BR Naidu: తిరుమలలో మళ్లీ తోపులాట జరిగినట్లు ప్రచారం సాగుతున్న విషయం తెలిసిందే. ఈ తోపులాటలో ఒక బాలుడు చనిపోయినట్లు ప్రచారం ఊపందుకుంది. అసలు ఏం జరిగిందనే విషయంపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు క్లారిటీ ఇచ్చారు. ఇటువంటి అవాస్తవాలు ప్రచారం సాగిస్తే, చర్యలు తీసుకుంటామని చైర్మన్ హెచ్చరించారు.
అసలేం జరిగిందంటే..
తిరుమల శ్రీవారి దర్శనార్థం ఈ నెల 22 న కర్ణాటక రాష్ట్రం మడికెరకు చెందిన మంజునాథ అనే బాలుడు తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చాడు. శ్రీవారి దర్శనం అనంతరం శ్రీవారి అన్న ప్రసాద కేంద్రం వద్దకు చేరుకున్నారు. అక్కడ అందరితో పాటు మంజునాథ కూడా ఉన్నాడు. కొద్ది క్షణాల్లో బాలుడు అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. వెంటనే టీటీడీ అధికారుల సహకారంతో, కుటుంబ సభ్యులు అతడిని తిరుమలలోని అశ్విని ఆసుపత్రిలో చేర్పించారు. ఆ తర్వాత స్విమ్స్ వైద్యశాలలో చేర్పించారు. ఆ తర్వాత చికిత్స పొందుతూ.. బాలుడు మంగళవారం మృతి చెందాడు. ఈ ఘటనకు తోపులాట కారణమని ప్రచారం సాగుతోంది. తోపులాటలో బాలుడు మృతి చెందాడని కొందరు ప్రచారం సాగిస్తున్నారు.
ఈ ఘటనపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు స్పందించారు. అసలు ఏం జరిగిందనే విషయాన్ని వివరిస్తూ బీఆర్ నాయుడు ట్వీట్ చేశారు. ఈనెల 22వ తారీఖున కర్ణాటక రాష్ట్రం మడికెరకు చెందిన మంజునాథ అనే బాలుడు తిరుమల మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో సాయంత్రం భోజనం తర్వాత బయటకు వస్తూ అక్కడే అపస్మారక స్థితిలోకి వెళ్లడం జరిగిందన్నారు. వెనువెంటనే అక్కడ ఉన్న సిబ్బంది స్పందించి ఆ బాలుని తిరుమలలోని అశ్విని ఆసుపత్రిలో చేర్పించారు.
తదనంతరం వైద్యుల సలహా మేరకు తిరుపతిలోని స్విమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఆ బాలుడిని తరలించారు. అయితే దురదృష్టవశాత్తు ఆ బాలుడు మంగళవారం మరణించినట్లు ఛైర్మన్ తెలిపారు. వాస్తవానికి ఆ బాలుడు దీర్ఘకాలంగా గుండె జబ్బుతో బాధపడుతూ ఆరు సంవత్సరాల మునుపే గుండెకు చికిత్స చేసుకోవటం జరిగిందన్నారు. వాస్తవాలు ఇలా ఉండగా కొన్ని ప్రసార మాధ్యమాలలో ఆ బాలుడు తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద భవనంలో తోపులాట కారణంగా మరణించాడని పేర్కొనడం వాస్తవం కాదని చైర్మన్ తేల్చి చెప్పారు. టీటీడీ పై ఇటువంటి తప్పుడు వార్తలు ప్రచురించి, అవాస్తవాలు ప్రచారం చేసి, భక్తుల మనోభావాలను దెబ్బతీసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తిరుమల పవిత్రతను దెబ్బ తీసే జరిగే అబద్దపు ప్రచారాలను భక్తులు విశ్వసించరాదని సూచించారు. శ్రీవారి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని, ఇటువంటి ఘటనలను దృష్టిలో ఉంచుకొని అవాస్తవాలను ప్రచారం చేసే అలవాటు మానుకోవాలని ఆయన సూచించారు.
Also Read: TDP Cadre – GV reddy: జీవీ రెడ్డి ఒక్కరే కాదట.. జాబితా పెద్దదే ఉందట.. షాక్ లో టీడీపీ?
25 నుండి మహాశివరాత్రి ఉత్సవాలు..
చంద్రగిరి మండలం కందులవారిపల్లిలోని శ్రీ శేషాచల లింగేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 25 నుండి 27వ తేదీ వరకు మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగనుంది. ఫిబ్రవరి 25వ తేదీన సాయంత్రం 4.30 గంటలకు కలశ స్థాపన, గణపతి, నవగ్రహ, రుద్ర దుర్గ హోమాలు నిర్వహిస్తారు. ఫిబ్రవరి 26న మహాశివరాత్రి సందర్భంగా తెల్లవారుజామున 4.30 నుండి 5.30 గంటల వరకు శ్రీ విఘ్నేశ్వరస్వామి, శ్రీ సుబ్రమణ్యస్వామి, శ్రీ ఆంజనేయస్వామి, శ్రీ ఉమామహేశ్వరస్వామివారికి అభిషేకం జరుగనుంది.
ఉదయం 5.30 నుండి 7 గంటల వరకు శ్రీ శేషాచల లింగేశ్వరస్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహిస్తారు. సాయంత్రం 5 నుండి 6.30 గంటల వరకు శ్రీ శేషాచల లింగేశ్వరస్వామివారికి, శ్రీ నందీశ్వరస్వామివారికి అభిషేకం చేస్తారు. రాత్రి 7 నుండి 12 గంటల వరకు హరికథ, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఫిబ్రవరి 27న తెల్లవారుజామున 12.10 నుండి ఉదయం 4 గంటల వరకు మహన్యాసపూర్వక రుద్రాభిషేకం నిర్వహిస్తారు. ఆ తరువాత ఉదయం 9.30 గంటలకు స్వామివారి కల్యాణోత్సవం ప్రారంభమవుతుంది. సాయంత్రం 6 గంటలకు గ్రామోత్సవం నిర్వహిస్తారు.