Air Coolers In Tirumala: తిరుమలలో ఎక్కడ చూసినా వెరీ కూల్ కూల్.. అంత చల్లదనం ఏమిటబ్బా అంటూ శ్రీవారి భక్తులు ఆరా తీస్తున్నారు. తిరుమల ఆలయం దాటితే ఎండ వేడి, ఆలయ పరిసరాల్లో మాత్రం ఎటుచూసినా చల్లదనం.. ఈ వింత అనుభూతిని పొందుతూ శ్రీవారి భక్తులు, టీటీడీ సేవలను తెగ మెచ్చుకుంటున్నారు. అసలే సమ్మర్ కావడంతో తిరుమలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పద్దతి భక్తులను అమితంగా ఆకట్టుకుంటోంది.
అంతా చల్లదనమే..
అసలే సమ్మర్ హాలిడేస్ కావడంతో శ్రీవారి దర్శనార్థం తిరుమలకు భక్తులు పెద్దఎత్తున తరలి వస్తున్నారు. రోజూ వేల సంఖ్యలో శ్రీవారిని దర్శిస్తూ తమ భక్తిని చాటుకుంటున్నారు. అయితే నిత్యం శ్రీవారి సేవలో తరించే భక్తుల సేవకు టీటీడీ అహర్నిశలు శ్రమిస్తోంది. శ్రీవారి సన్నిధిలో ఏ భక్తుడు ఇబ్బందులు పడకుండా టీటీడీ తీసుకుంటున్న చర్యలు బేష్. అందుకే సమ్మర్ లోనూ శ్రీవారి భక్తులు తిరుమలకు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు.
ప్రత్యేక ఏర్పాట్లు..
ఎండా కాలం.. వేడి గాలుల తాకిడి అంతా ఇంతా కాదు. వృద్దులు, చిన్నారులు పడే అవస్థలు ఊహించలేము. అందుకే తిరుమలలో టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అడుగడుగునా చలువ పందిళ్లు, ఉచిత బటర్ మిల్క్ పంపిణీ, త్రాగునీటి స్టేషన్లు, వైద్య సిబ్బందిని ఏర్పాటు చేసింది. అంతేకాకుండా కాస్త టీటీడీ ఆలోచన భిన్నంగా సాగి, భక్తులకు చల్లదనం పెంచే చర్యలు తీసుకుంది. అందుకు దాతలు సైతం సహకరించడంతో ప్రస్తుతం ఇంత ఎండలలోనూ, అంతా కూల్ కూల్ వాతావరణం ఇక్కడ కనిపిస్తోంది.
కూల్ కూల్ వెనుక కథ ఇదే..
వేసవి తీవ్రత ఎటూ తక్కువ కాకుండా ఎండలు మించిన తరుణంలో, వేలాది మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమలకు తరలివస్తున్నారు. భక్తుల రద్దీ అధికంగా ఉండే ఈ కాలంలో వారికి తాత్కాలిక ఉపశమనం కలిగించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) వినూత్న చర్యలు చేపట్టింది. వీటిలో ప్రధానంగా నీటి బిందువులు విరజిమ్మే మిస్ట్ వాటర్ కూలర్లను ఏర్పాటు చేయడం విశేషం.
నీటి బిందువులతో చల్లదనం
ఈ ప్రత్యేక వాటర్ కూలర్లు చిన్న చిన్న నీటి బిందువులను గాలిలోకి విరజిమ్ముతూ చల్లదనాన్ని కలిగించే విధంగా పనిచేస్తున్నాయి. ఇవి “మిస్ట్ ఫ్యాన్” విధానాన్ని అనుసరించగా, తక్కువ విద్యుత్ వినియోగంతో ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తున్నాయి. గాలిలో వేడి శాతం అధికంగా ఉన్న సమయంలో ఈ నీటి బిందువులు అక్కడి వాతావరణాన్ని చల్లబరుస్తున్నాయి. దీనితో తిరుమలలో శ్రీవారి భక్తులు కూల్ కూల్ అనేస్తున్నారు.
Also Read: Weather Alert: తగ్గేదేలే.. అటు ఎండలు.. ఇటు వానలు.. ఏపీ, తెలంగాణలో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదే..!
ఎక్కడెక్కడ..
ముఖ్యంగా దివ్యదర్శనం, సర్వదర్శనం క్యూలైన్లు, వసతి గృహాల సమీపాలు, శ్రీవారి ఆలయం పరిసర ప్రాంతాలు వంటి చోట్ల ఇవి ఏర్పాటు చేశారు. ఈ కొత్త కూలర్ల ఏర్పాటుతో భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే మిగిలిన ప్రాంతాల్లో కూడా టీటీడీ ఈ ప్రత్యేక కూలర్లను ఏర్పాటుచేసే దిశగా చర్యలు తీసుకోనుంది.