
Rayalaseema : రాజధానిని విశాఖకు తరలిస్తామని ఏపీ సీఎం జగన్ పదేపదే ప్రకటనలు చేస్తున్నారు. వచ్చే సెప్టెంబర్ నుంచి వైజాగ్ లోనే కాపురం పెడతానని ప్రకటించారు. ఒక వైపు పాలనా వికేంద్రీకరణ అంటూనే విశాఖను పూర్తిస్థాయి రాజధానిగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అమరావతి నుంచి రాజధాని తరలించవద్దంటూ ఎప్పటి నుంచో ఉద్యమం కొనసాగుతోంది. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులు తమ పోరాటం కొనసాగిస్తున్నారు. ఇటు తిరుపతికి అటు అరసవల్లికి రైతులు పాదయాత్రలు కూడా చేశారు. మరోవైపు న్యాయపోరాటం చేస్తున్నారు. ఈ ఉద్యమాన్ని తొలి నుంచి లైట్ తీసుకున్న జగన్ సర్కార్ .. విశాఖ నుంచే పాలన కొనసాగించేందుకు పావులు కదుపుతోంది. అయితే జగన్ ప్రభుత్వానికి కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. విశాఖ రాజధానిపై రాయలసీమ నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
కర్నూలులో సోమవారం రాయలసీమ కర్తవ్య దీక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీమకు చెందిన కాంగ్రెస్, టీడీపీ నేతలు కూడా పాల్గొన్నారు. తరతరాలుగా ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతోందని పలువురు నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.
కర్ణాటకలో ఎగువ భద్ర ప్రాజెక్టు నిర్మాణం చేపడితే కర్నూలు, అనంతపురం, కడప ప్రాంతాలకు నీళ్లు అందవని రాయలసీమ స్టీరింగ్ కమిటీ ఛైర్మన్ బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. రాయలసీమ ప్రాంతాన్ని విడగొట్టాలని కొందరు చూస్తున్నారని మండిపడ్డారు. తాము రాయలసీమ రాష్ట్ర ఏర్పాటుకే కట్టుబడి ఉన్నామన్నారు. రాజధాని అమరావతిని విశాఖకు తరలిస్తే సీమ ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తులసిరెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. ఏపీ విభజన చట్టం ప్రకారం సీమ ప్రాంతానికి ప్రత్యేక నిధుల కేటాయించలేదని మండిపడ్డారు. కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం జరగలేదన్నారు. తెలుగు గంగ, గాలేరు, హంద్రీనీవా, కేసీ కెనాల్ లాంటి ప్రాజెక్టులకు నిధుల్లో కోత పెడుతున్నారని ఆరోపించారు. రాయలసీమకు రావాల్సిన 600 టీఎంసీల నీళ్లు రావడం లేదని, ఫలితంగా రైతులకు తీవ్రంగా నష్టం జరుగుతోందని పీసీసీ మాజీ అధ్యక్షుడు శైలజానాథ్ అన్నారు.
రాయలసీమకు నీళ్లు, పరిశ్రమలు, ఉపాధి కోసం ఐక్య ఉద్యమం చేపట్టాలని మాజీ ఎమ్మెల్యే గఫూర్ పిలుపునిచ్చారు. రాయలసీమలోని 4 జిల్లాలతోపాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలను కలిపి గ్రేటర్ రాయలసీమ ఏర్పాటు చేస్తే దేశంలోనే ధనిక రాష్ట్రమవుతుందని మాజీ ఎంపీ గంగుల ప్రతాప్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. అందుకే రాయలసీమ రాష్ట్రం సాధించుకోవాలని పిలుపునిచ్చారు. రాయలసీమను తెలంగాణలో కలిపితే నీటి సమస్య ఉండదని టీడీపీ నేత జేసీ దివాకర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రత్యేక రాయలసీమ ఏర్పాటు కష్టంగానీ.. ఏదైనా రాష్ట్రంలో విలీనం చేయడం సులభమేనన్నారు.
విశాఖ నుంచి పాలన ప్రారంభించాలని సీఎం జగన్ ఆరాటపడుతున్నారు. ఈ సమయంలో ప్రత్యేక రాయలసీమ రాష్ట్ర నినాదం తెరపైకి రావడం ఆసక్తిని రేపుతోంది. మరి రాయలసీమ వాసుల అభ్యంతరాలను జగన్ లెక్కలోకి తీసుకుంటారా? ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ పై వైసీపీ సర్కార్ వైఖరేంటీ.? భవిష్యత్ లో ఈ ఉద్యమం ఉద్ధృతమవుతుందా..? ఏపీ రాజధాని సమస్య తేలేదెప్పుడు..?
Rahul gandhi: అనర్హత వేటు వేసినా.. జైలుకి పంపినా తగ్గేది లేదు: రాహుల్ గాంధీ