Weather Alert: ఏపీ, తెలంగాణలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఏ వైపు ఎండలు ఠారెత్తిస్తుండగా.. మరోవైపు వానలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో నేడు కొన్నిచోట్ల ఎండలు, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.
శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీవర్షాలు కురుస్తాయని వివరించింది. అలాగే విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీఎస్‌డీఎంఏ ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు.
ఈ నేపథ్యంలో వచ్చే రెండు, మూడు రోజులు కూడా భిన్న వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు తెలంగాణలో కూడా భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. పగలు విపరీతమైన ఎండలతో మండిపోతున్న వాతావరణం, రాత్రైతే ఉరుములు మెరుపులతో ఒక్కసారిగా చల్లగా మారి వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఉత్తర తెలంగాణలో మండుతున్న ఎండలకు ఆరెంజ్ అలర్ట్ జారి చేసింది వాతావరణ శాఖ. పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆరెంజ్ అలర్ట్ జారిచేంది.
శుక్రవారం నాడు జయశంకర్ భూపాల పల్లి జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. కల్లాల్లో ఆరబెట్టిన వరిధాన్యం, మిర్చి వర్షానికి తడిసి ముద్దయ్యాయి. చేతి కొచ్చిన మామిడి పంట నేల రాలింది. జిల్లాలో కురిసిన అకాల వర్షం రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. కాటారం, మహదేవపూర్, మహాముత్తారం, మల్హర్, పలిమెల మండలాల్లో వర్షం దంచికొట్టింది. కొర్లకుంట దగ్గర రోడ్డుపై చెట్టు విరిగిపడింది. దీంతో కాటారం – మేడారం రోడ్డుపై 7 గంటలపాటు రాకపోకలు నిలిచిపోయాయి. పలుచోట్ల కరెంట్ స్తంభాలు విరిగిపడ్డాయి. దాంతో కొన్ని గ్రామాలకు విద్యుత్ అంతరాయం ఏర్పడింది.
మహముత్తారం – వజినెపల్లి, కొత్తపల్లి రోడ్డులో ఈదురుగాలులకు రోడ్డు పై చెట్లు విరిగిపడగా.. ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మహముత్తారం మండలంలో వడగళ్ల వాన కురిసి రైతులను నిండా ముంచింది. వరి పంట నేలపాలయ్యింది. కళ్లాల్లో ఆరబెట్టిన వరిధాన్యం, మిర్చి వర్షానికి తడిసి ముద్దయ్యాయి. మల్హర్ మండలంలో మామిడి కాయలు నేల రాలాయి. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: మళ్లీ కరోనా.. ఆ నెలలోనే భూమి అంతం! వణుకు పుట్టిస్తున్న బాబా వంగా జోస్యం
ఈ విచిత్ర వాతావరణం గల కారణం.. గ్లోబల్ క్లైమేట్ ఛేంజ్ కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాతావరణ మోడళ్ల ప్రకారం భారతదేశంలో ఎల్-నినో ప్రభావం బలంగా ఉండటంతో, తరచూ వర్షాలు, ఆపై ఎండలు అనే నిశ్చితమైన సైకిల్ మారిపోతోందని అధికారులు తెలిపారు.
పసిఫిక్ మహాసముద్ర పరిస్థితులు తటస్థంగా ఉన్నప్పుడు, నైరుతి రుతుపవనాలకు మంచి రూట్ ఉంటుందంటున్నారు. కరువు, లేదంటే వరద లాంటి పరిస్థితులు ఉండబోవన్న అంచనాలైతే ఉన్నాయి. అయితే చివరి దాకా దేన్నీ నమ్మలేని పరిస్థితి. పసిఫిక్‌లో తటస్థ పరిస్థితులుంటే సముద్రం తూర్పు మధ్య భూమధ్యరేఖ ప్రాంతాల్లో ఉపరితల నీటి ఉష్ణోగ్రతలు అసాధారణంగా వేడెక్కవు. ఎల్ నినో ఎఫెక్ట్ ఉంటే రుతుపవనాల రాకకు ఇబ్బంది. ఇప్పుడు లా నినా కూడా ముగింపుగా ఉందని, తటస్థ పరిస్థితుల్లో వాతావరణనాన్ని అంచనా వేయడం వెదర్ సైంటిస్టులకు కూడా ఒకింత కష్టమే అంటున్నారు. అందుకే మరింత జాగ్రత్తగా అంచనాలు రూపొందించాల్సి ఉంటుందంటున్నారు.