వల్లభనేని వంశీకి బెయిల్..
ఎట్టకేలకు వంశీకి బెయిల్..
త్వరలో వంశీ జైలు నుంచి విడుదల..
వంశీకి ఊరట
వంశీకి ఉపశమనం..
ఇలాంటి థంబ్ నెయిల్స్ సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలు. కానీ ఇందులో ఏదీ నిజం కాలేదు, ఏ ఒక్కటీ కరెక్ట్ కాలేదు. ఎందుకంటే ఇప్పటి వరకు వంశీ ఇంకా జైలు నుంచి విడుదల కాలేదు. ఫిబ్రవరి 13న అరెస్ట్ అయిన ఆయన ఇంకా రిమాండ్ ఖైదీగానే జైలులో ఉన్నారంటే నిజంగా ఆశ్చర్యం అనిపించక మానదు. అయితే ఆయనపై ఉన్న కేసులు అలాంటివి. ఆయన చేసిన తప్పులు అలాంటివి. వాటికి ప్రతిఫలమే రిమాండ్ ఖైదీగా ఇన్నాళ్ల ఆయన జైలు జీవితం. ఇప్పటికి 10 కేసుల్లో ఆయనకు బెయిల్ వచ్చింది. చిట్ట చివరిగా ఈరోజు నకిలీ ఇళ్ల పట్టాల కేసులో నూజివీడు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయినా ఆయన విడుదలవుతారా అంటే అనుమానమే. దానికి ఓ బలమైన కారణం ఉంది.
వల్లభనేని వంశీపై 10 కేసులున్నాయి. ఒకదాని తర్వాత ఒకటి అన్ని కేసుల్లోనూ ఆయనకు బెయిల్ వచ్చింది. అయినా సరే ఆయన విడుదల కావడానికి ఆటంకాలు ఎదురవడమే ఇక్కడ విశేషం. నకిలీ ఇళ్ల పట్టాల కేసు కంటే ముందు ఆయనకు అక్రమ మైనింగ్ కేసులో బెయిలు వచ్చింది. అయితే ఆ బెయిల్ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. ఆయనకు బెయిల్ రద్దు చేయాలని కోరింది. హైకోర్టు వెకేషన్ బెంచ్ ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ వేసింది. ఆ పిటిషన్ బుధవారం విచారణకు వస్తుంది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ కె వినోద్ చంద్రన్ ద్విసభ్య ధర్మాసనం విచారణ జరపాల్సి ఉంది. వాస్తవానికి బుధవారమే వల్లభనేని వంశీ బెయిల్ పై విడుదల కావాల్సి ఉంది. అయితే సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు ఆయనను జైలు అధికారులు విడుదల చేసే అవకాశం లేదని తెలుస్తోంది.
138 రోజులు..
వల్లభనేని వంశీ జైలుకి వెళ్లి 138 రోజులు అవుతోంది. ఇన్ని రోజులపాటు ఆయనకు బెయిల్ రాకపోవడం విశేషం. ఒకవేళ బెయిల్ వచ్చినా మరో కేసులో ఆయనపై పీటీ వారెంట్ దాఖలు అవుతోంది, మరో కేసులో ఆయనకు రిమాండ్ విధిస్తోంది కోర్టు. దీంతో ఒక కేసులో బెయిలొచ్చినా, ఇంకో కేసులో ఆయన జైలులో ఉండాల్సి వస్తోంది. ఈలోగా ఆయన ఆరోగ్యం పాడైంది. బరువు కూడా తగ్గారు. తన భర్త ప్రాణాలకు హాని ఉందని భార్య ఆవేదన వ్యక్తం చేస్తోంది. వైసీపీ నేతలతో కలసి గవర్నర్ కి కూడా ఆమె ఫిర్యాదు చేసింది. కోర్టు అనుమతితో ఆయన ఆస్పత్రిలో చేరి కొన్నిరోజులు చికిత్స తీసుకున్నారు కూడా. చివరకు 10 కేసుల్లో బెయిలొచ్చినా ఆయన విడుదలవుతారా లేదా అనేది అనుమానంగా మారడమే ఇక్కడ అన్నిటికంటే పెద్ద విశేషం.
టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో వంశీ మొదటిసారిగా అరెస్ట్ అయ్యారు. అయితే ఆ దాడి కేసునుంచి బయటపడేందుకు ఆయన ఎంచుకున్న ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయింది. అవడమే కాదు, దాంతో మరోకేసు నమోదైంది. అసలు కేసు కంటే కొసరు కేసు స్ట్రాంగ్ గా మారింది. కిడ్నాప్ అండ్ అట్రాసిటీ కేసు కావడంతో వంశీకి జైలు కంటిన్యూ అయింది. ఈలోగా ఫోర్జరీ డాక్యుమెంట్లు, అక్రమ మైనింగ్ అంటూ మరికొన్ని కేసులు జతకలిశాయి. కేసుల మీద కేసులు ఆయన్ను చుట్టుముట్టాయి. వివిధ కేసుల్లో బెయిలొచ్చిన ఆనందం ఏమాత్రం ఆయనకు లేకుండా పోయింది. చిట్ట చివరకు ఆయన భవితవ్యం సుప్రీంకోర్టుకి చేరింది.