Tirumala Updates: తిరుమల మాడవీధులు గోవిందా నామస్మరణతో మారుమ్రోగుతున్నాయి. ఎటుచూసినా భక్తజనసందోహం తిరువీధులలో కనిపిస్తోంది. అలిపిరి నుండి గల కాలినడక దారి భక్తులతో నిండుగా కనిపిస్తోంది. శ్రీ శ్రీనివాసా శరణు.. శరణు అంటూ భక్తులు కలియుగ వైకుంఠం శ్రీ శ్రీనివాసుడి దర్శనం కోసం బారులు తీరుతున్నారు. దీనితో భక్తుల సేవలో తరించే టీటీడీ, ఎటువంటి అసౌకర్యం కలుగకుండా.. అన్ని చర్యలు చేపట్టింది.
శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతుందంటే?
ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి 18 నుండి 20 గంటల సమయం పడుతుందని టీటీడీ ప్రకటించింది. అలాగే సోమవారం స్వామి వారిని 68,146 మంది భక్తులు దర్శించుకోగా.. 22,667 మంది భక్తులు తలనీలాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. అంతేకాదు స్వామి వారికి భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ. 4.23 కోట్ల మేర ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. కాగా శ్రీవారి సర్వ దర్శనానికి 17 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
Also Read: ఈ 5 రాశులు కలవారిపై శనిదేవుని కృప
శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాత సేవలో పాల్గొన్న సినీ కథానాయకుడు సాయి ధర్మతేజ్, అల్లు అర్జున్ సతీమణి స్నేహ రెడ్డి
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తెలుగు చలనచిత్ర సినీ కథానాయకుడు సాయిధర్మ తేజ్ దర్శించుకున్నారు. బుధవారం ఉదయం శ్రీవారి మేల్కొలుపు సేవా అయిన సుప్రభాత సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదశీర్వచనం అందించగా.. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. ఇక అల్లు అర్జున్ సతీమణి స్నేహ రెడ్డి సైతం శ్రీ వారిని సుప్రభాత సేవలో దర్శించుకోవడం విశేషం. తన మిత్ర బృదంతో కలసి స్వామి వారిని సేవలో పాల్గొన్నారు స్నేహ రెడ్డి. దర్శనం అనంతరం స్నేహ రెడ్డికి ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు.