొలిఓటమి అని అంటున్నారు. పులివెందులలో ఈసారి ప్రజాస్వామ్యం గెలవబోతోందని ధీమా వ్యక్తం చేస్తున్నారు టీడీపీ నేతలు.