Tirumala News: రీల్స్.. షార్ట్స్ చేసే పిచ్చోళ్లపై కొరడా ఝులిపించేందుకు సిద్ధమైంది టీటీడీ. తిరుమల పవిత్రతకు భంగం కలిగించేలా కేసులు నమోదు చేస్తామని హెచ్చిరించింది. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేసింది.
చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండడంతో కొందరు సోషల్‌మీడియా ఔత్సాహికులు తిరుమల శ్రీవారి ఆలయం, మాడవీధుల్లో వెకిలి చేష్టలు చేస్తున్నారు. అంతేకాదు నృత్యాలు చేస్తూ వీడియోలు చిత్రీకరించి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తున్నారని తేలింది. వాటికి సంబంధించి వీడియోలు విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.
ఈ విషయం టీటీడీ దృష్టి సారించింది. పవిత్ర ఆధ్యాత్మిక క్షేత్రంలో ఇలాంటి అభ్యంతరకర చర్యలు అనుచితమని తెలిపింది. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ఇలాంటి చర్యలు ఆధ్యాత్మిక వాతావరణానికి విఘాతం కలిగిస్తు న్నాయని పేర్కొంది.
తిరుమల క్షేత్రం.. భక్తి, ఆరాధనలకు నిలయమని, ఈ విషయాన్ని భక్తులు గుర్తుంచుకోవాలని చెప్పకనే చెప్పిది. అలాంటి వీడియోలు చిత్రీకరించేవారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటుందని ఓ ప్రకటనలో తెలిపింది.
ALSO READ: ఏపీలో వారికి కొత్త కబురు.. కొత్తగా నెలకు 4 వేలు పింఛన్
మహిళా భక్తులకు శుభవార్త
శ్రీవారి మహిళా భక్తుల కోసం కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది టీటీడీ. ఆగష్టు 8న టీటీడీ ఆలయాల్లో వరలక్ష్మి వ్రతం రోజు సౌభాగ్యం పేరుతో ఈ కార్యక్రమం చేపడుతోంది. టీటీడీ-హిందూ ధర్మప్రచార పరిషత్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. వరలక్ష్మీ వ్రతం రోజు సౌభాగ్యం పేరుతో మహిళలకు గాజులు, పసుపు, కుంకుమ, అక్షింతలు పంపిణీ చేయనుంది.
ఏపీ-తెలంగాణల్లో టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న 51 ఆలయాలలో పాల్గొన్న మహిళలకు సౌభాగ్యవతులకు వాటిని పంపిణీ చేయనున్నారు. దీనికితోడు శ్రీ పద్మావతీ అమ్మవారి లక్ష్మీ అష్టోత్తర శత నామావళి పుస్తకాన్ని అందించనున్నారు. దీనికి సంబంధించి టీటీడీ సిబ్బంది ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయాల వారీగా పార్శల్ ప్యాకెట్లు సిద్ధం చేశారు.
సౌభాగ్యవతులకు పంపిణీ చేసేందుకు ఓ భక్తుడు విరాళంగా ఇచ్చాడు. వాటిలో 8 లక్షల గాజులు, లక్షా 40 వేల కంకణాలు- పసుపు దారాలు, 1.40 లక్షల అమ్మవారి కుంకుమ ప్యాకెట్లు, అష్టోత్తర శత నామావళి పుస్తకాలను సదరు ఆలయాలకు తరలించారు.
తిరుమలలో రద్దీ కంటిన్యూ
మరోవైపు తిరుమలలో రద్దీ కంటిన్యూ అవుతోంది. శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులకు 12 గంటల సమయం పడుతోంది. ప్రస్తుతం 26 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. గురువారం తిరుమల శ్రీవారిని 66 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. 24 వేల మందికి పైగానే తలనీలాలు సమర్పించారు. గురువారం ఒక్కరోజు హుండి ఆదాయం రూ. 4.66 కోట్ల వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.