పంజాబ్ గురుదాస్ పూర్ జిల్లాలో ఘోరం జరిగింది. దీపావళి పటాకులు కొనేందుకు డబ్బులు లేకపోవడంతో ఓ యువకుడు ఇంట్లోనే తయారు చేసేందుకు ప్రయత్నించాడు. ఈ సందర్భంగా భారీ పేలుడు సంభవించడంతో ఆ యువకుడు స్పాట్ లోనే చనిపోయాడు. ఇంట్లోని ఆరుగురు కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. డేరా బాబా నానక్ సబ్ డివిజన్ లోని ధర్మాబాద్ గ్రామంలో ఈ విషాదకర ఘటన జరిగింది.
దీపావళి సందర్భంగా ధర్మాబాద్ కు చెంది అన్నదమ్ములు మన్ ప్రీత్ అతడి బాబాయ్ కొడుకు లవ్ ప్రీత్ సింగ్ కలిసి ఇంట్లో బాంబు తయారు చేసేందుకు ప్రయత్నించారు. రాత్రి 10 గంటల సమయంలో బాంబులు తయారు చేసేందుకు ఇద్దరూ అవసరమైన పదార్థాలు నింపుతుండగా భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 19 ఏళ్ల మన్ ప్రీత్ అక్కడిక్కడే చనిపోయాడు. లవ్ ప్రీత్ సింగ్ తో పాటు ఐదుగురు కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. వారంతా ప్రస్తుతం అమృత్ సర్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇంట్లోని ఓ వ్యక్తికి కంటి చూపు పోగా, మరొకరికి రెండు చేతులు, మూడవ వ్యక్తికి దవడకు తీవ్ర గాయాలు అయ్యాయి.
మన్‌ప్రీత్, లవ్‌ప్రీత్ పొటాష్ తో నిండిన ఇనుప పైపును ఉపయోగించి ఈ పరికరాన్ని తయారు చేశారు. దానికి మంట తగలడంతో పేలిపోయింది. పేలుడు తీవ్రతకు సమీపంలోని ఇళ్ల కిటికీ అద్దాలు కూడా పగిలిపోయాయి.ఈ ఘటనపై అదే గ్రామానికి చెందిన గురిందర్ సింగ్ కీలక విషయాలు వెల్డించారు. బాధిత అన్నదమ్ములు ఓ వ్యాపారి నుంచి పొటాషియం, సల్ఫర్ లాంటి పేలుడు పదార్థాలను తెచ్చినట్లు వెల్లడించాడు. అనుమతులు లేకుండా పేలుడు పదార్థాలను అమ్ముతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
Read Also: కుక్కపై ప్రేమ.. బాలుడికి కరెంట్ షాకిచ్చి, విషం పెట్టేసి చంపేసిన యజమాని!
అటు ఈ ఘటనపై డేరా బాబా నానక్ పోలీసులు కేసు నమోదు చేశారు. సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నట్లు స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) అశోక్ కుమార్ వెల్లడించారు. ఫోరెన్సిక్ నిపుణులతో కూడిన దర్యాప్తు తర్వాత నిందితుడి పేరును కేసులో చేర్చనున్నట్లు తెలిపారు. పేలుడు పదార్థాలను అమ్మివారు ఎవరు అనే అంశంపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. “బాధితులు గుర్నామ్ సింగ్, సత్నామ్ సింగ్ సోదరుల కుటుంబాలకు చెందినవారు. డబ్బులు లేకపోవడంతో దీపావళి పటాసులు కొనలేదు. అందుకే, పేలుడు పదార్థాలను తెచ్చి ఇంట్లోనే బాంబులు తయారు చేసేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో బాంబు పేలడంతో ఈ ఘటన జరిగింది” అని డేరా బాబా నానక్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అశోక్ కుమార్ శర్మ వెల్లడించారు.
Read Also: రైల్వే ట్రాక్ మీద రీల్స్.. దూసుకొచ్చిన రైలు, గాల్లోకి ఎగిరిపడ్డ యువకుడు!