Crime News: వీరిద్దరూ మహిళా ప్రభుత్వ ఉద్యోగులు. ప్రతినెలా ప్రభుత్వం అందించే జీతం స్వీకరించేవారు. అయితే వీరికి క్రికెట్ బెట్టింగ్ పై మనసు వెళ్లింది. ఇంకేముంది బెట్టింగ్ అనే భూతానికి బానిసలయ్యారు. ఆ తర్వాత అప్పుల పాలయ్యారు. చివరికి దొంగల అవతారమెత్తారు. పోలీసుల చేతికి చిక్కారు. ఈ ఘటన ఏపీలోని నెల్లూరు జిల్లాలో జరిగింది.
క్రికెట్ బెట్టింగ్ జోలికి వెళితే జీవితాలు తారుమారు కావాల్సిందే. బెట్టింగ్ జోలికి వెళ్లవద్దు.. మీ జీవితాలను నాశనం చేసుకోవద్దని పోలీసులు హెచ్చరిస్తూనే ఉంటారు. ఎందరో యువకులు బెట్టింగ్ బారిన పడి అప్పులపాలై ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటనలు ఉన్నాయి. అలాగే బెట్టింగ్ ధాటికి అప్పుల పాలై గ్రామాలు వదిలిన వారు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ మాత్రం అందుకు భిన్నంగా మహిళలు బెట్టింగ్ కు బానిసలు కావడం విశేషం. ఈ ఇద్దరు మహిళలు ప్రభుత్వ ఉద్యోగులుగా వైద్య ఆరోగ్య శాఖలో విధులు నిర్వహించడం మరో విశేషం.
కోవూరులో ఇటీవల చైన్ స్నాచర్ కేసులు ఎక్కువగా నమోదవుతుండగా, పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు. ఈ దశలో కోవూరులో మనవరాళ్లను ఆడిస్తున్న ఓ మహిళ ఇంటి బయట ఉండగా, ఇద్దరు మహిళలు వచ్చి కళ్ళల్లో కారం కొట్టి మెడలోని బంగారు చైన్ ను తెంపుకెళ్లారు. దీనితో బాధితురాలు కేకలు వేయగా, ఆమె కుమారుడుతో పాటు స్థానికులు వారిద్దరినీ పట్టుకున్నారు. పట్టుకోవడమే కాదు వారికి దేహశుద్ది చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. అదుపులోకి తీసుకున్న ఇద్దరు మహిళలను పోలీసులు విచారించగా, అసలు విషయం తెలిసి పోలీసులు షాక్ కు గురయ్యారు.
చైన్ స్నాచర్స్ అవతారమెత్తిన ఇద్దరు మహిళలు ప్రభుత్వ ఉద్యోగులుగా పోలీసులు గుర్తించారు. వైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తున్న జీవిత, వాసుకిలుగా నిర్ధారించిన పోలీసులు చైన్ స్నాచర్లుగా అవతారమెత్తడంపై కారణాలను ఆరా తీశారు. క్రికెట్ బెట్టింగ్ లకు అలవాటు పడి, ఏకంగా రూ. 30 లక్షల మేర అప్పులు చేశారని, ఆ అప్పులు తీర్చేందుకు చోరీలకు అలవాటు పడినట్లు పోలీసులు నిర్ధారించారు. అందుకే చైన్ స్నాచర్లుగా మారి, చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
Also Read: KA Paul: వైసీపీపై మనసుపడ్డ కేఏ పాల్.. ఆ కామెంట్స్ అందుకేనా?
క్రికెట్ బెట్టింగ్ కు బానిసలుగా మారిన ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు చైన్ స్నాచర్లుగా మారడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. బెట్టింగ్ జోలికి వెళ్లవద్దని పోలీసులు ఎన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నా, చివరికి బెట్టింగ్ దెబ్బకు ప్రభుత్వ ఉద్యోగులు చోరీల దారి పట్టడం ఓ సంచలనమే. ఏకంగా రూ. 30 లక్షల అప్పులు చేసి, వాటిని తీర్చలేక మహిళలు, దొంగలుగా మారడం చూస్తే బెట్టింగ్ భూతం దారుణాలను ఇట్టే గ్రహించవచ్చు. అందుకే యువతా మేలుకో.. బెట్టింగ్ జోలికి వెళ్లవద్దు.. అప్పుల పాలు కావద్దు.. తస్మాత్ జాగ్రత్త సుమా!