Vallabhaneni Vamsi Wife: వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వల్లభనేని వంశీని ఏపీ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లో ఆయన ఇంటికి చేరుకున్న పోలీసులు, నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసి విజయవాడకు తరలించారు. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో నిందితుడైన వంశీపై ఆయన చేసిన నిర్వాకంతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదైంది. ఎన్నికలకు ముందు యువగళం సభలో వంశీపై పిల్ల సైకో అని ధ్వజమెత్తిన లోకేష్ తాము అధికారంలోకి రాగానే ఆయన్ని అరెస్ట్ చేస్తామని ప్రకటించారు. ఎన్నికల ఫలితాల తర్వాత పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్న వంశీ ఇప్పటికి పోలీసులకు చేతికి చిక్కారు.
ఈ తరుణంలో గన్నవరం వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని విజయవాడ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. నిన్న ఉదయం హైదరాబాదులో వంశీని అరెస్ట్ చేసిన పోలీసులు విజయవాడ తరలించారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో 8 గంటల పాటు ప్రశ్నించారు. వంశీతో పాటు ఇదే కేసులో మరో ఇద్దరు నిందితులు ఎలిమినేని శివరామకృష్ణ ప్రసాద్, నిమ్మ లక్ష్మీపతిలను పోలీసులు విజయవాడలో అరెస్ట్ చేశారు. వీరిలో ఏ1గా వంశీ, ఏ7గా శివరామకృష్ణ ప్రసాద్, ఏ8గా నిమ్మ లక్ష్మీపతిని చేర్చారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు తర్వాత జడ్జి ముందు హాజరుపరిచారు. టీడీపీ ఆఫీసు ఉద్యోగి సత్యవర్ధన్ ను అపహరించి దాడి చేశారనే అభియోగంతో వంశీతో పాటు మరికొందరిపై అట్రాసిటీ చట్టం ప్రకారం నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. విజయవాడ పటమట పోలీస్ స్టేషన్లో సత్యవర్థన్ వాంగ్మూలం రికార్డు చేశారు.
ఇక వంశీ అరెస్ట్‌పై ఆయన భార్య స్పందించారు. అరెస్ట్ వెనక రాజకీయ కుట్ర ఉందన్నారు వల్లభనేని వంశీ భార్య పంకజశ్రీ. అరెస్ట్‌పై న్యాయ పోరాటం చేస్తానని చెప్పారు. ఎందుకు అరెస్ట్ చేశారో.. ఏ కేసులో అరెస్ట్ చేశారో ఇప్పటికి చెప్పడం లేదని ఫైర్ అయ్యారు. అసలు ఎక్కడి తీసుకెళ్తున్నారో కూడా సమాచారం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే ఇష్యూపై ఖచ్చితంగా హైకోర్టుకు వెళ్తానని.. న్యాయపరంగా ఎదుర్కొంటామన్నారు పంకజశ్రీ.
ఇదిలా ఉంటే.. వైసీపీ ప్రభుత్వ హయాంలో గన్నవరం టీడీపీ ఆఫీసుపై వైసీపీ నేతలు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నిందితుడిగా ఉన్నారు. కొన్ని రోజుల క్రితమే ఆ కేసుకు సంబంధించి వంశీ అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పట్నుంచి వంశీ కోసం గాలిస్తున్నారు. వంశీ ఆచూకీ పోలీసులకే కాదు.. సొంత పార్టీ నేతలకు కూడా తెలియలేదు. 2023, ఫిబ్రవరి 20న గన్నవరం టీడీపీ కార్యాలయంపై అప్పటి ఎమ్మెల్యే వంశీ అనుచరులు దాడికి పాల్పడ్డారు.
సుమారు 5 గంటలపాటు వంశీ అనుచరులు టీడీపీ కార్యాలయంలో విధ్వంసం సృష్టించారు. దానిపై అప్పట్లో టీడీపీ నాయకులు కేసులు పెట్టినా వంశీ ప్రోద్భలంతో పోలీసులు విచారణను అటకెక్కించారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడంతో మళ్లీ ఆ కేసు ఊపిరి పోసుకుంది. అప్పట్లో విధ్వంసం సృష్టించిన వారిలో 20 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని రాయదుర్గం సమీపంలోని ఒక అపార్ట్‌మెంట్‌లో వంశీ ఉన్నారని తెలుసుకుని విజయవాడ పోలీసులు అక్కడికి వెళ్లారు. వంశీ ఉండే ప్లాట్‌లోకి వెళ్లి నోటీసు ఇచ్చి అదుపులోకి తీసుకున్నారు.
తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన వంశీని టీడీపీ అధిష్టానం ఎంతో ప్రోత్సహించింది. గన్నవరం నియోజకవర్గంలో బలమైన నాయకుడిగా ఎదగడానికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందించింది. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున రెండో సారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వంశీ ప్లేటు ఫిరాయించారు. టీడీపీ అధికారం కోల్పోవడంతో వైసీపీ పక్షాన చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లపై అడ్డూ అదుపు లేకుండా తీవ్ర విమర్శలు చేశారు. అఖరికి చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై కూడా దారుణ విమర్శలు చేశారు. ఆ సమయంలో టీడీపీ నేతలే కాకుండా, సామాన్య ప్రజలు కూడా వంశీ వ్యాఖ్యలను అసహ్యించుకున్నారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న లోకేష్. తన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వంశీని వదిలిపెట్టేది లేదని ఎన్నికల ముందే వార్నింగ్ ఇచ్చారు.
Also Read: వంశీకి 14 రోజుల రిమాండ్.. విజయవాడ జిల్లా జైలుకు తరలింపు
2024లో కూడా వైసీపీనే అధికారంలోకి వస్తుందనే ధీమాతో వంశీ నియోజకవర్గంలో అరాచకాలు కొనసాగించారన్న విమర్శలున్నాయి. టీడీపీ తరఫున ఎన్నికైన ఎమ్మెల్యే అయ్యుండి టీడీపీ కార్యాలయంపైనే దాడికి దిగారు. అలాగే నియోజకవర్గంలో మట్టి తవ్వకాల విషయంలో కూడా వంశీ అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. 2024 ఎన్నికల్లో వైసీపీ తరఫున బరిలోకి దిగిన వంశీ దారుణ పరాజయాన్ని మూటగట్టుకున్నారు. ఎన్నికల కౌంటింగ్ రోజున మధ్యలోనే కౌంటింగ్ కేంద్రం నుంచి మాయమైన ఆయన. అప్పట్నుంచి అజ్ఞాతంలోనే గడిపారు. ఇప్పుడు అరెస్ట్ తతంగం పూర్తి అవ్వడంతో గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆయన అక్రమాల చిట్టా బయట పెడుతున్నారు.
తన అరెస్టుకు ముందు పార్టీ ఆఫీసుపై దాడికి సంబంధించి వంశీ ఇచ్చిన ట్విస్టులు టీడీపీ శ్రేణులకు పెద్ద షాకే ఇచ్చాయి. గన్నవరం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో స్వయంగా ఫిర్యాదు దారుడే తనకేం తెలియదంటూ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడంతో పార్టీ శ్రేణులు ఒక్కసారిగా షాక్ తిన్నాయి. కంప్లైంట్ చేసిన సత్యవర్ధన్ ఈ కేసుకు.. తనకూ ఏ సంబంధం లేదని కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా.. ఆ పార్టీ కార్యాలయంలో పని చేస్తూ ఫిర్యాదు చేసిన వ్యక్తి.. ఇప్పుడు తనకేం తెలియదని అఫిడవిట్ ఇవ్వడమే కాకుండా.. పోలీసులు తనను బలవంతం చేసి ఫిర్యాదు తీసుకున్నారు. తనకు పోలీసుల నుంచి రక్షణ కావాలంటూ పోలీసులపై ఎదురు ఆరోపణలు చేస్తూ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడంతో.. తెలుగుదేశ శ్రేణులకు దిమ్మ తిరిగినట్టైంది.
కేసు విత్‌డ్రా తీసుకున్నట్లు కోర్టులో అఫిడవిట్ వేసిన తర్వాత.. సత్యవర్ధన్‌ను వంశీ అనుచరులు వైజాగ్ తీసుకెళ్లి బంధించారు. ఆ క్రమంలో సత్యవర్ధన్ కనిపించకపోవడంతో అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొబైల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా.. సత్యవర్ధన్ వైజాగ్‌లో ఉన్నట్లు గుర్తించి.. సత్యవర్ధన్‌ను కాపాడి, వంశీ అనుచరులను అరెస్ట్ చేయడంటో వంశీ నిర్వాకం వెలుగు చూసింది. ఈ కిడ్నాప్, బెదిరింపులకు సంబంధించి వంశీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేశారు. వంశీ రాజకీయం ఎప్పుడూ ఇలాగే ఉంటుంని.. తమ పార్టీ అధికారంలో ఉన్నా.. ఆయన చక్రం తిప్పాలని చూడటంపై తెలుగు తమ్ముళ్లు నిట్టూర్పులు విడుస్తున్నారు.