టీటీడీ బడ్జెట్ ఆమోదం సహా ఇతర కీలక నిర్ణయాలు తీసుకునేందుకు ఈరోజు పాలకమండలి సమావేశమైంది. ఈ సమావేశంలో వార్షిక బడ్జెట్ ప్రతిపాదన జరిగింది. మొత్తం రూ. 5,258.68 కోట్లు ఈ ఏడాది వార్షిక బడ్జెట్ కు పాలకమండలి ఆమోదం తెలిపింది. ఇక ఇటీవల తిరుమల యాత్రలో సీఎం చంద్రబాబు ప్రకటించిన నిర్ణయాలకు కూడా ఈరోజు టీటీడీ బోర్డ్ ఆమోద ముద్ర వేసింది.
సీఎం నిర్ణయాలకు ఆమోదం..
ముందుగా గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ మృతికి టీటీడీ సభ్యులు సంతాపం తెలిపారు. అనంతరం పాలకమండలిలో చర్చ మొదలైంది. ముందుగా సీఎం చంద్రబాబు ప్రకటించిన నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. అలిపిరి వద్ద ముంతాజ్ హోటల్స్ కు కేటాయించిన భూమిని టీటీడీ తిరిగి తీసుకోవాలని నిర్ణయించింది. టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఉన్న 18 ఎకరాలు సైతం టీటీడీ స్వాధీనం చేసుకోబోతోంది. 32.5 ఎకరాల భూముల్ని టీటీడీ పరిధిలోకి తీసుకుంటున్నారు. ప్రైవేట్ హోటల్స్ కు, టూరిజం అభివృద్ధికి మరొక చోట 50 ఎకరాలు కేటాయించాలని నిర్ణయించారు.
టీటీడీ ఆస్తుల పరిరక్షణకు కమిటీ
తిరుమల ఆస్తులను కాపాడాలని భక్తులు కోరుకుంటున్న నేపథ్యంలో దీనికోసం ఓ కమిటీ ఏర్పాటు చేయడానికి టీటీడీ నిర్ణయించింది. న్యాయస్థానాల్లో పెండింగ్ లో ఉన్న కేసులను పరిష్కరించి, ఆయా భూములను టీటీడీ స్వాధీనం చేసుకొనే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు చైర్మన్ బీఆర్ నాయుడు. టీటీడీలో హిందూ ఉద్యోగులు మాత్రమే ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో శ్రీవారి ఆలయ నిర్మాణాల కొరకు ఆయా ప్రభుత్వాలను ఇప్పటికే సంప్రదించామని, ఇప్పటికే కొందరు సీఎంలు స్పదించారని, స్పందించని వారికి సీఎం చంద్రబాబు సైతం లేఖలు రాస్తారని చెప్పారు.
నేడు అన్నమయ్య భవనంలో టీటీడీ పాలకమండలి సమావేశంలో చర్చించి తీసుకున్న నిర్ణయాలు
* సీఎం చంద్రబాబు నాయుడు అదేశాలకనుగుణంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నాం
* అలిపిరి వద్ద ముంతాజ్ హోటల్స్ కు కేటాయించిన భూమిని టీటీడీ స్వీకరించాలని నిర్ణయం
* విదేశాల్లో కూడా శ్రీవారి ఆలయాలు నిర్మించేందుకు… pic.twitter.com/KzKlchImra— B R Naidu (@BollineniRNaidu) March 24, 2025
ఆగమశాస్త్రానికి నూతన కమిటీ
శ్రీవారి దర్శనాలకు సంబంధించి వికలాంగులు, వయో వృద్ధుల అభ్యర్థనను దృష్టిలో ఉంచుకొని, ఆఫ్ లైన్ లో కూడా టోకెన్ ల జారీ పై చర్చించామని తెలిపారు టీటీడీ చైర్మన్. బ్రేక్ దర్శనం సమయాన్ని మార్చేందుకు కూడా చర్యలు చేపడుతున్నామన్నారు. కాశీ మఠంకు నిత్య హారతి ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నామని, ఆగమ శాస్త్ర నూతన కమిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామని, శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ కి రూ. 1 కోటి ఆర్ధిక సహాయం చేస్తున్నామని చెప్పారు. ఆస్ట్రేలియా లోని అడిలైట్ లో ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయం నిర్మిస్తున్నట్టు చైర్మన్ తెలిపారు.
లైసెన్స్ లేని దుకాణాల ఏరివేత..
నాసిరకం కూరగాయలు పంపిణీ చేసిన శ్రీనివాస సేవ సమితిని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని టీటీడీ నిర్ణయించింది. పోటు కార్మికులకు రూ.43 వేలు జీతభత్యాలు వచ్చేలా జీఎస్టీ ఉపసంహరణ కోసం తీర్మానం చేసింది. సైన్స్ సిటీ కి ఇచ్చిన 20 ఎకరాలు వెనక్కు తీసుకోవాలని నిర్ణయించింది. కాంట్రాక్టు ఉద్యోగుల అభ్యర్థన మేరకు ఓ కమిటీ నియమించి వారి సమస్య పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టబోతోంది. తిరుమలలో లైసెన్స్ లేని హాకర్స్, దుకాణాల ఏరివేత ప్రక్రియ మొదలు పెట్టబోతోంది.
ఇక టీటీడీ వసతి గృహాల ఆధునీకరణకు కూడా బోర్డు నిర్ణయం తీసుకుంది. కొన్ని పాత భవనాలను కూల్చి వేసి నూతన భవనాల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. సాంకేతికతను అందిపుచ్చుకునే విషయంలో కూడా టీటీడీ ముందడుగు వేయడానికి సిద్ధమైంది. నిఘా, ఇతరత్రా వ్యవహారాలలో గూగుల్ ఏఐ టెక్నాలజీ వినియోగించే విధంగా చర్యలు చేపట్టేందుకు టీటీడీ పాలకమండలి నిర్ణయించింది.