Chinese Items In Tirumala: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) భక్తులకు మరింత సౌకర్యవంతమైన అనుభూతి కల్పించేందుకు హోటళ్ల నిర్వహణపై పటిష్ట చర్యలు తీసుకుంటోంది. తాజాగా తిరుమల ఆస్థాన మండపంలో హోటళ్ల యజమానులతో జరిగిన సమావేశంలో, టిటిడి అదనపు ఈవో సిహెచ్. వెంకయ్య చౌదరి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
నిత్యం తిరుమలకు వేలాది సంఖ్యలో భక్తులు వచ్చే పరిస్థితి. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సుల కోసం వచ్చే భక్తులను కొందరు హోటల్ యజమానులు నిలువు దోపిడి చేస్తున్న పరిస్థితి. అంతేకాకుండా రుచి, శుచి లేకుండా ఇష్టారీతిన హోటళ్ల నిర్వహణపై పలుమార్లు టీటీడీకి ఫిర్యాదులు అందాయి. అందుకే టీటీడీ అటువంటి హోటళ్లపై చర్యలు తీసుకొనేందుకు రంగం సిద్ధం చేసింది. అంతేకాకుండా సంబంధిత యజమానులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది.
సాంప్రదాయ వంటకాలే తప్పనిసరి!
భక్తులకు వివిధ రాష్ట్రాలకు చెందిన ఆరోగ్యకరమైన, సాంప్రదాయ వంటకాలు మాత్రమే అందించాలని అడిషనల్ ఈవో సూచించారు. చైనీస్ వంటకాలను పూర్తిగా నిషేధించాలని స్పష్టం చేశారు. భక్తులు శుద్ధతతో కూడిన ఆహారాన్ని స్వీకరించేలా చూడాలని, చిన్న తప్పులు కూడా వారిలో అసంతృప్తి కలిగించే ప్రమాదం ఉందన్నారు.
హోటళ్ల నిర్వహణలో మార్పులు
తిరుమలలో నిర్వహించే హోటళ్లలో పరిశుభ్రత తప్పనిసరిగా పాటించడం, నిబంధనల ప్రకారం నిర్మాణాలు, ధరల పట్టికలు, ట్రేడ్ లైసెన్స్, జిఎస్టి డిస్ప్లే, సిబ్బంది సాంప్రదాయ వస్త్రధారణ, డిజిటల్ పేమెంట్ సౌకర్యం, వ్యర్ధాల తొలగింపు, నీటి విద్యుత్ పరిరక్షణ ఇవన్నీ తప్పక పాటించాలని టీటీడీ కోరింది. ప్రతి హోటల్ సాంప్రదాయాలను పాటించాలని టిటిడి అదనపు ఈవో సిహెచ్. వెంకయ్య చౌదరి అన్నారు. తాగునీటి పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. త్వరలో పలు హోటళ్లలో పైలెట్ ప్రాజెక్టుగా ఈ మార్గదర్శకాలను అమలు చేయనున్నట్లు వెల్లడించారు. భక్తులకు ఆరోగ్యకరమైన, శుభ్రమైన, సాంప్రదాయాత్మక వాతావరణాన్ని కల్పించేందుకు టీటీడీ చేస్తున్న ఈ ప్రయత్నంకు అందరూ సహకరించాలని కోరారు.
Also Read: Tirumala Tour: తిరుమలలో రహస్య పుణ్యక్షేత్రం.. మీరు మిస్ అవుతున్నారా?
పట్టుబడితే ఇక అంతే..
చట్టబద్ధంగా నిర్వహణ ఉండకపోతే, చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. టీటీడీ ఆరోగ్య విభాగం చెక్లిస్ట్‌ను అందించి, దాని ప్రకారం నిర్వహణ ఉండాలని చెప్పారు. ఈ సమావేశంలో పలువురు అధికారులు, హోటల్ యజమానులు పాల్గొన్నారు. మొత్తం మీద శ్రీవారి భక్తుల సంక్షేమం కోసం టీటీడీ ప్రత్యేక దృష్టి సారించి చర్యలు తీసుకోవడంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.