Tirumala Darshan: కలియుగ వైకుంఠం శ్రీ వేంకటేశ్వర స్వామివారు తిరుమలలో శ్రీ సాలగ్రామ రూపంలో కొలువై ఉన్న విషయం అందరికీ తెలిసిందే. శ్రీవారిని ఒక్కసారి దర్శించాలన్న తపన భూమి మీద ఉన్న, కోట్లాది మంది భక్తులకు ఉంటుంది. తిరుమల శ్రీవారి దర్శనానికి రోజూ వేలాది మంది భక్తులు సాగరం లాగా పోటెత్తుతుంటారు. అలా వచ్చిన భక్తులకు శ్రీవారిని దర్శించే భాగ్యం ఎంత దూరం నుండి ఉంటుందో తెలుసుకుందాం.
సాధారణంగా రోజు రోజుకు భక్తుల రద్దీ పెరుగుతుండటంతో టీటీడీ, భక్తుల సౌలభ్యం కోసం పలు దర్శన విధానాలను అమలు చేస్తోంది. వీటిలో ముఖ్యంగా సర్వ దర్శనం, టైమ్ స్లాట్ దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం, లక్కీ డిప్ ద్వారా ఆర్జిత సేవలు, తదితర మార్గాలుంటాయి. అయితే ఈ దర్శన విధానంతో భక్తులు ఎన్ని అడుగుల దూరంలో శ్రీవారిని దర్శించే భాగ్యాన్ని పొందుతారో వివరంగా మీ ముందుకు.
సామాన్య భక్తులు..
సర్వదర్శనం లేదా టైమ్ స్లాట్ టోకెన్ల ద్వారా భక్తులు 80 నుండి 90 అడుగుల దూరం ఉండి శ్రీవారిని దర్శించుకుంటారు. జయ, విజయ ద్వారాల మధ్యగా స్వామివారి మహా లఘు దర్శనం లభిస్తుంది.
ఆర్జిత సేవ..
కల్యాణోత్సవం, డోలోత్సవం, సహస్ర దీపాలంకరణ వంటి సేవల టికెట్లు పొందిన భక్తులకు కూడా మహా లఘు దర్శనం లభిస్తుంది. వీరు కూడా సాధారణంగా 80 అడుగుల దూరం నుంచే స్వామిని దర్శించుకుంటారు.
విఐపీ బ్రేక్ దర్శనాలకు..
ప్రభుత్వాధికారులు, ప్రోటోకాల్ విఐపీలు, లేదా సిఫార్సు లేఖలు కలిగిన ప్రముఖులకు టీటీడీ ప్రత్యేకంగా విఐపీ బ్రేక్ దర్శనాలు కల్పిస్తుంది. వీరికి స్వామివారి రాములవారి మెడ వరకు 30 – 40 అడుగుల దూరంలో దర్శనం లభిస్తుంది.
అత్యంత సమీప దర్శనం..
సుప్రభాత సేవ, తోమాల సేవ, అర్చన సేవ వంటి నిత్యసేవలు పొందిన కొందరు భక్తులు స్వామివారి గర్భాలయం ముందు ఉండే కులశేఖర పడి వద్ద, అంటే 10 అడుగుల దూరంలో స్వామిని దర్శించగలుగుతారు.
సాత్తుమోర సేవ..
ఈ సేవలో పాల్గొనేవారు 12 అడుగుల దూరం లోపలుండి స్వామివారిని దర్శించే భాగ్యాన్ని పొందుతారు. భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న కొద్దీ టీటీడీ దర్శన విధానాల్లో మార్పులు చేస్తూ భక్తులకిచ్చే అనుభూతిని మరింత మెరుగుపరుస్తోంది. భగవంతుడిని దర్శించాలన్న తపనతో వచ్చిన ప్రతి భక్తునికి కనీసం స్వామివారి రూపం కనులారా చూసే అవకాశం దక్కేలా చేస్తున్నందుకే, తిరుమల యాత్ర భక్తుల జీవితంలో గుర్తుండిపోయే ఘట్టంగా మిగులుతోంది.
Also Read: Tirumala Tour: తిరుమలలో రహస్య పుణ్యక్షేత్రం.. మీరు మిస్ అవుతున్నారా?
చివరగా ఒక మాట
గోవిందా అనే పవిత్రనామాన్ని స్మరిస్తే చాలు, శ్రీవారి కరుణాకటాక్షం కలుగుతుంది. స్వామి వారి దర్శన భాగ్యం ఎక్కడ నుండి కలిగినా, శ్రీవారి ఆశీస్సులు మనపై ఉంటాయి. అయితే టీటీడీ అధ్వర్యంలో భక్తుల కోసం ఈ దర్శన భాగ్యాలు కల్పిస్తుండగా, మీకు ఏ దర్శనభాగ్యం ఇప్పటి వరకు కలిగిందో ఒకసారి గుర్తు చేసుకోండి.