Tirumala News: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. మే ఒకటి నుంచి కొత్త రూల్స్ అమలు అవుతున్నాయి. వీఐపీ బ్రేక్ దర్శన వేళల సమయం మారనుంది. టీటీడీ ప్రయోగాత్మకంగా కొత్తగా మార్పులు చేసింది. వీఐపీ బ్రేక్ దర్శనాలు ఉదయం 5.45 గంటల నుంచి 11 గంటల వరకు జరగనున్నాయి. గురువారం శ్రీవారికి తిరుప్పావడ సేవ, శుక్రవారం అభిషేక సేవ ఉంది. ఈ నేపథ్యంలో ఆ రెండు రోజులు పాత వేళలు కొనసాగనున్నాయి. ఈ విషయాన్ని తిరుమల డిప్యూటీ ఈవో లోకనాథం వెల్లడించారు.
దర్శన వేళలు మార్పులు
గతంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు ఉదయం 5.30 నుంచి 11 గంటలకు వరకు జరిగేవి. వైసీపీ హయాంలో పాలకమండలి వీఐపీ బ్రేక్ దర్శనాలను ఉదయం 10 గంటలకు మార్చిన విషయం తెల్సిందే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త పాలకమండలి బ్రేక్ దర్శనాల్లో మార్పులు చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో పాత విధానాన్ని తెరపైకి తెచ్చింది. మే ఒకటి నుంచి అములు చేస్తోంది.
రాత్రి వేళల్లో కంపార్టుమెంట్లలో ఉండే భక్తులకు వేగంగా దర్శనాలు చేయించాలనే ఉద్దేశంతో గతంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను మార్చింది గత పాలక మండలి. అయినప్పటికీ బ్రేక్ దర్శన భక్తులకు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు దర్శనం చేయిస్తున్నారు. స్వామికి రెండో విడత నైవేద్యం గంట ఉంటుంది. ఉదయం 10 గంటల తర్వాత ప్రొటోకాల్, రెఫరల్, శ్రీవాణి, ఉద్యోగులకు దర్శనం చేసుకునే అవకాశం కల్పిస్తోంది.
ఒకప్పుడు ప్రొటోకాల్, రిఫరెల్, జనరల్ బ్రేక్ దర్శనాలను ఉదయం 7.30 గంటల లోపు పూర్తి చేసేవారు. ఆ తర్వాత సమయంలో వీలైనంత సామాన్యులకు దర్శనం కల్పించారు. ఉదయం 10.15 గంటల నుంచి 11.30 గంటలలోపు శ్రీవాణి, టీటీడీ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు దర్శనం కల్పించేలా అధికారులు ప్రణాళికలు రెడీ చేశారు. సిఫారసు లేఖలపై బ్రేక్‌దర్శనాలను రద్దు చేసిన క్రమంలో ఉదయం గంట, మధ్యాహ్నం గంటన్నర అదనంగా సామాన్య భక్తులకు దర్శనం కలగనుంది.
ALSO READ: ఏడాదిలో అనేక ఘోరాలు, తప్పందా బాబుదే
సర్వదర్శన టోకెన్ల వివరాలు
ఇక గురువారం సర్వ దర్శన టోకెన్ల విషయానికి వద్దాం. 2311 టోకెన్లను విడతల వారీగా విడుదల చేయనుంది టీటీడీ. సాయంత్రం ఐదుగంటలకు 830 టోకెన్లు, రాత్రి 8 గంటలకు 738, రాత్రి 10 గంటలకు 743 టోకెన్లను రిలీజ్ చేస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది. ఈ టోకెన్లు భూదేవి కాంప్లెక్స్, విష్ణునివాసం, శ్రీనివాసం వద్ద కేంద్రాల్లో లభించనున్నాయి.
శ్రీకోదండరామస్వామి ఆలయంలో పుష్పయాగం
తిరుపతి శ్రీకోదండరామస్వామి ఆలయంలో మే మూడు నుంచి పుష్పయాగం జరగనుంది. మే రెండున సాయంత్రం దీనికి అంకురార్పణ జరుగనుంది. మూడున ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు స్వామి-అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు.
సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారికి రకరకాల పుష్పాలతో అభిషేకం చేయనున్నారు. రాత్రి 7 గంటలకు శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామి ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమీయనున్నారు. దంపతులు రూ.1,000/- చెల్లించి టికెట్ కొనుగోలుచేసి పుష్పయాగంలో పాల్గొనవచ్చు.