YS Jagan : చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే రాష్ట్రంలో అనేక ఘోరాలు జరుగుతున్నాయని జగన్ మండిపడ్డారు. సింహాచలం ప్రమాదానికి కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమన్నారు. కాంక్రీట్‌తో గోడ నిర్మించాలన్న జ్ఞానం కూడా లేదా అని ప్రశ్నించారు. ఎటువంటి టెండర్లు పిలువకుండానే.. నాణ్యత లేకుండా గోడ కట్టారని ఆరోపించారు. రెండ్రోజుల క్రితమే గోడ పూర్తైందని.. వర్షం కూడా పడిందని.. అయినా, లక్షల మంది భక్తులు వచ్చే ఈ సమయంలో గోడ సమీపంలోకి భక్తులను ఎలా అనుమతించారని నిలదీశారు. సింహాచలం ఆలయ దుర్గటనలో బాధిత కుటుంబాన్ని జగన్ పరామర్శించారు.
సామాన్య భక్తులను పట్టించుకోరా?
సింహాచలం చందనోత్సవంలో గోడ కూలి ఏడుగురు చనిపోయారని.. ఆనాడు వైకుంఠ ఏకాదశికి తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మరణించారని గుర్తు చేశారు. లక్షలాది మంది భక్తులు వస్తారని ముందే తెలిసి కూడా సరైన ఏర్పాట్లు చేయలేదని మండిపడ్డారు. సామాన్య భక్తులను ఏమాత్రం పట్టించుకోవట్లేదన్నారు.
రూ. కోటి పరిహారం ఇవ్వాల్సిందే..
గతంలో దేవుడిని కూడా సీఎం చంద్రబాబు రాజకీయాలకు వాడుకున్నారని జగన్ విమర్శించారు. తిరుమల లడ్డూ ప్రసాదాన్ని వివాదం చేసి రోడ్డు మీదకు తెచ్చారన్నారు. తిరుమల గోశాలలో గోవులు చనిపోవడం కూడా చూస్తున్నామని చెప్పారు. శ్రీకాకుళం శ్రీకూర్మంలో తాబేలు చనిపోయాయి. కడప, కాసినాయన ఆశ్రమంలో బుల్డోజర్లతో ధ్వంసం చేసారని తెలిపారు. 10 నెలల పాలనలో గుళ్లు, గోపురాలపై జరిగిన పరిస్థితులు దారుణమన్నారు జగన్. ఇటువంటి దుర్ఘటనలు జరిగాక కమిటీలు వేస్తున్నాం, విచారణ చేస్తున్నాం అని చంద్రబాబు చెబుతున్నారని.. కానీ, ఇప్పటి వరకూ ఎవరి మీదైనా యాక్షన్ తీసుకున్నారా? అని జగన్ ప్రశ్నించారు. యాక్షన్ తీసుకోవాల్సి వస్తే.. అది చంద్రబాబు మీదే తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. అన్నీ డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే చేస్తున్నారని మండిపడ్డారు. సింహాచలం ఘటనకు బాధ్యులైన వారిపై యాక్షన్ తీసుకోవాలని.. బాధిత కుటుంబాలకు రూ. కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు వైసీపీ అధినేత జగన్.
Also Read : షర్మిలపై కోడిగుడ్లతో దాడి.. హైటెన్షన్
మరోవైపు, సింహాచలం ఘటనపై ప్రజాశాంతి అధినేత కేఏ పాల్ సైతం స్పందించారు. ప్రజల దగ్గర నుంచి టిక్కెట్ల రూపంలో వేల కోట్లు సంపాదిస్తున్నారని.. దానిలో కొంచెం ఖర్చు పెట్టి మరమతులు చేయించలేరా? అని పశ్నించారు. ఇప్పుడే ఇలా ఉంటే రాబోవు వర్షా కాలంలో ఎన్ని దేవాలయాలు కూలిపోతాయోనని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతుంటే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లు ఏం చేస్తున్నారని నిలదీశారు కేఏ పాల్.