
Break down masks:- కోవిడ్ అనే వైరస్ పరిచయం కాకముందు దుమ్ము, ధూళి నుండి కాపాడుకోవడానికి మాత్రమే మనుషులు మాస్క్‌లను ఉపయోగించేవారు. కానీ ఒక్కసారి ఆ వైరస్ అనేది ప్రపంచాన్ని కుదిపేసిన తర్వాత మాస్క్‌లు లేకుండా మనుషులు బయటికి రాకూడదు అనే రూల్ వచ్చింది. అంతే కాకుండా రకరకాల మాస్క్‌లు మార్కెట్లోకి వచ్చాయి. ఇక తాజాగా మాస్కుల విషయంలో శాస్త్రవేత్తలు కొత్త రకం పరిశోధనలు చేయడం మొదలుపెట్టారు.
మాస్కులు అనేవి ఇన్ని రకాలుగా ఉంటాయా అని కోవిడ్ వైరస్ ఔట్‌బ్రేక్ వరకు చాలామందికి తెలియదు. మామూలు మాస్కులు అయితే సరిపోదు.. ఎన్95 మాస్కులు అయితే వైరస్ నుండి కాపాడతాయి అని కొందరు, మామూలు మాస్కులు అయినా కూడా అసలు గాలి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది అని మరికొందరు.. ఇలా చాలామందికి మాస్కుల విషయంలో విభిన్న అభిప్రాయాలు ఉండేవి. ఇప్పటికీ ఉన్నాయి కూడా. కోవిడ్ అనేది చాలావరకు తగ్గిపోయిన తర్వాత కూడా ఇప్పటికీ పలువురు ఎక్కువగా జనాలు ఉన్న ప్రాంతాలకు వెళ్లాలంటే మాస్కులను ఉపయోగిస్తున్నారు.
తాజాగా గాలి, కరెంటును కలిపి మాస్కులను ధ్వంసం చేస్తామంటూ పలువురు శాస్త్రవేత్తలు ముందుకొచ్చారు. మామూలుగా ఆసుపత్రులలో మెడికల్ వేస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మాస్కులు కూడా ఆ మెడికల్ వేస్ట్‌లో భాగమవుతున్నాయి. అలా కాకుండా మాస్కులు మెడికల్ వేస్ట్‌లో భాగమవ్వకుండా వీటిని ఏ హాని లేకుండా ధ్వంసం చేసే ప్రక్రియను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. హెల్త్‌కేర్ సెక్టార్ ఎప్పుడూ వేస్ట్ ఛాలెంజ్‌ను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాల్సి ఉంటుంది. ఆ వేస్ట్‌ను కాల్చి వేయాల్సి ఉంటుంది. కానీ చుట్టుపక్కన ప్రాంతాలకు ఎలాంటి హాని లేకుండా వేస్ట్‌ను కాల్చాలంటే చాలా ఖర్చు అవుతుంది.
అందుకే శాస్త్రవేత్తలు ఫ్రెష్ గాలితో, 200 వాల్ట్స్ కరెంటుతో మాస్కులను ధ్వంసం చేసే ప్రక్రియను కనిపెట్టారు. కోల్డ్ ప్లాస్మా సిస్టమ్ ద్వారా ఒక్కసారి ఉపయోగించి పడే మాస్కులను ఈ విధంగా ధ్వంసం చేయవచ్చని వారు చెప్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఎయిర్ ప్లాస్మా సిస్టమ్ ద్వారా సర్జికల్ మాస్క్‌ను ధ్వంసం చేయడానికి పూర్తిగా నాలుగు గంటల సమయం పడుతుంది, అయినా కూడా ఈ మాస్కులు 90 శాతం మాత్రమే ధ్వంసమవుతాయి. అందుకే ఈ కొత్త ప్రక్రియ ద్వారా సింగిల్ యూజ్ మాస్కులతో పాటు, సర్జికల్ మాస్కులు కూడా పర్యావరణానికి ఏ హాని లేకుండా ధ్వంసమవుతాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.