Varahi Vijayabheri Yarta (Latest Political News in Andhra Pradesh): ఏప్రిల్ 7 నుంచి పవన్ కల్యాణ్ వారాహి విజయభేరి యాత్ర ఉత్తరాంధ్రలో నిర్వహించనున్నారు. స్వల్ప అస్వస్థత కారణంగా పవన్ ఎన్నికల ప్రచారానికి బ్రేక్ పడింది. పిఠాపురంలో వారాహి విజయభేరి ప్రచార యాత్ర తర్వాత పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన కోలుకోవడంతో మళ్లీ ప్రచారంలోకి దిగనున్నారు. ఏప్రిల్ 7 నుంచి ఉత్తరాంధ్రలో వారాహి యాత్ర నిర్వహించనున్నారు.
యాత్రలో భాగంగా అనకాపల్లిలో 7న సభ నిర్వహించనున్నారు. 8న ఎలమంచిలి, 9న పిఠాపురంలో సభ నిర్వహించనున్నారు. ఆ తరువాత జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్న నెల్లిమర్ల, అనకాపల్లి, యలమంచిలి నియోజకవర్గాల్లో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. పిఠాపురం తర్వాత ఆయన తెనాలిలో ప్రచారం చేయాల్సి ఉండగా.. జ్వరం కారణంగా ఆ పర్యటన రద్దయింది.
కాగా.. జనసేన అభ్యర్థులు ఇప్పుడు అయోమయంలో పడ్డారు. ఆ పార్టీ గుర్తైన గాజు గ్లాసును ఈసీ ఫ్రీ సింబల్ గా గుర్తించిన విషయం తెలిసిందే. దీంతో జనసేన నేతల్లో కొత్త టెన్షన్ మొదలైంది. ఫ్రీ సింబల్ గా ఉన్న గాజుగ్లాసును జనసేన పొందకపోతే ఆ పార్టీ అభ్యర్థులు ఏ గుర్తుపై పోటీ చేయాలన్న దానిపై సస్పెన్స్ నెలకొంది. దాదాపు గాజుగ్లాసే వస్తుందన్న నమ్మకం ఉన్నా.. ప్రతిసారీ పార్టీ గుర్తుపై జనసేనకు షాకులు తప్పడం లేదు.