
Congress : ఖమ్మం గుమ్మంలో కాంగ్రెస్ గర్జన. ఊహించని విధంగా తరలివచ్చిన నిరుద్యోగ యువత. ఈ నిరసన కార్యక్రమం కాంగ్రెస్‌లో కొత్త ఆశలు చిగురింపచేసిందా? ఖమ్మం ఖిల్లాలో కొత్త సమీకరణాలకు తెర తీసిందా? అంటే ఔననే సమాధానం వస్తోంది.
చంద్రబాబు మొదలు.. కేసీఆర్, షర్మిల, కమ్యూనిస్టులు అందరూ తొలి నుంచీ ఖమ్మంపై గురి పెట్టారు. ఇక్కడి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై బీఆర్ఎస్ వేటు వేశాక.. ఈక్వేషన్స్ మారిపోయాయి. పొంగులేటిని, ఆయన వర్గాన్ని ఆకర్షించేందుకు కాంగ్రెస్, బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నాయి. AICC దూతలు నేరుగా రంగంలోకి దిగి సంప్రదింపులు కూడా జరిపారు.
మరోవైపు ఖమ్మంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేపట్టిన విద్యార్థి, నిరుద్యోగ నిరసన ప్రదర్శనకు ఊహించని విధంగా జనం రావడంతో ఇక పొంగులేటి వర్గం కాంగ్రెస్ వైపు ఎట్రాక్ట్ కావడం ఖాయమని భావిస్తున్నారు. అటు బీజేపీకి గ్రౌండ్ లెవల్‌లో బలం లేకపోవడం.. ఇటు కాంగ్రెస్ జనసమీకరణలో గ్రాండ్ సక్సెక్ కావడంతో.. భవిష్యత్‌లో రాజకీయ సమీకరణాలు మారిపోతాయనే అంచనాలు ఉన్నాయి.
తెలంగాణలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని.. వాటిని భర్తీ చేయాలన్నది ప్రజల సాక్షిగా రేవంత్‌రెడ్డి చేసిన డిమాండ్. ప్రభుత్వం మెడలు వంచేందుకు వచ్చే నెలలో జరిగే సరూర్‌నగర్ సభకు ప్రియాంకగాంధీ వస్తున్నారంటూ జోష్ నింపారు. తనదైన శైలిలో ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు రేవంత్‌రెడ్డి. పేపర్ లీకేజీలకు కారకులను వదిలేసి.. ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. మరోవైపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పదికి పది స్థానాలు గెలిచేలా కార్యకర్తలు పని చేయాలని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 90 సీట్లు తెచ్చే బాధ్యతను తాము తీసుకుంటామన్నారు. మొత్తంమీద ఖమ్మంలో చేపట్టిన నిరసన కార్యక్రమంతో కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతుందనే అంచనాలున్నాయి.