TTD Chairman BR Naidu: టీటీడీ చైర్మన్ గా అలా భాద్యతలు స్వీకరించారో లేదో, ఇలా ఝలక్ ఇచ్చారు నూతన చైర్మన్ బీఆర్ నాయుడు. తన ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయని, వాటన్నింటినీ అధిగమించి, సామాన్య భక్తులకు టీటీడీ సేవలు చేరువ చేయడంలో తన మార్క్ ఉంటుందంటూ నూతన చైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన సమయం నుండి టీటీడీ చైర్మన్ పదవి ఎవరికి వరిస్తుందోనన్న ఊహాగానాల మధ్య, చివరికి బీఆర్ నాయుడు కు ఆ ఛాన్స్ దక్కింది. మంగళవారం భాద్యతలు చేపట్టిన బీఆర్ నాయుడు, బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు విషయాలపై ఆయన సుదీర్ఘంగా మాట్లాడారు.
నూతన చైర్మన్ మాట్లాడుతూ.. టీటీడీలో ఎన్నో మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నో ఛాలెంజ్స్ బోర్డుకు ఉన్నాయని, వాటిని త్వరితగతిన అధిగమించేందుకు కృషి చేస్తామన్నారు. శ్రీవారి ఆలయ పవిత్రత, సామాన్య భక్తులకు సౌకర్య కల్పనపై ప్రత్యేక దృష్టి సారించామని, గత నెలలో జరిగిన బ్రహ్మోత్సవాలను ఈవో శ్యామలరావు సారథ్యంలో వైభవంగా నిర్వహించారని కొనియాడారు.
అన్యమత ప్రచారం జరిగితే కఠినచర్యలు..
కలియుగ వైకుంఠం శ్రీ శ్రీనివాసుడు వెలసిన తిరుమలలో అన్యమత ప్రచారం నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు. అలా అన్యమత ప్రచారం చేసే ఘటనలు తిరుమల ప్రాంతాలలో ఎక్కడ జరిగినా సహించమని తెలిపారు. శ్రీవాణి ట్రస్ట్ నిధులు దుర్వినియోగం అయినట్లు అపోహలు ఉన్నాయని, ప్రస్తుతం విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుందన్నారు. విచారణ పూర్తయ్యాక, నివేదికను బట్టి ప్రభుత్వం దృష్టికి విషయాన్ని తీసుకెళ్తామన్నారు.
Also Read: Tirumala Updates: తిరుమల వెళ్తున్నారా.. అయితే ఈ సమాచారం మీకోసమే!
టీటీడీ పరిధిలో 22 వేల మంది ఉద్యోగస్తులు ఉన్నారని, వారిలో 6 వేల మంది శాశ్వత ఉద్యోగులు ఉన్నట్లు, తిరుమలకు ఒకేసారి లక్షకు పైగా భక్తులు వస్తే, ఒక్కరోజులో దర్శనం చేయించడం కష్టతరమేనని తన అభిప్రాయం వెలిబుచ్చారు. అన్యమత ఉద్యోగుల అంశంపై సుధీర్ఘ చర్చ అనంతరం నిర్ణయం తీసుకుంటామని, ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తామని, సీఎం చంద్రబాబు చెప్పినట్లుగా తిరుమల పవిత్రతను కాపాడడంలో ఎక్కడ కూడా వెనుకాడబోనన్నారు. తిరుమలకు వచ్చే ప్రతి సామాన్య భక్తుడు, శ్రీవారిని దర్శించడంలో ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా, తీసుకొనే చర్యలపై కూడా బోర్డు మీటింగ్ లో ఏయే నిర్ణయాలు తీసుకోవాలో చర్చిస్తామన్నారు.