Caste Survey Details :
⦿ రాష్ట్రంలో బీసీ జనాభా పెరిగింది
⦿ కుల గణన శాస్త్రీయమైన సర్వే
⦿ఈ తరహా సర్వే ముందెన్నడూ నిర్వహించలేదు
⦿ తప్పుడు గణాంకాలతో విపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయి
⦿ శాసన సభలో కులగణన సర్వే పై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్
⦿ హాజరైన శాసన మండలి చైర్మన్ గుత్తా,శాసన సభాపతి గడ్డం ప్రసాద్
రాష్ట్రంలో గతంతో పోలిస్తే బీసీ జనాభా పెరిగిందని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వే పూర్తిగా శాస్త్రీయంగా సాగిందని, స్వాతంత్య్రం తర్వాత అత్యంత పకడ్బందీగా, పూర్తి పారదర్శకంగా నిర్వహించిన సర్వే ఇదేనని స్పష్టం చేశారు. 2011 జనాభా లెక్కల తరువాత క్షేత్ర స్థాయిలో నిర్వహించిన కులగణన ఇదేనన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, విపక్షాలు తప్పుడు గణాంకాలతో ప్రజలను తప్పు దోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. బుధవారం నాడు రాష్ట్ర శాసనసభ ప్రాంగణంలో ప్లానింగ్ డిపార్ట్ మెంట్ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానీయ, రాష్ట్ర నోడల్ అధికారి, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టిల ఆధ్వర్యంలో.. కులగణన సర్వేపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో శాసన సభ, మండలి చైర్మన్లు గుత్తా సుఖేందర్, గడ్డం ప్రసాద్ లతో పాటు మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఇతర ఎమ్మెల్యేలు హజరయ్యారు. వీరందరికీ సర్వే వివరాల్ని వివరించారు. కాగా.. గతంలో బలహీన వర్గాల కోసం ప్రామాణిక కుల ఆధారిత డేటా సేకరించలేదని మంత్రి ఉత్తమ్ తెలిపారు. గత అధ్యయనాలు అసంపూర్ణంగా లేదా అనధికారికంగా ఉన్నాయని, ప్రస్తుత సర్వే మాత్రం చట్టబద్ధమైన, సంపూర్ణ వివరాలతో ఉన్న మొదటి కుల సర్వే అని వెల్లడించారు. వివిధ వర్గాల సామాజిక-ఆర్థిక స్థితిగతులను అంచనా వేసి, సంక్షేమ విధానాలను రూపొందించడానికి ఈ ఫలితాలు ఉపయోగపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో చేపట్టిన కులగణన సర్వే విషయంలో ఎవరూ తమకు సవాలు చేయలేరన్న మంత్రి ఉత్తమ్.. ఇవే నిజమైన గణాంకాలని స్పష్టం చేశారు. ఈ సర్వే నివేదికల్ని బట్టి.. గత రికార్డుల్లోని బీసీ జనాభా కంటే ప్రస్తుతం బీసీ జనాభా శాతం పెరిగిందని వెల్లడించారు. బీఆర్‌ఎస్ పాలనలో 51.09% గా నమోదైన బీసీ జనాభా శాతం ఇప్పుడు 56.33% కు పెరిగిందని తెలిపారు. అలాగే.. షెడ్యూల్డ్ ట్రైబ్స్ (ST) జనాభా 9.8% నుండి 10.45% కు పెరిగిందని, ఇతర కులాల (OCs) జనాభా 21.55% నుండి 15.79% కు తగ్గిందని వివరించారు. అయితే బీసీ జనాభా శాతం తగ్గిందని విపక్షాలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అందులో వాస్తవం లేదన్నారు. వారి ఆరోపణలు అసత్యాలని వివరించారు.
బీసీ జనాభాపై నిజమైన అధ్యయనం చేయకపోతే, విపక్షాలు ఏ గణాంకాలను ఆధారంగా తీసుకుని ప్రస్తుత సంఖ్యలను పోల్చుతున్నారని ఆయన ప్రశ్నించారు. సర్వేను ఖచ్చితంగా అమలు చేయడానికి, లక్ష మందికి పైగా శిక్షణ పొందిన సిబ్బందిని నియమించామని గుర్తు చేశారు. ప్రభుత్వం రాష్ట్రాన్ని 94,261 ఎన్యుమరేషన్ బ్లాక్ లుగా విభజించిందని, ప్రతి బ్లాక్ కు సుమారు 150 ఇళ్లను కవర్ చేసేలా మార్క్ చేశారని తెలిపారు. 50 రోజుల్లో సర్వే పూర్తయిందని, పట్టణాలు విస్తరించడంతో పాటు వలసలు ఉండడంతో కొత్తగా ఎన్యుమరేషన్ బ్లాక్స్ ఏర్పాటు చేయ్యాల్సి వచ్చిందని తెలిపారు.
సర్వే రెండు దశల్లో నిర్వహించామని తెలిపిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. మొదటి దశ లో హౌస్ లిస్టింగ్, రెండో దశలో ప్రధాన డేటా సేకరణ దశ జరిగిందని వెల్లడించారు. తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఇందులో పాల్గొనడం ఈ సర్వే ప్రామాణికతకు అద్దం పడుతుందన్నారు. ఈ సర్వే ద్వారా తెలంగాణ ప్రజలకు సమగ్ర డేటాను అందించడం వీలవుతుందన్నారు. ఇది భవిష్యత్తులో సమర్థవంతమైన పాలనకు దోహదపడుతుందని మంత్రి తెలిపారు. అధునాతన సాంకేతికత ద్వారా డేటా విశ్లేషణ జరిగిందని ఆయన వివరించారు.
సర్వే అనంతరం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (CGG) ఆధ్వర్యంలో ఆధునిక సాఫ్ట్‌వేర్ సాయంతో డేటా విశ్లేషణ చేపట్టిన్నట్లు తెలిపిన మంత్రి.. 76,000 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించి, 36 రోజుల్లో డేటాను డిజిటలైజ్ చేశారని తెలిపారు. ఎంట్రీ దశలో తప్పుల్ని గుర్తించేందుకు.. ఆటోమేటెడ్ ఎర్రర్ డిటెక్షన్ మెకానిజాన్ని ఉపయోగించారని, ఓటర్ల జాబితాలు జనాభాను అంచనా వేసేందుకు ఉపయోగపడవని, అవి ఆధార్ అనుసంధానం లేకపోవడంతో కచ్చితమైన గణాంకాలు ఇవ్వలేవని మంత్రి వివరించారు. గత ఎన్నికలలో బీసీల ఓటర్ల జాబితాను ఆధారంగా తీసుకున్నప్పటికీ, అది బీసీ జనాభా గణనకు సరైన ఆధారంగా ఉండదని అన్నారు.
Also Read : అన్ని ఆలయాల్లో ఇకపై దర్శనం టికెట్ల ఇలానే – తెలంగాణ దేవాదాయ శాఖ కీలక నిర్ణయం
బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఈ సర్వే విపులంగా జరిగిందన్నారు. విపక్షాల వద్ద నిజమైన గణాంకాలు లేవని, వారి వాదనలు పూర్తిగా అసత్యం అని అన్నారు. మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఒకవేళ కొందరు వ్యక్తిగత సమాచారం ఇవ్వకపోయినా, ప్రభుత్వానికి ఇప్పుడు తెలంగాణ గృహాల సమగ్ర డేటాబేస్ ఉందన్నారు. ఈ సర్వే ద్వారా అందిన గణాంకాలను పాలన, సంక్షేమ విధానాల్లో వినియోగిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సర్వే ద్వారా ప్రభుత్వం సమర్థమైన పాలన అందించేందుకు దోహదం చేస్తుందన్నారు. ఇది డేటా ఆధారిత పరిపాలనకు మార్గదర్శిగా నిలుస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.