వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీంద్రరెడ్డి పోలీసుల అదుపులో ఉన్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు చేశారని వర్రా రవీంద్ర రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా మంగళవారం అతడిని అదనపు మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. విచారణ అనంతరం 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ నేపథ్యంలో రిమాండ్ రిపోర్ట్‌లో వర్రా రవీంద్రరెడ్డి సంచలన విషయాలు బయటపెట్టారు. ఐప్యాక్ టీమ్ కంటెంట్ ఇస్తే ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసేవాళ్ళమని చెప్పారు.
Also read: ప్రశ్నిస్తే ఖేల్ ఖతమా? మీకు భయపడాలా? మీరు మాత్రం పవిత్రులా? పోసాని సీరియస్
వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడేవారిని లక్ష్యంగా చేసుకుని నాయకులు, వారి కుటుంబ సభ్యులపై పోస్టులు పెట్టేవాళ్ళమని అన్నారు. వైసీపీ సోషల్‌మీడియా బాధ్యతలు సజ్జల భార్గవరెడ్డి తీసుకున్న తరవాత మరింత రెచ్చిపోయామని చెప్పారు. జడ్జిలకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టాలని భార్గవరెడ్డి బెదిరించాడని అన్నారు. 2023 నుండి తన ఫేస్‌బుక్ ఐడీతో భార్గవరెడ్డి పోస్టులు పెట్టాడని తెలిపాడు. షర్మిల, సునీత, విజయమ్మపై అసభ్యకర పోస్టులు పెట్టామని ఒప్పుకున్నారు. ఆ పోస్టులు పెట్టాలని అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి తమకు కంటెంట్ ఇచ్చారని అన్నారు.
వైసీపీ సోషల్ మీడియాలో భార్గవరెడ్డి, అర్జున్ రెడ్డి, సుమారెడ్డి కీలకంగా ఉన్నారని వెల్లడించారు. దీంతో వైసీపీ సోషల్ మీడియానే మాజీ సీఎం, పార్టీ అధినేత జగన్ కుటుంబ సభ్యులపై పోస్టులు పెట్టడం సంచలనంగా మారింది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేయడం, అసభ్య కామెంట్లు చేసిన వారిపై టీడీపీ సర్కార్ కన్నేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వంలో, ప్రభుత్వం మారిన తరవాత సోషల్ మీడియాలో మహిళలపై అసభ్య పదజాలంతో దూషించిన వారిని కటకటాల్లోకి నెట్టేస్తున్నారు.