Prakash Raj Counter Pawan Kalyan| జాతీయ విద్యావిధానంలో త్రిభాషా సూత్రం అమలు విషయంలో కేంద్రం, తమిళనాడు డీఎంకే ప్రభుత్వం మధ్య వివాదం కొనసాగుతోంది. అయితే శుక్రవారం రాత్రి జనసేన జయకేతనం సభలో పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై నటుడు ప్రకాష్ రాజ్ సెటైరికల్‌గా కౌంటర్లు వేస్తున్నారు. పవన్ కల్యాణ్ ని ఉద్దేశించి ఆయన గెలవక ముందు ‘‘జనసేనాని’’.. గెలిచిన తరువాత ‘‘భజన సేనాని” అంతేనా? అంటూ ప్రకాశ్ రాజ్ సెటైర్ వేశారు. హిందీ వద్దంటూ దక్షిణాది రాష్ట్రాలకు మద్దతుగా పవన్ గతంలో చేసిన పోస్టులను ట్వీట్‌కి ప్రకాష్ రాజ్ జత చేశారు.
‘‘హిందీ భాషను తమిళ ప్రజల మీద రుద్దడం తప్పు అలా చేయకండి అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదంటూ అంతకుముందు కూడా ప్రకాశ్ రాజ్ మరో ట్వీట్ చేశారు. ‘‘స్వాభిమానంతో మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడం’’ అని పవన్ కల్యాణ్ గారికి ఎవరైనా చెప్పండి ప్లీజ్..’ అంటూ కామెంట్స్ చేశారు.
కాగా, పవన్ కల్యాణ్ బహుభాష వ్యాఖ్యలపై డీఎంకే కూడా స్పందించింది. ‘‘మా వైఖరిని పవన్ తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇతర భాషలు నేర్చుకునేందుకు మేం వ్యతిరేకం కాదు’’ అంటూ డీఎంకే అధికార ప్రతినిధి సయీద్ హఫీజుల్లా స్పష్టం చేశారు. తమిళనాడుపై హిందీని బలవంతంగా రుద్దుతున్నారని.. హిందీపై కేంద్రం తీరును తాము వ్యతిరేకిస్తున్నామన్నారు.
Also Read: రూపాయి సింబల్ వివాదం.. కరెన్సీ చిహ్నం మార్పుపై తమిళ డిజైనర్ ఏమన్నారంటే
‘‘వ్యక్తిగతంగా హిందీ, ఇతర భాషలు నేర్చుకోవడాన్ని తాము ఎన్నడూ అడ్డుకోలేదన్న డీఎంకే.. ఆసక్తి ఉన్నవారు నేర్చుకోవడం కోసం ఇప్పటికే తమ రాష్ట్రంలో హిందీ ప్రచార సభలను నిర్వహిస్తున్నామని పేర్కొంది. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం జాతీయ విద్యా విధానం, పీఎం శ్రీ పాఠశాలలు వంటి జాతీయ విధానాలతో తమిళనాడు ప్రజలపై బలవంతంగా హిందీ భాషను రుద్దుతోంది. దీన్ని మేం వ్యతిరేకిస్తున్నాం’’ అని డిఎంకే నేత సయీద్ హఫీజుల్లా తేల్చి చెప్పారు.
అంతకుముందు.. పవన్ కల్యాణ్ జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సభలో మాట్లాడుతూ.. ‘మాట్లాడితే సంస్కృతాన్ని తిడతారు. దక్షిణాదిపై హిందీని రుద్దుతున్నారంటారు.. అన్నీ దేశ భాషలే కదా.. తమిళనాడులో హిందీ రాకూడదని అంటూంటే నాకు ఒక్కటే అనిపించింది. తమిళ సినిమాలు హిందీలో డబ్ చేయకండి. డబ్బులేమో ఉత్తర ప్రదేశ్, బీహార్, చత్తీస్‌గఢ్ నుంచి కావాలి. హిందీని మాత్రం ద్వేషిస్తామంటే ఎలా? ఇక్కడి న్యాయం. తమిళనాడులో పెరినప్పుడు నేను వివక్ష అనుభవించాను. గోల్టీ గోల్టీ అని నన్ను అవమానించారు’ అంటూ వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు.. జాతీయ విద్యావిధానంపై తమిళనాడు, కేంద్రం మధ్య జరుగుతున్న వివాదం మరో మలుపు తిరిగింది. తాజాగా ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో భారత కరెన్సీ అయిన రూపాయి హిందీ సింబల్‌ను తొలగించారు. ఆ స్థానంలో తమిళ భాషలో ‘రూ’ అనే అర్థం వచ్చే అక్షరాన్ని చేర్చారు. దీంతో భాషల వివాదం మరింత ముదిరినట్లైంది. తమిళ సంఘాలు ఈ నిర్ణయాన్ని స్వాగతించాయి. మాతృభాషను కాపాడుకొనేందుకు తీసుకొన్న చర్యగా అభివర్ణించాయి. అయితే బిజేపీ నాయకులు మాత్రం ఈ చర్యతో జాతీయ చిహ్నాన్ని తక్కువ చేసి చూపించారని మండిపడ్డారు. ముఖ్యంగా హిందీ భాషను తమిళనాడులో ఓ సబ్జెక్టుగా చేర్చడాన్ని డీఎంకే తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
ఇప్పటికే సీఎం స్టాలిన్ దీనిపై స్పందించారు. ‘తమిళనాడు విద్యార్థులు మూడో భాషను నేర్చుకునేందుకు ఎందుకు నిరాకరిస్తున్నారంటూ కొందరు మమ్మల్ని అడుగుతున్నారు. కానీ, ఉత్తరాదిలో మూడో భాష కింద ఏ భాషను నేర్పుతున్నారో చెప్పడం లేదు. ఆ రాష్ట్రాలలో రెండు భాషలను మాత్రమే పాఠశాలల్లో బోధిస్తున్నారు.. మరి అలాంటప్పుడు ఇక్కడ మాత్రం మూడు భాషల విధానాన్ని అమలు చేయాల్సిన అవసరం ఏముంది?’ అని ప్రశ్నించారు.
“ గెలవక ముందు “జనసేనాని”, గెలిచిన తరువాత “భజన సేనాని” … అంతేనా #justasking pic.twitter.com/EqjtqK6qFA
— Prakash Raj (@prakashraaj) March 15, 2025