Day of the Dead Ofrenda on OTT: మన దేశంలో చావు అంటే సాధారణంగా ఏడుపులు, బాధలు, విషాద వాతావరణం ఉంటాయి. కానీ మెక్సికో దేశంలో మాత్రం చనిపోయిన తమ పూర్వీకులను ఒక పండుగలా, ఎంతో సంతోషంగా గుర్తు చేసుకుంటారు. ఆ అద్భుతమైన సాంస్కృతిక వేడుక వెనుక ఉన్న సంప్రదాయం ఏంటి ? తమకు దూరమైన ఆత్మీయులను అక్కడి ప్రజలు ఎలా గుర్తు చేసుకుంటారు ? ఇలాంటి ప్రత్యేకతలను పరిచయం చేసే నెట్‌ఫ్లిక్స్ స్పెషల్ ‘డే ఆఫ్ ది డెడ్ ఓఫ్రెండా’ (Day of the Dead Ofrenda). తాజాగా ఓటీటీలోకి వచ్చిన ఈ స్పెషల్ కల్చరల్ స్టోరీ విశేషాలు ఏంటో తెలుసుకుందాం పదండి.
ఇది సినిమా కాదు. సంప్రదాయం, సంగీతం, విజువల్స్ ద్వారా మెక్సికో సంస్కృతిలోని ఒక ముఖ్యమైన వేడుకను పరిచయం చేసే ప్రత్యేక కార్యక్రమం. మెక్సికోలో జరుపుకునే ‘డే ఆఫ్ ది డెడ్’ (Day of the Dead) వేడుకలో చనిపోయిన కుటుంబ సభ్యులను, పూర్వీకులను ప్రేమతో గుర్తు చేసుకుంటారు. మరణించినవారితో తమకున్న అనుబంధాన్ని మర్చిపోకుండా, వారి జ్ఞాపకాలను కుటుంబంతో కలిసి పంచుకోవడం ఈ వేడుకలో ప్రధాన అంశం.
ఈ సంప్రదాయంలో ‘ఓఫ్రెండా’ (Ofrenda)కు ప్రత్యేక స్థానం ఉంది. ఇది మరణించిన ఆత్మీయుల జ్ఞాపకార్థం ఇంట్లో లేదా ప్రత్యేక ప్రదేశంలో ఏర్పాటు చేసే వేదిక. అలా ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై వారి ఫొటోలు, పూలు, కొవ్వొత్తులు, వారికి ఇష్టమైన ఆహార పదార్థాలు వంటి వాటిని ఉంచుతారు. ఇలా తమ పూర్వీకులను స్మరించుకోవడం ద్వారా వారితో ఉన్న బంధాన్ని మరోసారి గుర్తు చేసుకుంటారు. ఈ వేడుకలో రంగురంగుల అలంకరణలు, పూలతో చేసిన ప్రత్యేక ఏర్పాట్లు, వెలుగులు, సంగీతం కీలక పాత్ర పోషిస్తాయి. మరణాన్ని కేవలం విషాదంగా చూడకుండా, వారి జ్ఞాపకాలను గౌరవించే సందర్భంగా భావించడం ఈ సంప్రదాయంలోని ప్రత్యేకత. కుటుంబ సభ్యులు కలిసి వేడుకలో పాల్గొనడం, తమ పూర్వీకుల గురించి గుర్తు చేసుకోవడం ద్వారా తరతరాలుగా వస్తున్న ఆచారాలను కొనసాగిస్తారు.
నెట్‌ఫ్లిక్స్ రూపొందించిన ఈ స్పెషల్‌లో డెకరేషన్, సంగీతం, మెక్సికన్ సంస్కృతికి సంబంధించిన దృశ్యాలే ప్రధాన ఆకర్షణ. సాధారణ కథనం లేదా పాత్రలతో నడిచే సినిమా తరహాలో కాకుండా, ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన సాంస్కృతిక అనుభూతిని అందించేలా దీన్ని రూపొందించారు. మెక్సికో సంప్రదాయాలను దగ్గరగా చూడాలనుకునే వారికి, ప్రపంచంలోని విభిన్న ఆచారాల గురించి తెలుసుకోవాలనుకునే వారికి ఇది కొత్త ఎక్స్పీరియన్స్ ను అందిస్తుంది.
‘డే ఆఫ్ ది డెడ్ ఓఫ్రెండా’ 2026 అక్టోబర్ 27 నుంచి నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో అందుబాటులో ఉంది. సుమారు 41 నిమిషాల నిడివి ఉన్న మెక్సికన్ సాంస్కృతిక ప్రత్యేక కార్యక్రమం ఇది. ఇందులో అసలు ఆడియో ఉండదు. సంప్రదాయాలు, సంగీతం, విజువల్స్ ద్వారా ఇతర దేశాల సంస్కృతిని తెలుసుకోవాలనుకునే వారు ఈ స్పెషల్‌ను చూడొచ్చు.
Read Also: నవ్వినా అవుట్… భయపడినా అవుట్… హాలోవీన్ హంగామాలో అన్‌స్టాపబుల్ కామెడీ