Posani Serious Comments: ప్రశ్నిస్తే చంపేస్తారా.. కాళ్లు విరగ్గొడుతున్నారు.. జైలుకు పంపుతున్నారు.. మీరు చేస్తే ఒకటి.. మేము చేస్తే మరొకటా.. ఇంకా మీరు మారరా.. ప్రశ్నించే హక్కు నాకుంది.. నన్ను చంపేస్తే ప్రశ్నించే గొంతులు ఉండవని అనుకుంటున్నారా.. అది జరగని పని.. ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉంది. మా గొంతులు నొక్కి టీటీడీ చైర్మన్ పదవి దక్కించుకున్నారు బీఆర్ నాయుడు. ఉన్నతమైన పదవిలో ఉండి కూడా ఇంకా బుద్ధి రాదా అంటూ ప్రశ్నించారు వైసీపీ నేత, సినీ నటుడు పోసాని కృష్ణమురళి.
ఏపీ వ్యాప్తంగా వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులపై పోలీసులు చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో తాజాగా పోసాని కృష్ణమురళి స్పందించారు. అయితే పలు మీడియా ఛానళ్ల పై పోసాని తనదైన శైలిలో రుసరుసలాడారు. పోసాని మాట్లాడుతూ.. ప్రశ్నించే గొంతుకలను నలిపి వేసేందుకు కూటమి ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలకు శ్రీకారం చుట్టిందన్నారు. అందుకు కూటమి ప్రభుత్వ అనుకూల మీడియా వంత పాడుతుందని, అటువంటి చర్యలను మానుకోవాలని పోసాని సీరియస్ అయ్యారు. 2014 ఎన్నికల సమయంలో 600 వాగ్దానాలు ప్రజలకు ప్రకటించి, గెలిచిన అనంతరం ఐదు శాతం వాగ్దానాలను కూడా నెరవేర్చని ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందన్నారు.
2024 ఎన్నికల్లో సైతం ఆకాశం నుండి నక్షత్రాలను తీసుకువస్తాననే రీతిలో చంద్రబాబు అబద్ధపు హామీలను గుప్పించారని, అలాగే సూపర్ సిక్స్ అంటూ ప్రజలను మోసం చేశారన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలను ప్రశ్నిస్తున్న తమ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టులపై కక్షపూరిత రాజకీయాలలో భాగంగా, కేసులు నమోదు చేస్తూ అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. కేసులు నమోదు చేసి జైలుకు పంపడం, లేకుంటే కాళ్లు విరగగొట్టడం, చివరగా గొంతు నులిమి వేయడం ఇదే తెలుగుదేశం పార్టీ నైజంగా మారిందన్నారు.
టీడీపీ అధికారంలో లేని సమయంలో నాడు ప్రభుత్వాన్ని ప్రశ్నించ లేదా అంటూ పోసాని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుకూల మీడియాను అస్త్రంగా మార్చుకొని తమలాంటి వారి గొంతుకలను నులిమి వేసేందుకు టీడీపీ విస్తృత ప్రయత్నాలు చేస్తుందని విమర్శించారు. తాను భారతదేశ పౌరుడిగా, తనకు ఉన్న హక్కు ద్వారా ప్రశ్నించడం జరుగుతుందన్నారు. పూర్వం ఎవరైనా ప్రశ్నిస్తే.. ఆ ప్రశ్నకు సమాధానం వెతికే నైజం నాటి రాజకీయ నాయకులకు ఉండేదని, నేడు అందుకు భిన్నంగా ప్రశ్నించే వారిని ఇబ్బందులకు గురి చేసే స్థితి ఏపీలో ఉందన్నారు. అలాగే తనలాంటి వారి గురించి అబద్ధపు ప్రచారాలు చేసి చివరకు టీటీడీ చైర్మన్ పదవిని బీఆర్ నాయుడు దక్కించుకున్నారని, ఆ పదవి ద్వారా అవినీతికి పాల్పడవచ్చని నాయుడు ప్లాన్ అంటూ ఓ రేంజ్ లో పోసాని కామెంట్స్ చేశారు.