TTD News: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు తిరుమల శ్రీవారి దర్శనభాగ్యం చాలాసార్లు కలగలేదట. శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చి, దర్శనం లభించక పలు మార్లు వెనక్కు వెళ్లిపోయారట. ఈ మాటలు అన్నది ఎవరో కాదు స్వయాన చైర్మన్ బీఆర్ నాయుడే. ఔను గతంలో తాను తిరుమలకు వచ్చిన సందర్భంగా ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తుకు చేసుకున్నారు బీఆర్ నాయుడు.
తిరుమలలో రథసప్తమి సందర్భంగా నిర్వహించిన ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించడంపై ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు, టీటీడీని ప్రత్యేకంగా అభినందించిన విషయం తెలిసిందే. తాజాగా రథసప్తమి ఉత్సవాలలో భక్తులకు సేవలు అందించిన శ్రీవారి సేవకులతో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గతంలో ఆయన తిరుమలలో ఎదుర్కొన్న పలు సమస్యలను సైతం ప్రస్తావించడం విశేషం. కాగా రథసప్తమి ఉత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకోగా, శ్రీవారి సేవకులు మెరుగైన సేవలు అందించారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి చైర్మన్ మాట్లాడుతూ.. శ్రీవారి సేవ చేయాలన్న కోరిక తనకు కొన్నేళ్లుగా ఉందని, మూడు నెలల క్రితం సీఎం చంద్రబాబు ఆ కోరిక తీర్చి భక్తులకు సేవ చేసే అవకాశం కల్పించారన్నారు.
శ్రీవారి సేవకులు చేసిన సేవలను అభినందించాల్సిన అవసరం ఉందని, సేవకులను చూస్తుంటే ఆనందంతో మాటలు రావట్లేదంటూ.. చైర్మన్ భావద్వేగానికి గురయ్యారు. అలాగే తన కంట ఆనంద భాష్పాలను నేల రాల్చారు. శ్రీవారి సేవ చేయడం సామాన్య విషయం కాదని, అదికూడా రథసప్తమి రోజు శ్రీవారి సేవ చేసే భాగ్యం కలగడం సేవకులకు కలిగిన అదృష్టంగా చైర్మన్ అభివర్ణించారు. శ్రీవారి వాహన సేవల కోసం ఎందరో భక్తులు చలిలో వేచి ఉన్నారని, అటువంటి భక్తులకు శ్రీవారి సేవకులు అర్ధరాత్రి సమయంలో కూడా విశేషంగా సేవలను అందించడం తనకు చాలా ఆనందం కలిగించిందని చైర్మన్ తెలిపారు. శ్రీవారి సేవకుల విధానాన్ని ఇంకా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని, అందుకే టీటీడీ తగిన చర్యలు తీసుకుంటుందంటూ చైర్మన్ భరోసా ఇచ్చారు.
Also Read: Nara Lokesh vs YS Jagan: జగన్ 2.O పై లోకేష్ సెటైర్స్.. ఒక్కటే చాలు.. ప్రజలు బాగుండాలన్న లోకేష్
తన చిన్నతనం నుండి ఏడాదికి మూడుసార్లు శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమలకు వచ్చేవాడినని, దర్శనం దొరక్క వెనక్కు వెళ్లిపోయిన రోజులు కూడా తనకు ఇప్పటికి గుర్తున్నాయంటూ చైర్మన్ అన్నారు. అలాంటి తనకు స్వామివారి సేవ చేసే భాగ్యం టీటీడీ చైర్మన్ గా దక్కడంపై బీఆర్ నాయుడు ఆనందం వ్యక్తం చేశారు. కలియుగ వైకుంఠం వెలసిన తిరుమలలో తాను బాల్యం నుండి ఎన్నో అద్భుతాలను చూశానని తెలిపిన చైర్మన్, శ్రీవారి సేవకులకు పేరుపేరునా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు. చైర్మన్ మాట్లాడిన తీరుపై ఆనందం వ్యక్తం చేసిన శ్రీవారి సేవకులు.. రథసప్తమి ఉత్సవాల్లో భక్తులకు సేవ చేసే భాగ్యం కలగడం తమకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నట్లు చైర్మన్ తో వారు తెలిపారు.