TTD News: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ ఈవో శ్యామలరావు గుడ్ న్యూస్ చెప్పారు. తిరుమలకు వెళ్లిన సమయంలో భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ఈవో ప్రత్యేక దృష్టి సారించారని చెప్పవచ్చు. భక్తులు ఎదుర్కొనే ప్రధాన సమస్యగా స్థానిక జీపులలో రవాణా ఛార్జీలు అధికంగా వసూలు చేస్తున్నట్లు టీటీడీ దృష్టికి వచ్చింది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు చైర్మన్ బీఆర్ నాయుడు అధ్వర్యంలో టీటీడీ దృష్టి సారించింది.
తిరుమల శ్రీవారి దర్శనార్థం భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తారు. కోరిన కోర్కెలు తీర్చే శ్రీ శ్రీనివాసుడి దర్శన భాగ్యం దొరికినా చాలు.. తమ కష్టాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. అందుకే తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా, విదేశాల నుండి కూడా భక్తులు వస్తారు. కొందరు భక్తులు తమ స్వంత వాహనాలలో తరలివస్తారు. మరికొందరు ఆర్టీసీ, రైల్వే సదుపాయాలను వినియోగించి తిరుమలకు చేరుకుంటారు. అటువంటి భక్తులు స్థానికంగా గల వాహనాలను వినియోగిస్తారు. ఈ సంధర్భంగా పలువురు వాహనదారులు ఇదే అదనుగా భావించి, భక్తుల వద్ద అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారని టీటీడీ కి ఫిర్యాదు అందింది.
దీనితో ఈ సమస్యకు టీటీడీ చెక్ పెట్టనుంది. ఈవో శ్యామలరావు స్పందిస్తూ.. ప్రైవేట్ వాహనాలు ఎక్కువ మొత్తంలో భక్తుల నుండి డబ్బులు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. భక్తుల సౌకర్యార్థం టీటీడీ ఇప్పటికే 12 ధర్మరథాలను నడుపుతోందని, త్వరలో మరిన్ని వాహనాలు రానున్నాయని ఈవో ప్రకటించారు. దీనితో ఎన్నో ఏళ్లుగా భక్తులు ఎదుర్కొంటున్న సమస్యకు ఫుల్ స్టాప్ పడనుందని చెప్పవచ్చు.
Also Read: Horoscope Today December 29th: ఈ రాశుల వారు శుభవార్తలు వింటారు, మీరు మాత్రం జాగ్రత్త సుమా
కాగా ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతుందని టీటీడీ ప్రకటించింది. అలాగే సోమవారం స్వామి వారిని 78,414 మంది భక్తులు దర్శించుకోగా.. 26,100 మంది భక్తులు తలనీలాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. అంతేకాదు స్వామి వారికి భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ. 3.45 కోట్ల మేర ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. భక్తుల కోసం టీటీడీ విశిష్ట సేవలు అందిస్తుందని, ఏదైనా సమస్య ఉంటే టీటీడీకి నేరుగా ఫిర్యాదు చేయవచ్చని ఈవో తెలిపారు.