Tirupati Crime: సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించిన జల్లికట్టు సంబరాలలో విషాదం చోటుచేసుకుంది. జల్లికట్టు సంబరాలను చూసేందుకు వచ్చిన ఓ యువకుడు ఎద్దు ఢీకొట్టడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లి మృతి చెందాడు. ఈ ఘటన ఏపీలోని తిరుపతి జిల్లా వెదురుకుప్పం మండలం మొండి వెంగనపల్లి గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది.
ఏపీలో ప్రతి ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా జల్లికట్టు సంబరాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ప్రధానంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నెల రోజులపాటు జల్లికట్టు సంబరాలు నిర్వహిస్తారు. తమిళనాడు సంస్కృతిలో భాగమైన జల్లికట్టు సంబరాలను, ఏపీలోని ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సైతం కొన్నేళ్ల నుండి నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నే తిరుపతి జిల్లా వెదురుకుప్పం మండలం మొండి వెంగనపల్లి లో సోమవారం జల్లికట్టు సంబరాలను నిర్వహించారు.
జల్లికట్టు సంబరాలను వీక్షించేందుకు ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రజలే కాకుండా, ఇతర జిల్లాల ప్రజలు కూడ అధిక సంఖ్యలో వచ్చారు. జల్లికట్టు అంటే ఎద్దులను పరుగుకు విడిచి పెట్టే ముందుగా వాటి కొమ్ములకు బహుమతులు కడతారు. ఆ బహుమతులను లాక్కోవడం కోసం స్థానిక యువత పోటీ పడుతుంటారు. ఈ పరంపర తమిళనాడు నుండి ఏపీ వైపుకు పాకిందని చెప్పవచ్చు. అయితే సోమవారం మొండి వెంకన్న పల్లి గ్రామంలో జల్లికట్టు సంబరాలను చూసేందుకు జంగయ్య అనే యువకుడు వచ్చాడు.
ఎద్దులు వేగంగా వచ్చే క్రమంలో, ప్రక్కన నిలబడి ఉన్నాడు. ఉన్నటువంటి ఒక్కసారిగా ఒక ఎద్దు జంగయ్య పైకి దూసుకు వెళ్లి ఢీ కొట్టింది. భయాందోళనకు గురైన జంగయ్య వెంటనే అపస్మారక స్థితికి వెళ్లిపోయారు. స్థానికులు గుర్తించి జంగయ్యను వైద్యశాలకు తరలించగా, అప్పటికే జంగయ్య భయాందోళనతో గుండెపోటుకు గురై మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
Also Read: IG Ravi Krishna: ఫ్యాక్షన్ గ్రామంలో సంక్రాంతి.. ఆ కళ్లన్నీ అటువైపే.. ఆయనెవరంటే?
సంక్రాంతి సంబరాలలో భాగంగా జల్లికట్టు సంబరాలు నిర్వహిస్తున్న వేళ ఎద్దు ఢీకొని జంగయ్య మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సంక్రాంతి పండుగ రోజు జంగయ్య మృతి చెందడంతో అతని కుటుంబ సభ్యులు రోదించిన తీరు అందర్నీ కన్నీటి పర్యంతం చేసింది.