Tirupati Tourism: మీరు తిరుపతిలో ఉంటున్నారా? అయితే త్వరలో మీ కల నెరవేరబోతోంది. అవును.. ఇకపై మీరు రోడ్లపైనే కాదు, నీటిపై సైతం రయ్ రయ్ మంటూ దూసుకుపోవచ్చు. ఇంతకు తిరుపతి నగరానికి చేరువయ్యే ఆ కల ఏమిటో తెలుసుకుందాం. అలాగే ఇక్కడికి వచ్చే ఆ ప్రాజెక్ట్ కూడా తెలుసుకున్నారనుకోండి.. తెగ ఆనందిస్తారు. మరెందుకు ఆలస్యం.. అసలు విషయంలోకి వెళదాం.
ఏపీ ప్రభుత్వం పర్యాటక రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఇప్పటికే ఎన్నో కీలక ప్రాజెక్ట్ లకు నిధులు కేటాయించి వాటిని అభివృద్ధి వైపు దూసుకెళ్లేలా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అంతేకాదు విజయవాడ నుండి శ్రీశైలంకు ఇటీవల సీ ప్లేన్ ప్రారంభించిన విషయం తెలిసిందే. దీనితో అక్కడ కేవలం గంటల వ్యవధిలో రాకపోకలు సాగుతున్నాయి. ఇటు విజయవాడ ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తులు, అటు శ్రీశైలం వచ్చే భక్తులకు ఇదొక మంచి సదుపాయమని చెప్పవచ్చు. ఇదే స్పూర్తితో ఇప్పుడు తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల కోసం, తిరుపతి నగర వాసుల కోసం ఇదే సదుపాయం చేరువ కానుంది.
నీటిపై పరుగులు..
ఇప్పుడు తిరుపతి భక్తులకూ, పర్యాటకులకూ మరింత వేగవంతమైన ప్రయాణం అందుబాటులోకి రానుంది. భవిష్యత్‌లో తిరుపతి నుండి నేరుగా నీటిపై ప్రయాణించేందుకు అన్నీ సిద్ధమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఉడాన్ (UDAN – Ude Desh Ka Aam Nagrik) పథకం ద్వారా సీ ప్లేన్ సేవలు (Sea Plane Services) ప్రారంభించేందుకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. దీనిలో భాగంగా, తిరుపతి సమీపంలోని కల్యాణి డ్యామ్‌ను జల విమానాశ్రయంగా (Water Airport) అభివృద్ధి చేయనున్నట్లు తెలుస్తోంది.
అక్కడంతా అభివృద్ధి పరుగులే..
ఈ ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయ అభివృద్ధి సంస్థ APADCL పూర్తిగా మద్దతు ఇస్తోంది. కేంద్ర పౌర విమానయాన శాఖ సహకారంతో, ఇప్పటికే ప్రాథమిక సర్వేలు పూర్తయ్యాయి. 2025 చివరలో, 2026 ప్రారంభంలో ఈ సేవలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కల్యాణి డ్యామ్, తిరుపతి నగరానికి 18 కి.మీ దూరంలో, నల్లమల అరణ్యంలో ఉంది. ప్రకృతి సౌందర్యానికి నెలవైన ఈ ప్రదేశం ఇప్పుడు జల విమానాశ్రయంగా మారబోతుంది. ఇది పర్యాటక అభివృద్ధికి ఓ సరికొత్త అధ్యాయాన్ని తెరలేపనుంది. తిరుమల కొండల కింద అడవుల మధ్య ఏర్పాటు కానున్న ఈ సీ ప్లేన్ సర్వీస్, భక్తులకు కొత్త అనుభూతిని కలిగించనుంది.
సీ ప్లేన్ అనేది విమానం లాంటి వాహనం గానీ, ఇది నీటిపై ల్యాండ్ అవుతుంది. అంటే, ఇది సాధారణ విమానాశ్రయం అవసరం లేకుండానే జలాశయాల మీదే ల్యాండ్, టేకాఫ్ అవుతుంది. దీంతో మెయిన్ రన్‌వే అవసరం లేకుండా, చిన్న నీటి మైదానాల్లోనూ ఈ సేవలు అందుబాటులోకి వస్తాయి. ఈ సౌకర్యం తిరుపతికి, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలోని ఇతర పర్యాటక ప్రాంతాలకి పెద్ద ఊతమివ్వనుంది. ఇప్పుడు దేశంలో ఇప్పటికే కొన్నిచోట్ల సీ ప్లేన్ సేవలు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా గుజరాత్‌లోని కేవడియాలో, అహ్మదాబాద్‌కు చెందిన సబర్మతి నదిపై సేవలు నడుస్తున్నాయి. ఇప్పుడు అదే తరహాలో తిరుపతిలోనూ సేవలు రావడం గర్వకారణం.
Also Read: Miracle Temple: గోమాత వస్తేనే పూజలు.. గుడి మహత్యం తెలుసుకుంటే.. ఒక్క నిమిషం ఆగరు!
ఈ ప్రాజెక్టు పూర్తయితే, చెన్నై – తిరుపతి, బెంగళూరు – తిరుపతి, విశాఖపట్నం – తిరుపతి వంటి మార్గాల్లో సీ ప్లేన్ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇది రోడ్డు మార్గం కంటే వేగంగా, తక్కువ సమయంలో ప్రయాణించే అవకాశాన్ని కల్పిస్తుంది. భక్తులకు తిరుమల వెళ్లే మార్గంలో కొత్త రకమైన ప్రయాణ అనుభూతిని అందిస్తుంది. సీ ప్లేన్ సేవల వల్ల పర్యాటక రంగానికి గణనీయంగా లాభం కలగనుంది. జల విమానాశ్రయం అభివృద్ధి చేయడంతో పాటు, సమీప ప్రాంతాల్లో కొత్త ఉపాధి అవకాశాలు, హోటళ్ల విస్తరణ, ట్రావెల్ టూరిజం రంగాల్లో అభివృద్ధి జరిగే అవకాశం ఉంది. దీంతో తిరుపతి జాతీయ స్థాయిలోనే కాక, అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మరింత ఎదుగుతుందన్నది అధికారుల అంచనా.
అలాగే ఈ ప్రాజెక్టు ప్రారంభమైతే, తిరుపతి నగరానికి మరింత ప్రచారం లభిస్తుంది. అంతేకాకుండా, ఇది ఆంధ్రప్రదేశ్‌లోని మొదటి జల విమానాశ్రయంగా నిలిచే అవకాశం ఉంది. రాష్ట్రంలోని ఇతర పర్యాటక కేంద్రాల్లోనూ ఇదే తరహాలో సేవలు కల్పించేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. ఈ సేవలకు పర్యావరణ అనుమతులు, భద్రతా ప్రమాణాలు, నీటి మట్టం స్థిరంగా ఉండే పరిస్థితులు, ఇతర మౌలిక సదుపాయాలు అవసరం. ఇప్పటికే ప్రముఖ విమానయాన సంస్థలు, టూరిజం కంపెనీలు ఈ ప్రాజెక్టుపై ఆసక్తిని చూపుతున్నాయి. రాబోయే రోజుల్లో మరిన్ని అధికారిక ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది.
సీ ప్లేన్ సర్వీసులు కేవలం ప్రయాణ మాధ్యమం మాత్రమే కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ టూరిజం లో ఒక టర్నింగ్ పాయింట్ అవుతుందని చెప్పవచ్చు. అందులో తిరుపతి మొదటి అడుగు వేయబోతోంది. భక్తులకు త్వరితగతి సేవలు, పర్యాటకులకు సరికొత్త అనుభూతి.. ఈ రెండు కలగలిపే ఈ జల విమానాశ్రయం, భవిష్యత్‌లో ఏపీకి గర్వకారణం అవుతుందనడంలో సందేహం లేదు. మరి మీరు తిరుపతి సీ ప్లేన్ ఎక్కాలంటే, మరికొన్ని రోజులు ఆగాల్సిందే.