Vallabhaneni Vamsi: అక్రమ మైనింగ్ కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీకి సుప్రీంకోర్టులో చుక్కెదురు అయ్యింది. ముందస్తు బెయిల్ మంజారు చేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు పక్కన పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వ వాదనలు వినకుండా ముందస్తు బెయిల్ ఇవ్వడాన్ని తప్పు పట్టింది సుప్రీంకోర్టు. ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై తాజాగా విచారణ చేపట్టాలని ఆదేశించింది ధర్మాసనం.
ప్రభుత్వం వాదనలు వినకుండా ముందస్తు వంశీకి బెయిల్ ఇవ్వడాన్ని తప్పుబట్టింది సుప్రీంకోర్టు. ప్రభుత్వ పిటిషన్‌పై మళ్లీ విచారణ చేపట్టాలని ఆదేశించింది. ఈ కేసు మెరిట్స్‌లోకి, పీటీ వారెంట్స్‌లోకి వెళ్లడం లేదని తెలిపింది. ఇరువురి పక్షాల వాదనలు విని మెరిట్స్ ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది.
వారం రోజుల్లో కౌంటరు దాఖలు చేస్తామని చెప్పింది ఏపీ ప్రభుత్వం. ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ తన వాదనలు సుప్రీంకోర్టు ముందు వినిపించారు. ప్రభుత్వం కౌంటరు దాఖలు చేసిన నాలుగు వారాల్లో విచారణ ముగించి తీర్పు ఇవ్వాలని ఆదేశంలో పేర్కొంది ధర్మాసనం.
ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీ ప్రభుత్వం హయాంలో తన నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ కు పాల్పడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. స్థానికుల నుంచి ఫిర్యాదులు రావడంతో కూటమి సర్కార్ దృష్టి పెట్టింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో తనను అరెస్టు చేస్తారనే భయంతో హైకోర్టుకు వెళ్లి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు మాజీ ఎమ్మెల్యే.
ALSO READ: కర్ణాటకను దెబ్బ కొట్టిన ఏపీ, మంత్రి లోకేష్ స్కెచ్ సక్సెస్
హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై గురువారం విచారణ జరిగిన న్యాయస్థానం, కీలక ఉత్తర్వులు ఇచ్చింది. జైలు నుంచి విడుదలై వంశీ అస్వస్థతకు గురయ్యారు. ఆయన చికిత్స తీసుకుంటున్నారు. తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల నేపథ్యంలో వంశీ ముందస్తు బెయిల్ వ్యవహారంపై ఆసక్తి మొదలైంది.
ఫిబ్రవరి 16న హైదరాబాద్‌లో అరెస్టయిన వల్లభనేని వంశీ, కొన్ని కేసుల్లో షరతులతో కూడిన బెయిల్ మంజూరు అయ్యింది. దీంతో జులై 2న విజయవాడ జైలు నుంచి విడుదలయ్యారు. దాదాపు 140 రోజులపాటు ఆయన జైలులో ఉన్న విషయం తెల్సిందే.