ఈనెల 3న మాజీ సీఎం జగన్ నెల్లూరు జిల్లాకు రావాల్సి ఉండగా, ఆ పర్యటన అకస్మాత్తుగా రద్దు అయింది. దీనికి పెద్ద కారణం ఏమీ లేదు. తాము అడిగిన ప్రాంతంలో హెలిప్యాడ్ కి అనుమతి ఇవ్వలేదనే పంతంతో వైసీపీ నేతలు ఏకంగా జగన్ పర్యటనే రద్దు చేసుకున్నారు. వాస్తవానికి జగన్ నెల్లూరు జిల్లాకు వచ్చి జైలులో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డిని పరామర్శించాల్సి ఉంది. ఆ పరామర్శకు మహా అయితే ఓ అరగంట టైమ్ పడుతుంది. హెలిప్యాడ్ జైలు దగ్గరే ఏర్పాటు చేస్తే మరింత టైమ్ కలిసొస్తుంది. నెల్లూరు జిల్లా పోలీసులు కూడా అదే పనిచేశారు. నెల్లూరు జిల్లా సెంట్రల్ జైలు వద్ద హెలిప్యాడ్ ఏర్పాటుకి అనుమతి ఇచ్చారు. కానీ అది వైసీపీ నేతలకు నచ్చలేదు. దీంతో జగన్ పర్యటన రద్దయింది. పాపం కాకాణి, జగన్ వస్తారని వేచి చూస్తున్నారు. ఆయన అరెస్ట్ జరిగి రోజులు గడుస్తున్నా జగన్ మాత్రం ఆయన వద్దకు రాలేదు.
కాకాణి వెయిటింగ్..
కూటమి అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతలు ఒక్కొక్కరే అరెస్ట్ అవుతున్నారు. వారిని జగన్ సహా ఇతర నేతలు పరామర్శిస్తున్నారు. కాకాణి వంటి కీలక నేత అరెస్ట్ అయితే మాత్రం జగన్ ఇంకా ఆయన్ను పరామర్శించకపోవడం విశేషం. పెద్దిరెడ్డి సహా ఇతర నేతలు ఆల్రడీ కాకాణిని కలసి ధైర్యం చెప్పి వచ్చారు. కాకాణిపై ఉన్న ప్రధాన కేసు అక్రమ మైనింగ్. అయితే ఆయనపై మరికొన్ని కేసులు కూడా నమోదయ్యాయి. ఒక కేసులో బెయిల్ వస్తే, ఇంకో కేసు ఆయన్ను వెంటాడుతోంది. దీంతో ఆయన జైలులోనే ఉండాల్సిన పరిస్థితి. పార్టీ అధినేత తన పరామర్శకు వస్తారని ఆయన అనుకున్నా.. కాలం కలసి రాలేదు. జగన్ జైలుకి రాలేదు. జులై-3న జగన్ నెల్లూరు జిల్లాకు వస్తారు కాచుకోండి అంటూ వారం రోజులుగా వైసీపీ చోటా మోటా నేతలు సవాళ్లు విసిరారు. చివరకు జగన్, జైలులో ఉన్న కాకాణికి మొహం చాటేశారు.
అది సరిపోదా..?
హెలిప్యాడ్ విషయంలో పూర్తి క్లారిటీ లేకపోవడంతో జగన్ పర్యటన రద్దు చేస్తున్నట్టు వైసీపీ నేతలు అధికారికంగా ప్రకటించారు. జైలు వద్ద పోలీసులు చూపించిన హెలిప్యాడ్ ప్రాంతానికి నెల్లూరు జిల్లా వైసీపీ నేతలు వెళ్లారు, అక్కడ పరిస్థితి అంచనా వేసి వచ్చారు. అయితే అక్కడ జగన్ దిగితే.. ర్యాలీ చేయడం కష్టం. తమ బలప్రదర్శన చేయడం అంతకంటే కష్టం. అక్కడికి కార్యకర్తల్ని, జనాన్ని తీసుకొచ్చినా పెద్దగా ఫలితం ఉండదు. దీంతో వైసీపీ నేతలు ఈ కార్యక్రమాన్ని రద్దు చేసుకోవాలని జగన్ ని కోరినట్టు తెలుస్తోంది. మైలేజీ రాని కార్యక్రమానికి తాను మాత్రం ఎందుకొస్తానని జగన్ అనుకున్నట్టు అర్థమవుతోంది. అందుకే ఆయన కాకాణిని కలిసేందుకు రావడంలేదు. జైలులో ఉన్న నేతని పరామర్శించడానికి హెలికాప్టర్ లోనే రావాలనే రూల్ ఏమీ లేదు. నాయకుడు మనకు కావాల్సినవాడు అనుకుంటే ఎలాగైనా వచ్చి పరామర్శించి వెళ్లొచ్చు. కానీ జగన్ ఇక్కడ ర్యాలీని, తద్వారా వచ్చే మైలేజీని చూసుకున్నారు. అందుకే వెనక్కి తగ్గారు. జగన్ పర్యటనకోసం చాలామంది వైసీపీ కార్యకర్తలు కూడా ఆశగా ఎదురు చూశారు. వారంతా పార్టీ ప్రకటనన చూసి నిరాశ చెందారు.