BigTV English

Avinash Reddy: హోరాహోరీ వాదనలు.. ముందస్తు బెయిల్‌పై మరింత ఉత్కంఠ..

Avinash Reddy: హోరాహోరీ వాదనలు.. ముందస్తు బెయిల్‌పై మరింత ఉత్కంఠ..
avinash reddy high court

Avinash Reddy: వివేకా హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ పై హైకోర్టు విచారణ జరిపింది. సునీతారెడ్డి తరపున సిద్ధార్థ్‌ లూత్రా… అవినాష్‌ రెడ్డి తరపున న్యాయవాది నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. సుమారు గంటన్నరపాటు వాడివేడిగా వాదనలు కొనసాగాయ్‌. మొదటగా అవినాష్‌ తరపున వాదనలు జరిగాయి. ఇప్పటి వరకు ఈ కేసులో సీబీఐ రెండు ఛార్జ్ షీట్లు వేసిందని.. కానీ రిమాండ్ రిపోర్టులో ఎక్కడా అవినాష్ రెడ్డి పేరు గానీ భాస్కర్ రెడ్డి పేరు కానీ ప్రస్తావించలేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ ఏర్పాటు చేసిన సమయంలో ఎవరినైనా అరెస్ట్‌ చేశారా అని న్యాయమూర్తి ప్రశ్నించగా.. ఎవరిని అరెస్ట్‌ చేయలేదని అవినాష్‌ తరపు న్యాయవాది బదులిచ్చారు. వెంటనే జోక్యం చేసుకున్న సునీత తరపు న్యాయవాది.. అఫిడవిట్‌లో వారి పేర్లను ప్రస్తావించారని న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు.


కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న దస్తగిరిని సీబీఐ రెండు నెలల పాటు కస్టడీకి తీసుకుందని.. అది ముగియగానే బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేస్తే సీబీఐ ఎక్కడా అపోజ్ చేయలేదని అవినాష్‌రెడ్డి తరపు లాయర్‌ వాదించారు. సీబీఐ అధికారులు దస్తగిరిని ప్లాన్‌ ప్రకారం అవినాష్‌రెడ్డి పేరు చెప్పేలా చేశారని.. ఆ తర్వాత అప్రూవర్‌గా మార్చారని తెలిపారు. దస్తగిరి బెయిల్‌ విషయంలోనూ మెరిట్స్‌ను పరిగణనలోకి తీసుకోలేదని.. హత్య కేసులో ప్రత్యక్షంగా పాల్గొన్న వ్యక్తికి బెయిల్‌ మంజూరు చేయడం ఎక్కాడా చూడలేదన్నారు. దస్తగిరి ముందస్తు బెయిల్‌ను సీబీఐ వ్యతిరేకించకపోవడం న్యాయసమ్మతం కాదని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. దస్తగిరి మొదట ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో కేవలం గంగిరెడ్డి సహా ఐదుగురి పేర్లను మాత్రమే చెప్పారని.. తర్వాత ఇచ్చిన మరో స్టేట్‌మెంట్‌లో కొత్త పేర్లను తెరపైకి తెచ్చారని న్యాయస్థానానికి దృష్టికి తీసుకెళ్లారు.

అవినాష్‌ రెడ్డిని అనుమానించ దగ్గ ఆధారాలు సీబీఐ వద్ద లేవని.. కేవలం దస్తగిరి వాంగ్మూలం, గూగుల్‌ టేకౌట్ పైనే సీబీఐ ఆధారపడుతోందని నిరంజన్ రెడ్డి కోర్టు దృష్టికి తెచ్చారు. గూగుల్‌ టేకౌట్.. ఫోన్‌ ఎక్కడుందో చెబుతుంది కానీ, వ్యక్తి లొకేషన్ చెప్పదు. లొకేషన్‌ 20 మీటర్లు తేడా ఉంటుందని..ఇంటి లోపల ఉంటే లొకేషన్‌లో కచ్చితత్వం ఉండదని గూగుల్‌ చెబుతోంది. గూగుల్‌ టేకౌట్ డేటాను ఏ కోర్టూ సాక్ష్యంగా తీసుకోలేదని అవినాష్‌రెడ్డి తరపున వాదనలు వినిపించారు. అవినాష్‌ను టార్గెట్‌ చేసి సీబీఐ దర్యాప్తు చేస్తోందని…వివేకాది గుండెపోటు అన్ని చెప్పడంలో ఎలాంటి కుట్ర లేదని.. అక్కడున్న వారు చెబితే అదే విషయాన్ని అవినాష్‌ చెప్పారని…రాజకీయంగా ప్రోత్సహించిన బాబాయ్‌ను అవినాష్ ఎందుకు చంపుతారని నిరంజన్‌రెడ్డి వాదనలు వినపించారు.


వివేకా కుమార్తె సునీత తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించారు. రక్తపు మడుగులో మృతదేహం కనిపిస్తుంటే గుండెపోటు అనడం ఆశ్చర్యకరమన్నారు. వివేకా, అవినాష్‌ ఇళ్లకు 500 మీటర్ల దూరం ఉందని న్యాయమూర్తి దృష్టికి తెచ్చారు. అవినాష్‌రెడ్డిపై ఎలాంటి కేసులు లేవన్న మాటలు అవాస్తవమని.. అతనిపై హత్యాయత్నం లాంటి కేసులు ఉన్నాయని.. ఈ విషయాన్ని ఎన్నికల అఫిడవిట్‌లో కూడా పొందుపరిచారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే సిట్‌ను ప్రభావితం చేశారని.. తర్వాత సీబీఐని కూడా ప్రభావితం చేస్తారనే అనుమానంతో కేసును తెలంగాణకు బదిలీ చేశారని గుర్తు చేశారు. హత్య కేసులో ఉన్న వ్యక్తికి ముందస్తు బెయిల్‌ అడుగుతున్నారు.. ఇంతకు ముందు సాక్ష్యం ఇచ్చిన సీఐ శంకరయ్యను.. ఇంటిని శుభ్రం చేసిన మరో మహిళ స్టేట్‌మెంట్‌ను ఇప్పటికే ప్రభావితం చేశారని సునీత తరపున న్యాయస్థానానికి వివవరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు…. తదుపరి విచారణను గురువారం మధ్యాహ్నానికి వాయిదా వేసింది.

మరో వైపు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌ను రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గంగిరెడ్డి బెయిల్‌ రద్దు చేయాలంటూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం.. గురువారం తీర్పు వెలువరించింది. మే ఐదో తేదీలోగా లోపు సీబీఐ ఎదుట లొంగిపోవాలని ఎర్ర గంగిరెడ్డిని కోర్టు ఆదేశించింది. లొంగని పక్షంలో ఆయన్ను అదుపులోకి తీసుకోవాలని సీబీఐకి సూచించింది. ఎర్ర గంగిరెడ్డి బయట ఉండటం వల్ల దర్యాప్తులో సహకరించడానికి ప్రజలు ఎవరూ ముందుకు రావడం లేదని…ఆయన వెనుక రాజకీయ ప్రముఖులు ఉండటంతో ప్రజల్లో భయం ఉందన్న సీబీఐ వాదనతో హైకోర్టు ఏకీభవించింది.

కాగా వివేకా హత్య కేసు విచారణను సీబీఐ స్పీడప్‌ చేసింది. కడప నుంచి పులివెందుల చేరుకున్న సీబీఐ బృందం.. కేసులో అనుమానితుడిగా ఉన్న వివేకా పీఏ కృష్ణారెడ్డికి ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో ఆయన ఇంట్లో లేకపోవడంతో.. భార్య సుజాత, కుమారుడు రాజేష్‌ను సీబీఐ అధికారులు విచారించారు. మూడు గంటల పాటు వివిధ అంశాలపై ఇరువురిని ప్రశ్నించారు. కృష్ణారెడ్డి లయోలా కాలేజీలో లైబ్రేరియన్‌గా పనిచేస్తుండటంతో.. అక్కడా ఆయన గురించి ఆరా తీసినట్లు తెలుస్తోంది. కేసు విచారణ క్లైమాక్స్‌ చేరుకోవడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×