Tirumala News : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. హోలీ సెలవుతోపాటు వారాంతం కలిసి రావడంతో దర్శనాలకు భక్తులు పోటెత్తుతున్నారు. శనివారం ఒక్కరోజు శ్రీవారిని దాదాపు 82,580 మంది భక్తులు దర్శించుకున్నారు. 31 వేల మందికి పైగానే తల నీలాలు సమర్పించారు. శ్రీ వెంకటేశుని దర్శనానికి టోకెన్లు లేని భక్తులకు దర్శనానికి 18 గంటల సమయం పడుతుంది.
తిరుమలల్లో పెరిగిన రద్దీ
శ్రీవారి హుండీకి దాదాపు రూ.4 కోట్ల ఆదాయం సమకూరింది. శ్రీవారి సర్వ దర్శనానికి 31 కంపార్టుమెంట్లలో భక్తులు ఉన్నారు. రూ.300 టికెట్లు కలిగిన భక్తులకు మూడు నాలుగు గంటల్లో శ్రీవారి దర్శనం అవుతుంది. భక్తుల తాకిడి నేపథ్యంలో టీటీడీ అధికారులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో భక్తులకు తాగునీరు, మజ్జిగ ఎక్కడికక్కడ అందజేస్తోంది.
కమిటీ విచారణ
మరోవైపు వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతిలో జరిగిన తొక్కిసలాటపై ప్రభుత్వ నియమించిన ఏక సభ్య కమిటీ విచారణ శనివారం మొదలైంది. శ్రీవారి దర్శనానికి భక్తులు వెళ్లే క్యూ లైన్ల నిర్వహణపై శని, ఆదివారాల్లో దగ్గరుండి మరీ పరిశీలిస్తున్నారు. సోమవారం నుంచి వారం రోజుల పాటు తొక్కిసలాట ఘటనలో గాయపడిన క్షతగాత్రులను విచారించనుంది కమిటీ.
జూన్ కోటా టికెట్లు విడుదల
తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, వసతి గదుల ఆన్‌లైన్ కోటాను ప్రతి నెలా టీటీడీ విడుదల చేస్తోంది. జూన్ నెలకు సంబంధించిన కోటాను మార్చి 18 నుంచి విడుదల చేయనుంది. సుప్రభాతం, తోమల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవలకు మార్చి 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
ALSO READ: జనసేనాని కాదు భజన సేనాని
ఈ-సేవా టికెట్ల లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ కోసం మార్చి 18 నుంచి 20వ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. లక్కీ డిప్ ద్వారా ఈ టికెట్లు పొందిన భక్తులు మార్చి 20 నుండి 22న మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లిస్తే వారికి టికెట్లు అందనున్నాయి.
మార్చి 24న ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తుంది. మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలలో, తలకోన ప్రాంతాల్లో గదులకు సంబంధించి కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. మార్చి 22న ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన మే నెల కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
మార్చి 22న మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలక వ్యాధులు ఉన్నవారు శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా జూన్ నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. శ్రీవారి భక్తులు నకిలీ వెబ్‌సైట్‌లను నమ్మొద్దని టీటీడీ పదేపదే చెబుతోంది. అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రమే టికెట్లు బుక్ చేసుకోవాలని సూచిస్తున్నారు అధికారులు.