Tirupati Attack:చిన్న చిన్న కారణాలకే తగాదాలు పెట్టుకుని ప్రాణాల మీదకి తేవడం, తెచ్చుకోవడం ఈరోజుల్లో కామన్ అయిపొయింది.ఇదిగో అలాంటి సంఘటనే ఇపుడు తిరుపతిలో చోటు చేసుకుంది.
చిన్న కారణంతో మొదలైన గొడవ చివరికి దాడి, బెదిరింపులు, బంగారు గొలుసు లాక్కోవడం వరకు వెళ్లింది. హారన్ కొట్టాడన్న కారణంతో ఓ ట్రావెల్స్ మేనేజర్‌ను కొందరు వ్యక్తులు అడ్డుకుని చితకబాదిన ఘటన తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకోగా.. మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు.
మేనేజర్‌గా పనిచేస్తున్న చంద్రమోహన్
విషయంలోకి వెళ్తే తిరుపతిలోని చెర్లోపల్లి డిజిటల్ ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గరలోని పుదీపట్ల కృష్ణ ట్రావెల్స్‌లో చంద్రమోహన్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు.చంద్రమోహన్
తన పని మీద వెళ్తున్న సమయంలో ముగ్గురు వ్యక్తులు ఓ వాహనంలో వేగంగా వెళ్తున్నారు .దాంతో వాళ్లు అలా వెళ్తుండటంతో చంద్రమోహన్ హారన్ కొట్టాడు. దీంతో కోపానికి వచ్చిన ఆ ముగ్గురు చంద్రమోహన్‌ను అడ్డగించి హారన్ ఎందుకు కొట్టావంటూ గొడవకు దిగారు.
ముగ్గురు కలిసి చంద్రమోహన్‌పై దాడి
ఇక మాటలతో మొదలైన గొడవ కాస్తా దాడికి దారితీసింది. ముగ్గురు కలిసి చంద్రమోహన్‌పై దాడి చేసినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనను ఇష్టమొచ్చినట్లు కొట్టారని, దాడి సమయంలో భయపెట్టారని చెప్పాడు.
అంతేకాదు.. అతని దగ్గర ఉన్న ఫోన్‌ను కూడా నేలకేసి కొట్టి పగలగొట్టినట్లు ఫిర్యాదులో తెలిపాడు.ఆ తర్వాత తన మెడలో ఉన్న సుమారు 9 గ్రాముల బంగారు చైన్‌ను లాక్కున్నారని బాధితుడు ఆరోపించాడు.
దాడి సమయంలో నిందితుల్లో ఒకరు తనను బెదిరించినట్లు చంద్రమోహన్ పోలీసులకు తెలిపాడు. “నేను రౌడీషీటర్‌ను.. చంపేస్తా” అంటూ భయపెట్టారని చెప్పాడు. దీంతో భయపడిపోయిన చంద్రమోహన్ వెంటనే తిరుపతి రూరల్ పోలీసులను ఆశ్రయించాడు.
కేసు నమోదు చేసి దర్యాప్తు
ఇక చంద్రమోహన్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించి నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఈ కేసులో కొర్లగుంట కొత్తపల్లికి చెందిన రౌడీషీటర్ సయ్యద్ అజీమ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
అదే విధంగా అవిలాలకు చెందిన గోశాల రుద్రను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరినీ విచారిస్తూ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం
అయితే ఈ కేసులో మరో నిందితుడు వినయ్ అలియాస్ బబ్లు మాత్రం ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అతడు దొరికితే దాడికి అసలు కారణం ఏంటి? బంగారు చైన్ విషయంలో ఏం జరిగింది? ఘటనలో ఎవరి పాత్ర ఎంత ఉంది? అనే విషయాలపై మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.
also read:కేసీఆర్ దూకుడుతో కాంగ్రెస్‌కు కొత్త టెన్షన్!