Weather Report : తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయి. బంగాళా ఖాతంలో అల్పపీడనం కారణంగా.. ఆంధ్రాతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే.. చలితో ఇబ్బందులు పడుతున్న జనాలకు వర్షాల కారణంగా వాతావరణం మరింత చల్లబడింది. దీంతో.. సాయంకాలం నుంచి ప్రజలు బయటకు రాలేని పరిస్థితులు నెలకొన్నాయి. బుధవారం ఉదయం నుంచే చాలా చోట్ల మబ్బులు కమ్ముకుని వాతావరణం చల్లబడగా.. మరికొన్ని చోట్ల చిరు జల్లులు కురిశాయి. కాగా.. అల్పపీడన ప్రభావంతో మరో మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచనలు చేసింది.
పశ్చిమ మధ్య, నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. రాగాల 24 గంటల్లో ఇది బలహీనపడే అవకాశాలున్నాయని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. అయితే.. అల్పపీడనం కారణంగా రానున్న మూడు రోజులు మాత్రం తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని, వాతావరణ బాగా చల్లబడుతుందని తెలిపింది. అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపిన వాతావరణ విభాగం.. కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వెల్లడించింది.
ఇప్పటికే చలిగాలులు విస్తుండగా, వర్షాల కారణంగా చలి తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. వృద్ధులు, చిన్నారులు రాత్రి వేళల్లో బయట తిరగవద్దని సూచించింది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల కారణంగా.. రానున్న ఐదు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేశారు. ఇప్పటికే.. తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో చిన్నపాటి చిరుజల్లుల నుంచి భారీ వర్షాలు కురుస్తుండగా.. ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి మన్యం, నెల్లూరు జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది.
అల్పపీడన ప్రభావంతో రానున్న 24 గంటల్లో కోస్తా ప్రాంతాల్లో తేలిక నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం వెల్లడించింది. ఈ మూడు రోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. ఏపీలోని ప్రధాన ఓడ రేవుల్లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
Also Read : జగన్ నువ్వు మారవా.. నారా లోకేష్ హెచ్చరిక
తెలంగాణలోని చాలా జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇక్కడా అల్పపీడన ప్రభావం బాగానే కనిపిస్తోంది. హైదరాబాద్ లో చలి తీవ్రత మరింత పెరిగిపోగా.. అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో.. ఈ ప్రాంతాల్లోని ప్రజలు ఉదయం నుంచి బయట పనులకు వెళ్లేందుకు వీలు లేకుండా అయ్యింది. ఇక ఈ జిల్లాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గర రైతులు అవస్థలు పడుతున్నారు. తెచ్చిన ధాన్యం తడిసిపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.